సైకిల్ ‘గాలి’ తీస్తున్న బాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సైకిల్ ‘గాలి’ తీస్తున్న బాబు

సైకిల్ ‘గాలి’ తీస్తున్న బాబు

Written By news on Saturday, July 21, 2012 | 7/21/2012

రాష్ట్రపతి ఎన్నికల్లో బాబు వైఖరిని తప్పుబడుతున్న నేతలు
- నాయకత్వ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటున్న సీనియర్లు
- థర్డ్ ఫ్రంట్‌లో కాంగ్రెస్ మద్దతు తీసుకోలేదా? కేంద్రంలో మంత్రి పదవులు పొందలేదా?
- ఇప్పుడు ప్రణబ్‌కు ఓటు వేయకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?
- ఆనాడు బీజేపీతో అంటకాగి ఇప్పుడు అంటరానిదంటే నమ్ముతారా?
- అధికారంలో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని ఓడిపోగానే మతతత్వ పార్టీ అయిందా?
- ఓటు హక్కు వినియోగించుకోవాలని లెక్చర్లిచ్చిన మనమే.. దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలకు దూరంగా ఉండాలా?.. పార్టీ నాయకత్వం స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతోందన్న విషయాన్ని ప్రజలు గ్రహించారంటున్న నేతలు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిం ది నేనే’’.. అంటూ గొప్పలు పోయిన చంద్రబాబు.. గురువారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ధైర్యమే చేయలేకపోయారు. ఓటు విలువపై ఊకదంపుడు ప్రసంగాలు చేసిన టీడీపీ అధినేత.. తనతోపాటు పార్టీ ప్రజాప్రతినిధులందరినీ ఓటు హక్కుకు దూరంగా ఉంచారు. అత్యంత కీలకమైన దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలన్న చంద్రబాబునాయుడు నిర్ణయంపై ఆ పార్టీ నేతల్లో ఇప్పటికీ విస్తృతమైన చర్చ జరుగుతూనే ఉంది. 

జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో బాబు విఫలమవుతున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పార్టీలో పటిష్టమైన నాయకత్వం లేదనడానికి ఇది నిదర్శనమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘దేశంలో ఏక పార్టీల పాలనకు కాలం చెల్లింది. ముందున్నది సంకీర్ణ ప్రభుత్వాల యుగమే’’ అని ఊదరగొట్టిన చంద్రబాబు.. రాష్ట్రపతి ఎన్నిక లకు దూరంగా ఉండటం సరైన నిర్ణయం కాదని అంటున్నారు. 

అత్యున్నతమైన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఒక దిశా నిర్దేశం లేకుండా వ్యవహరించడమేనని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ‘‘జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీయే భాగస్వామ్య పక్షాలు సైతం యూపీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. యూపీఏకు దూరంగా ఉంటున్న సీపీఎంలాంటి పార్టీలు కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చాయి. దీనిని ఆషామాషీ రాజకీయంగా చూడాల్సిన సందర్భంకాదు’’ అని వారు అన్నారు. ‘‘ఎన్నికల్లో ఓటు వేయటం పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని కాదనే అధికారం చంద్రబాబుకు లేదు’’ అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి వ్యాఖ్యానించారు. 

‘‘ఈ ఎన్నికకు దూరంగా ఉండాలన్న పార్టీ వైఖరి సరికాదనే వైఖరితో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది కచ్చితంగా రాజకీయంగా చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయం’’ అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం సోయిలో లేదన్న ప్రచారం ఇప్పటికే ప్రజల్లో బాగా నాటుకుపోయిందని, ఇలాంటి తరుణంలో కీలకమైన అంశంలో చొరవ తీసుకోకుండా రంగం నుంచి తప్పుకోవడం ఎత్తుగడ వ్యవహారం అనిపించుకోదన్న భావన చాలా మంది నేతల్లో వ్యక్తమవుతోంది. 

‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో వైఖరిని వెల్లడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తర్జనభర్జన పడినప్పటికీ, నిర్ణయాధికారాన్ని పార్టీ అధ్యక్షుడికి కట్టబెట్టారు. ఆయన జైలులో ఉన్నప్పటికీ, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, మరో నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు వెళ్లి ఆయనతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించగలిగారు. అలాంటిది మూడు దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ కేంద్రంలో చక్రం తిప్పామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు తప్పించుకోవడం సరైన విధానం కాదు’’ అని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండటానికి చంద్రబాబు చెబుతున్న కారణాలను అదే పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ‘‘ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని చె బుతున్నామో అదే పార్టీ మద్దతుతో కేంద్రంలో మంత్రి పదవులను అనుభవించలేదా? ఏ బీజేపీని మతతత్వ పార్టీగా ప్రచారం చేస్తున్నా మో అదే పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకోవటంతో పాటు లోక్‌సభ స్పీకర్ పదవిని తీసుకోలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మాత్రమే ఎందుకు వచ్చాయి’’ అనే అనుమానాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. బలహీనమైన నాయకత్వానికి ఇది బల మైన ఉదాహరణ అని అభివర్ణిస్తున్నారు. 

1999, 2004 ఎన్నికల్లో ఏకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీ మతతత్వ పార్టీ అన్న సాకు వెతుక్కోవడం విచి త్రంగా ఉందని రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన రోజు నుంచే రంగంలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఆ రోజు కూడా ఎవరికి ఏయే పార్టీలు మద్దతునిస్తున్నాయో స్పష్టంగా తెలుసు. 

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తామని ఆనాడే చెప్పి ఉండాల్సింది. బీజేపీ మతతత్వ పార్టీ అయినందున అది మద్దతిచ్చిన అభ్యర్థికి ఓటు వేయబోమని కూడా ఆరోజే ప్రకటించాల్సింది. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు వరకు సాగదీయడమంటే నాయకత్వంలోనే లోపం ఉందన్న విషయం స్పష్టంగా కనబడుతోంది’’ అని ఆ ఎమ్మెల్యే చెప్పా రు. పార్టీ నిర్ణయం మేరకు ఎవరో ఒకరికి ఓటు వేయాలని రెండ్రోజుల ముందే హైదరాబాద్ వచ్చానని, ఓటింగ్‌నకు దూరంగా ఉండాలన్న బాబు నిర్ణయం తెలిసి విస్మయం చెందానని ఆయన చెప్పారు. ‘‘నాతోపాటు అయిదుగురం కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలో మంత్రులుగా పనిచేశాం. తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. 

లోక్‌సభ స్పీకర్ పదవీ తీసుకున్నాం. బీజేపీతో పొత్తుతో రాష్ట్రంలో అధికారం సాధించాం. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది?’’ అని సీనియర్ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. ‘‘సైద్ధాంతిక విభేదాలున్న టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలతో కూడా మా పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవద్దని చెప్పటం సరికాదు. ఓటు వేయాలా లేదా అనేది మా విచక్షణాధికారం. ఓటింగ్‌లో పాల్గొనాలని అందరికీ చెప్పిన పార్టీనే ఓటు వేయకూడదని నిర్ణయించటం సరికాదు’’ అని ఆయన అన్నారు. 


వెంటాడుతున్న నిజాలు
‘‘చంద్రబాబు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 1996లో కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలోని యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో పదవులు తీసుకుని అధికారాన్ని అనుభవించాం. అప్పట్లో ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు. 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్‌డీఏ విజయం సాధించింది. అప్పటివరకూ బీజేపీ మసీదులు కూలుస్తుంటే తాము మసీదులు కట్టిస్తున్నామని ఊరూవాడ ప్రచారం చేసిన చంద్రబాబు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. బీజేపీ పంచన చేరారు. 

కార్గిల్ యుద్ధం సమయంలో బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరాభిమానాలు పెరగటాన్ని గ్రహించి 1999 సాధారణ ఎన్నికల్లో అదే పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, వాజ్‌పేయి కార్డును ఉపయోగించి చంద్రబాబు రాష్ట్రంలో అధికారం సాధించారు. తరువాత గుజరాత్ రాష్ట్రంలో గోద్రా సంఘటన అనంతరమూ చంద్రబాబు బీజేపీని అంటిపెట్టుకున్ని ఉన్నారు. 2004 ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు కొనసాగించారు. ఆ ఎన్నికల్లో అటు కేంద్రంలో బీజేపీ కూటమి, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి చిత్తుగా ఓడిపోయాయి. బీజేపీ ప్రాభవం కోల్పోతోందని గ్రహించిన చంద్రబాబు.. ఆ పార్టీకి దూరం కావడం ప్రారంభించారు. 

అయితే, ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి మైనారిటీలను దూరం చేసుకోవడమేనని గమనించిన తర్వాత.. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విమర్శించడం మొదలెట్టారు. ఇవన్నీ అవకాశవాద ఎత్తుగడలేనని ప్రజలు గ్రహించారు. మా నాయకత్వంలో స్థిర నిర్ణయం లేదన్న విషయాన్ని పసిగట్టారు’’ అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక విషయాల్లోనూ ఏ వైఖరీ లేకపోవటమే తమ పార్టీ వైఖరిగా మారిపోయిందని వారు అంటున్నారు. 

మ్యాచ్ ఫిక్సింగ్‌లతో కుదేలు
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేసుకోవడమూ పార్టీని మరింత కుంగదీసిందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల అనంతరం జరిగిన అనేక ఉప ఎన్నికలు, శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చంద్రబాబు సందర్భానుసారంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న విషయం బహిరంగ రహస్యమే. ఇటీవలి ఉప ఎన్నికలతో సహా అన్ని ఎలక్షన్లలో పరస్పరం ఓట్లు బదలాయించుకున్న విషయమూ బయటపడింది. సందర్భాన్ని బట్టి అటు కాంగ్రెస్‌తో, ఇటు బీజేపీతోనూ చెలిమి చేయడం, కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తప్పుడు నిర్ణయం తీసుకోవడంద్వారా ప్రజల్లో పార్టీ మరింత పలచనైపోయిందన్న అభిప్రాయం పార్టీలో సర్వత్రా వ్యక్తమవుతోంది.
Share this article :

0 comments: