కృష్ణా జలాలకు కౌంట్‌డౌన్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » కృష్ణా జలాలకు కౌంట్‌డౌన్!

కృష్ణా జలాలకు కౌంట్‌డౌన్!

Written By news on Thursday, July 19, 2012 | 7/19/2012


హైదరాబాద్‌కు మంచినీటి సమస్య
మరో వారంరోజులకే సరిపోనున్న అక్కంపల్లి నిల్వలు
ఆ తర్వాత రోజుకు 180 మిలియన్ గ్యాలన్ల మంచినీటికి కోత
సగానికిపైగా నగరానికి తప్పని తిప్పలు!
పుట్టంగండి సిస్టర్న్ మరమ్మతు పనుల్లో ఇరిగేషన్ శాఖ అలసత్వం
కుప్పకూలి నాలుగు రోజులైనా కదలిక లేని వైనం

హైదరాబాద్,న్యూస్‌లైన్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరవాసులు మంచినీటికి కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. రోజుకు ఏకంగా 180 మిలియన్ గ్యాలన్ల మేర నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. అంటే జంటనగరాలలో సగానికి పైగా ప్రాంతానికి మంచినీటి ఇబ్బందులు తప్పవన్న మాట. నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టకపోతే వారం రోజుల తర్వాత నగరవాసులు ఇక్కట్ల పాలు కావాల్సిందే.

హైదరాబాద్ మంచినీటి అవసరాలను పురాతన గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లతో పాటు కృష్ణా, మంజీర, సింగూరు జలాలు తీరుస్తున్నాయి. ఇందులో కృష్ణా జలాలదే సింహభాగం. కాగా నగరానికి కృష్ణా నీటిని తరలించే పుట్టంగండి రిజర్వాయర్ గోడకు ఏర్పడిన కోత కారణంగా సమస్య తలెత్తింది. ఈ గోడకు మరమ్మతులు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రాజధానికి మంచినీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలు నగరానికి వస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ జలాశయం నుంచి పుట్టంగండి రిజర్వాయర్‌కు, అక్కడినుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాల పంపింగ్ జరుగుతుంది. ఇక్కడ 12 రోజులకు సరిపడా నీటిని నిల్వ చేస్తారు. అయితే ఈనెల 14న పుట్టంగండి రిజర్వాయర్ సిస్టర్న్ (లోపలివైపు గోడ) అక్కంపల్లికి పంపింగ్ జరిగే ప్రాంతం వద్ద కోతకు గురై కూలిపోయింది. దీంతో అధికారులు పంపింగ్ నిలిపివేశారు. మరమ్మతులు నిర్వహిస్తేనే అక్కంపల్లికి నీళ్లు వచ్చేందుకు వీలుంది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేయాల్సిన నీటిపారుదల శాఖ నాలుగు రోజులైనా మరమ్మతులు ప్రారంభించకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. 

బుధవారం నాటికి అక్కంపల్లి రిజర్వాయర్‌లో ఉన్న 0.926 టీఎంసీల నీటి నిల్వలు మరో వారం రోజులపాటు నగర దాహార్తిని తీర్చే అవకాశం ఉంది. ఈ లోగా పుట్టంగండి వద్ద మరమ్మతు పనులు పూర్తి చేయాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు రోజుకు మొత్తం 340 మిలియన్ గ్యాలన్లు (ఎంజీడీ) కావలసి ఉండగా జలమండలి అక్కంపల్లి నుంచి నిత్యం 180 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని తరలిస్తోంది. మరో 40 ఎంజీడీల నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి సేకరిస్తున్నారు. మరో 120 ఎంజీడీల వరకు సింగూరు, మంజీరా (మెదక్ జిల్లా) జలాశయాల నుంచి వస్తున్నాయి. ప్రస్తుతానికి రోజువారీగా నగరానికి సరఫరా అవుతున్న నీటి పరిమాణంలో ఎక్కడా కోత పడలేదు. కానీ మరో వారం రోజుల్లో పుట్టగండి రిజర్వాయర్‌కు మరమ్మతులు పూర్తిచేయని పక్షంలో మాత్రం హైదరాబాద్‌కు జల గండం తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రిజర్వాయర్ ఖాళీ కావాలంటున్న ఇరిగేషన్ శాఖ

లోపలి వైపునకు సిస్టర్న్ కూలడంతో రిజర్వాయర్‌ను ఖాళీ చేస్తేనే మరమ్మతులకు వీలవుతుందని నీటిపారుదల శాఖ వాదిస్తోంది. నీటిని ఖాళీ చేయాల్సినస్లూయిజ్ పరిమాణం చిన్నదిగా ఉండడం, రిజర్వాయర్ నుంచి ఒకేసారి అధిక పరిమాణంలో నీటిని వదిలితే పరివాహక ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లుతోందని చెబుతూ కాలయాపన చేస్తోంది. 

జలమండలి వాదన ఇదీ..

0.4 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న పుట్టంగండి రిజర్వాయర్‌ను ఖాళీ చేసేందుకు అవసరమైన పంపింగ్ సామర్థ్యం తమకు లేదని, ఈ పని చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ విభాగానిదేనని జలమండలి వర్గాలు అంటున్నాయి. ఈ నీటిని అక్కంపల్లి లింక్ కెనాల్‌లోకి వదిలి పెట్టేందుకు ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేయడం ఆ శాఖకు భారం కాదని పేర్కొంటున్నారు. సుమారు రూ.2 కోట్ల అంచనా వ్యయం అయ్యే మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేస్తేనే మహానగర తాగునీటి అవసరాలకు (రోజుకు 180 ఎంజీడీలు) ఢోకా ఉండదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిస్టర్న్ కూలిన చోట తాత్కాలిక బండ్ ఏర్పాటు చేసి వెంటనే మరమ్మతులు పూర్తిచేసే అంశంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే అంచనాలు రూపొందించే పేరుతో ఇరిగేషన్ శాఖ అలసత్వం ప్రదర్శిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Share this article :

0 comments: