దీక్షకు కోర్టు అనుమతి కోరుతాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దీక్షకు కోర్టు అనుమతి కోరుతాం

దీక్షకు కోర్టు అనుమతి కోరుతాం

Written By news on Saturday, September 26, 2015 | 9/26/2015


దీక్షకు కోర్టు అనుమతి కోరుతాం
 ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టేందుకు సోమవారం హైకోర్టును అనుమతి కోరతామని పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష విషయంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయన ఇంట్లో కూడా దీక్ష చేసుకోనీయరని, అడ్డుకుంటారని అర్థమైపోయింది.

సీఎం పంథా మాకు తెలిసిన తర్వాత నిరాహార దీక్షను ఆపకూడదు.. చేయాలన్న ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించాం. అయితే హౌస్‌మోషన్ రూపంలో కాకుండా సాధారణ పనిదినాల్లో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. సోమవారం తిరిగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం. కోర్టులో తమకు అనుకూలమైన నిర్ణయం వస్తుందని నమ్ముతున్నాం’ అని పెద్దిరెడ్డి చెప్పారు. ‘గతంలో చంద్రబాబు ఢిల్లీలో ఒకసారి, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మరోసారి.. రెండుసార్లు నిరాహార దీక్షలు చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు సీఎం జయలలిత కావేరి జలాలను రాష్ట్రానికి సాధించుకోవడానికి నిరాహార దీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకొని జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టదలచిన దీక్షను అడ్డుకోవడం దురదృష్టకరమని’ పెద్దిరెడ్డి అన్నారు.
 
ఏది ప్రయోజనం?: ‘రాష్ట్రానికి కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందని టీడీపీ నేతలు ప్రకటనలతో హడావుడి చేశారు. గతంలో ఏడు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చిన మాదిరే రూ.350 కోట్లు, రాజధాని, పోలవరం నిర్మాణాలకు మరికొంత.. మొత్తం కలిపి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేక హోదా ఎక్కడ? ఈ వెయ్యి కోట్ల ప్రకటన ఎక్కడ? ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లింది ఇందుకేనా? కేంద్రమంత్రులందరినీ కలిశారు. దేని కోసమో అర్థం కావడం లేదు.

ఆయన పార్టీ ఎమ్మెల్యే, చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసుల నుంచి బయటపడడం కోసం అందరినీ కలుస్తున్నారా? లేక ప్రత్యేక హోదా కోసం కలిసారా? అన్నదానిపై ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై యూనివర్సిటీలో జరిగిన సదస్సులో పాల్గొన్నారని ఒక ప్రొఫెసర్‌పై చర్య తీసుకుంటున్నారు. ఇవన్ని చూస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబే అడ్డుపడుతున్నారు’ అని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.
 
భయంతోనే అనుమతి నిరాకరణ
వైఎస్ జగన్ దీక్షపై చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడిన మాటలు చూస్తే.. ఆయనకు ఎంత భయం పట్టుకుందో అర్థమవుతుందని పెద్దిరెడ్డి అన్నారు. దీక్ష జరిగితే, ప్రత్యేక హోదా వస్తుంది.. వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి, రాష్ట్రానికీ మంచి జరుగుతుంది. అయినా ఆయన దీక్షను అడ్డుకోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్షల విషయంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు వింటే.. గతంలో ఆయన రెండు పూటలు తిని ఒక పూట దీక్షలు చేశారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: