నేడే రాష్ట్రపతి ఎన్నిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » నేడే రాష్ట్రపతి ఎన్నిక

నేడే రాష్ట్రపతి ఎన్నిక

Written By news on Thursday, July 19, 2012 | 7/19/2012

ఓటేసేందుకు సిద్ధమైన 4,896 మంది చట్టసభల ప్రతినిధులు
వారి మొత్తం ఓట్ల విలువ 10.98 లక్షలు.. 
గెలిచే అభ్యర్థికి 5,49,442 ఓట్ల విలువ అవసరం
{పణబ్‌కు 7.5 లక్షల ఓట్ల విలువ రావొచ్చని యూపీఏ అంచనా
ఓటింగ్‌కు సీపీఐ, ఆరెస్పీ, టీడీపీ, టీఆర్‌ఎస్ దూరం
22వ తేదీన ఫలితాల వెల్లడి

న్యూఢిల్లీ: ఎన్నెన్నో మలుపులు, అనూహ్య పరిణామాలతో నెల రోజులుగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ, ఎన్డీఏ మద్దతుతో బరిలో నిలిచిన పి.ఎ.సంగ్మాలలో ఎవరికి ఓటేయాలనే విషయంలో రాజకీయ పార్టీలన్నీ స్పష్టమైన వైఖరిని ప్రకటించిన నేపథ్యంలో గురువారం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలో సంగ్మాపై దాదా గెలుపు లాంఛనమేనని...భారీ ఓట్ల విలువ తేడాతో ఆయన గెలుస్తారని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. 

ఈ పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 4,896 మంది చట్టసభల ప్రతినిధులు (776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలు) అర్హత కలిగి ఉన్నారు. వారి మొత్తం ఓట్ల విలువ 10.98 లక్షలుగా ఉండగా అర్హత కలిగిన చట్టసభల ప్రతినిధులంతా ఓటేసిన పక్షంలో గెలిచే అభ్యర్థి 5,49,442 లక్షల ఓట్ల విలువ సాధించాల్సి ఉంటుంది. అయితే మెజారిటీ రాజకీయ పార్టీల మద్దతు ప్రణబ్‌కే ఉండటంతో ఆయనకు సుమారు 7.5 లక్షల ఓట్ల విలువ లభిస్తుందని యూపీఏ ఎన్నికల మేనేజర్లు భావిస్తున్నారు. 

సంగ్మాకు గరిష్టంగా సుమారు 3.15 లక్షల ఓట్ల విలువ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికల్లా ఫలితం వెలువడనుంది. రాష్ట్రపతి ఎన్నికలో యూపీఏకు మద్దతిస్తున్న ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, జేడీఎస్‌తోపాటు విపక్ష కూటమి ఎన్డీఏలోని జేడీయూ, శివసేన దాదాకు మద్దతిస్తున్నాయి. అలాగే వామపక్ష పార్టీలైన సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ కూడా ప్రణబ్‌వైపే మొగ్గు చూపాయి. మరోవైపు సంగ్మాకు బీజేడీ, అన్నాడీఎంకే, బీజేపీ, అకాలీదళ్ మద్దతిస్తున్నాయి. అయితే సుమారు 36 వేల ఓట్ల విలువ కలిగిన సీపీఐ, ఆరెస్పీ, టీడీపీ, టీఆర్‌ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. కాగా, రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే ఎంపీలంతా తప్పనిసరిగా గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంస్థ నుంచి లేఖను చూపాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్, ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న వి.కె. అగ్నిహోత్రి తెలిపారు.

యూపీఏ నేతలకు సోనియా విందు

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో యూపీఏ మిత్రపక్షాలతోపాటు కూటమికి బయటి నుంచి మద్దతిస్తున్న పార్టీలన్నీ ఏకతాటిపై ఉన్నాయనే సంకేతాలిచ్చేలా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఆయా పార్టీల నేతలకు విందు ఇచ్చారు. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు ఏర్పాటు చేసిన ఈ విందుకు తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీలు కె.డి. సింగ్, సుఖేందు శేఖర్‌రాయ్ హాజరయ్యారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి ఓ టేబుల్ వద్ద ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ ఆశీనులవగా ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, బీఎస్పీ నేత సతీష్‌చంద్ర మిశ్రా, ఆర్‌ఎల్డీ చీఫ్ అజిత్‌సింగ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లు సోనియాతో కలిసి మరో టేబుల్ వద్ద కూర్చున్నారు. విందుకు హాజరైన అతిథులకు కాంగ్రెస్ సీనియర్లు అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేదీ, అంబికా సోని, రాజీవ్ శుక్లా, షకీల్ అహ్మద్ స్వాగతం పలికారు.

ఓటింగ్‌లో పాల్గొనేందుకు రాజా, కనిమొళికి అనుమతి

2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టెలికం మంత్రి, లోక్‌సభ సభ్యుడు ఎ. రాజా, డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళి రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు ఢిల్లీ కోర్టు బుధవారం అనుమతించింది. కాగా, కుమార్తె కిడ్నాప్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) ఎమ్మెల్యే బీబీ జాగిర్‌కౌర్ రాష్ట్రపతి ఎన్నికలో ఓటేసేందుకు పంజాబ్-హర్యానా హైకోర్టు ఒకరోజుపాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

తమిళనాడులో ప్రచారం ముగించిన సంగ్మా

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ మద్దతిస్తున్న పి.ఎ. సంగ్మా బుధవారం తమిళనాడులో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ముఖ్యమంత్రి జయలలితను చెన్నైలోని ఆమె నివాసంలో కలుసుకొని తనకు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికలో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌కు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మద్దతిచ్చినందుకు తనకేమీ కోపం లేదని సంగ్మా తెలిపారు. ప్రతి పార్టీకి కొన్ని రాజకీయ ఒత్తిళ్లు, లెక్కలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
Share this article :

0 comments: