టీడీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి సవాల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » టీడీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి సవాల్

టీడీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి సవాల్

Written By news on Thursday, July 19, 2012 | 7/19/2012

- ఎవరెవరు కుమ్మక్కయ్యారో తేలిపోతుంది 
- టీడీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి సవాల్
- ప్రణబ్‌కు మద్దతు పలికితే కుమ్మక్కు ఎలా అవుతుంది?
- జేడీయూ, శివసేన, సీపీఎం ఏం ఆశించి ప్రణబ్‌కు మద్దతు పలికాయి?
- జగన్‌పై సీబీఐ కేసుకు, కాంగ్రెస్‌కు సంబంధం లేదని మేం అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ పెట్టిన కేసుకు, కాంగ్రెస్‌కు సంబంధం లేదని చెప్పినట్టు పనిలేని కొన్ని చానళ్లతోపాటు కొంత మంది నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు చెప్పారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయాలని తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ, కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారంటూ పనీపాటా లేనివాళ్లంతా రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. జగన్ బెయిల్ కోసం ప్రణబ్‌కు మద్దతునిస్తున్నారని చెబుతున్న టీడీపీకి చేతనైతే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని, అప్పుడు ఎవరెవరు కుమ్మక్కయ్యారో తేలిపోతుందని అన్నారు. 

గత మూడేళ్లుగా జగన్‌ను అడ్డుకోవడానికి కాంగ్రెస్, టీడీపీలు లాలూచీ పడి తెరవెనుక లోపాయికారి కుట్రలు పన్నిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీల నిర్వాకమేంటో ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే దానికి అనుకూలంగా మరోసారి ఓటెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని జూపూడి చెప్పారు. పలు టీవీ చానెళ్ల చర్చ సందర్భంగా ఆయన పార్టీ తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇచ్చారు.

వారూ కుమ్మక్కయినట్లేనా?
ప్రణబ్‌కు మద్దతు పలికితే.. అది కుమ్మక్కు ఎలా అవుతుందని జూపూడి ప్రశ్నించారు. ఆ లెక్కన ఎన్డీయేలో కీలక భాగస్వామి జనతాదళ్(యు) కూడా ప్రణబ్‌కు మద్దతు ప్రకటించిందని, వారు ఏ రకంగా కుమ్మక్కయి మద్దతునిస్తున్నారని అన్నారు. అంతెందుకు ఎన్డీయేలో మరో భాగస్వామ్య పార్టీ శివసేన దేనికోసం ప్రణబ్‌కు మద్దతునిస్తోందని, సీపీఎం ఏం ఆశించి ప్రణబ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని జూపూడి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చానని, యూపీఏ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తనకు అన్ని పార్టీలూ మద్దతు పలకాలని ప్రణబ్ కోరారన్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రణబ్ దేశ ప్రథమ పౌరుడిగా రాజకీయాలకు అతీతంగా అంతే హూందాతో వ్యవహరిస్తారని తమ పార్టీ విశ్వసిస్తోందన్నారు. టీడీపీవన్నీ అసంబద్ధ ఆరోపణలు తప్ప మరొకటి కాదన్నారు. దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక జరుగుతుంటే చంద్రబాబు తరహాలో గోడమీద పిల్లి వాటంలా తమ పార్టీ వ్యవహరించలేదని, అవకాశవాద రాజకీయాలకు పాల్పడలేదని అన్నారు. చంద్రబాబు తరహా అవకాశవాద రాజకీయాలు తమ పార్టీ ఇంటావంటా లేవన్నారు.
Share this article :

0 comments: