టీడీపీ అభ్యర్థి అర్కలకు చుక్కెదురు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » టీడీపీ అభ్యర్థి అర్కలకు చుక్కెదురు

టీడీపీ అభ్యర్థి అర్కలకు చుక్కెదురు

Written By news on Saturday, July 21, 2012 | 7/21/2012


నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఫలితం తారుమారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల కోటాలో నిజామాబాద్ నుంచి శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నేత అర్కల నర్సారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. నర్సారెడ్డి ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డిగారి వెంకటరామిరెడ్డి 9 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ రెడ్డి కాంతారావు శుక్రవారం తీర్పునిచ్చారు. దీంతో మూడేళ్లుగా నడుస్తున్న వివాదానికి తెరపడింది. 2009 మార్చి 30న నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి నర్సారెడ్డి, కాంగ్రెస్ నుంచి వెంకటరామిరెడ్డి పోటీపడ్డారు. ఎన్నికల్లో నర్సారెడ్డి ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. 

ఓట్ల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని, రీకౌంటింగ్ నిర్వహించాలని కోరుతూ వెంకటరామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివాదాస్పదంగా మారిన మూడు ఓట్లు వెంకటరామిరెడ్డికి అనుకూలంగా ఉన్నాయని గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నర్సారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా...వివాదాస్పంగా మారిన మూడు ఓట్లను ముందుగా లెక్కించిన తర్వాత మిగిలిన మొత్తం ఓట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలైన ఓట్లను తిరిగి లెక్కించిన తర్వాత... వెంకటరామిరెడ్డి 9 ఓట్లతో గెలుపొందినట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. 

ఓట్లను ఇలా లెక్కించారు: పిటిషనర్, ప్రతివాదితోపాటు ఇరువర్గాల న్యాయవాదులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో వివాదాస్పదంగా మారిన 26 ఓట్లను గుర్తించారు. 16 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. మిగిలిన 10 ఓట్లలో వెంకటరామిరెడ్డికి 7 ఓట్లు వచ్చినట్లు గుర్తించారు. దీంతో గతంలో వచ్చిన 335+7 ఓట్లతో కలిసి మొత్తం 342 ఓట్లు వెంకటరామిరెడ్డికి వచ్చాయి. ఈ నేపథ్యంలో 9 ఓట్ల తేడాతో వెంకటరామిరెడ్డి గెలుపొందినట్లు హైకోర్టు నిర్ధారించింది. 

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: అర్కల

హైకోర్టు తీర్పు అనంతరం ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి శుక్రవారం ఎన్‌టీఆర్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. 
Share this article :

0 comments: