తెలుగుదేశంను మేమే సస్పెండ్ చేశాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగుదేశంను మేమే సస్పెండ్ చేశాం

తెలుగుదేశంను మేమే సస్పెండ్ చేశాం

Written By news on Saturday, July 21, 2012 | 7/21/2012

2009లో ఎన్నికైంది 92 మందిఆరుగురు రాజీనామా..
అయిదుగురి సస్పెన్షన్ ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం 81

హైదరాబాద్, న్యూస్‌లైన్: పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న నలుగురు శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం అందుబాటులో ఉన్న నేతలు దాడి వీరభద్రరరావు, వీవీవీ చౌదరి తదితరులతో సమావేశమై నలుగురిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్‌ఆర్కే ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. రాష్ర్టపతి పదవికి జరిగే ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి (కర్నూలు జిల్లా మంత్రాలయం), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా పరిగి), డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి (ఆదిలాబాద్ జిల్లా ముథోల్), చిన్నం రామకోటయ్య (కృష్ణా జిల్లా నూజివీడు) శుక్రవారం రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో వీరిపై చర్యలు తీసుకోవాలని పార్టీ భావించింది. అయితే ఎప్పటినుంచో పార్టీకి దూరంగా ఉంటున్న వీరికి నోటీసులు ఇవ్వటం, ఆ తరువాత సస్పెండ్ చేయటం వంటి చర్యలవల్ల అనవసరంగా ప్రాధాన్యతనిచ్చినట్లు అవుతుందని మొదట భావించారు. 

అలాగని పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్య తీసుకోకపోతే మిగిలిన వారు కూడా ఇదే తీరుగా వ్యవహరించటంతోపాటు, అధినేతకు పట్టులేదని ప్రజలకు, ముఖ్యంగా క్యాడర్‌కు త ప్పుడు సంకేతాలు వెళతాయనే భయంతో నలుగురినీ సస్పెండ్ చేయాలని హడావుడిగా నిర్ణయించారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున 92 మంది ఎమ్మెల్యేలుగా ఎంపికకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 81కి చేరింది. గతంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జోగు రామన్న, గంపా గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, నాగం జనార్దన్‌రెడ్డి పార్టీని వీడి, మళ్లీ పోటీచేసి గెలుపొందారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఓటు హక్కును కాదనే అధికారం బాబుకు లేదు: బాలనాగిరెడ్డి
ఎన్నికల్లో ఓటు వేయటమనేది పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని కాదనే అధికారం చంద్రబాబుకు లేదు. పార్టీ నుంచి నన్ను వారు సస్పెండ్ చేసేదేమిటి? మూడేళ్లుగా నేనే పార్టీకి దూరంగా ఉంటున్నాను. ఎన్‌టీఆర్ కుటుంబసభ్యులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేసినపుడు స్పందించకుండా రాష్ర్టపతి ఎన్నికల్లో ఓటు వేసినందుకు సస్పెండ్ చేయటం బాధాకరం. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాలాంటివారికి దేశ అత్యున్నత పదవికి జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలనే ఆశ ఉంటుంది. వద్దని చెప్పటం ఎంతవరకు సమంజసం? పార్టీ వైఖరి సరికాదనే భావనతో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి భవిష్యత్ లేదు. అధినేత వ్యవహారశైలి ఛండాలంగా ఉంది. 

ఊహించని పరిణామం: చిన్నం
పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఊహించని పరిణామం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటం అనేది శాసనసభ్యుడిగా నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. సస్పెన్షన్ ఉత్తర్వులు అందిన తరువాత పూర్తిస్థాయిలో స్పందిస్తా. 

పార్టీని మేమే సస్పెండ్ చేశాం: కొప్పుల 
తెలుగుదేశంను మేమే సస్పెండ్ చేశాం. మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం పార్టీకి లేదు. ఏడాదిన్నర క్రితమే పార్టీకి 
రాజీనామా చేశాం. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి తెలంగాణ తెలుగుదేశం ఫోరం బయట పడాలి. 

అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే: వేణుగోపాలచారి
పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే మమ్మల్ని సస్పెండ్ చేశారు. తెలంగాణ కోసం ఐక్యతా దీక్ష చేపట్టిన రోజునే మేం పార్టీకి రాజీనామా చేశాం. అపుడు స్పందించని పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశామనే కారణంతో సస్పెండ్ చేయటం సరికాదు. ఓటు వేయాలా లేదా అనేది మా విచక్షణాధికారం... ఓటింగ్‌లో పాల్గొనమని అందరికీ చెప్పిన పార్టీనే ఓటు వేయకూడదని నిర్ణయం తీసుకోవటం సరికాదు.
Share this article :

0 comments: