కార్పో‘రేటు’ పై వేటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » కార్పో‘రేటు’ పై వేటు

కార్పో‘రేటు’ పై వేటు

Written By news on Tuesday, July 17, 2012 | 7/17/2012

ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలు
అర్హులకూ ఉచిత చికిత్సకు ససేమిరా
రోగుల నుంచి భారీగా బలవంతపు వసూళ్లు
లేదంటే చికిత్స చేయబోమంటూ బెదిరింపులు
బాధితుల ఫిర్యాదు.. అవేర్ గ్లోబల్‌పై వేటు
కామినేని ఆస్పత్రిపైనా ఇటీవలే వేటు
అపోలోపై కలెక్టర్‌కు రోగి ఫిర్యాదు
గుండె శస్త్రచికిత్స చేయడం లేదంటూ మొర

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆరోగ్యశ్రీ పథకం కింద చేరిన రోగుల నుంచి ఏ ఆస్పత్రీ పైసా కూడా వసూలు చేయకూడదు. గుండె, మూత్రపిండాలు, కాలేయం, మెదడు వంటి ఖరీదైన ఆపరేషన్లనూ ఉచితంగా చేయాలి. ఆస్పత్రిలో రోగి పూర్తిగా కోలుకునేదాకా ఆహారం, మందులు ఇవ్వడమే గాక డిశ్చార్జ్ సమయంలో నెలకు సరిపడా మందులతో పాటు ప్రయాణ చార్జీలు కూడా చెల్లించాలి. కానీ రాజధానిలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు వీటన్నింటినీ తుంగలో తొక్కుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చెల్లింపులు తమ ఖర్చులకు చాలడం లేదనే సాకుతో అడ్డదార్లు తొక్కుతున్నాయి. పథకానికి అర్హులైన రోగుల నుంచి కూడా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ట్రస్టు ఇచ్చేది పోను తాము అడిగినంత ఇస్తేనే చికిత్స చేస్తామంటూ మెలిక పెడుతున్నాయి. 

ఆ మేరకు రోగుల నుంచి ఏకంగా రహస్యంగా ఒప్పందాలే చేసుకుంటున్నాయి. ఒక్క ఆరోగ్యశ్రీ కార్డుంటే చాలు, నయా పైసా ఖర్చు లేకుండా ఖరీదైన కార్పొరేట్ వైద్యం చేయించుకోవచ్చని ఆశగా వచ్చే నిరుపేద రోగులను నిలువునా దోచేస్తున్నాయి. వారు కూడా విధిలేక అవి డిమాండ్ చేసినంత చెల్లిస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఈ విషయమై రోగులు ఫిర్యాదు చేయడంతో ఎల్‌బీ నగర్ కామినేని ఆస్పత్రిని ఇప్పటికే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ నుంచి అధికారులు తొలగించడం తెలిసిందే. 

తాజాగా అదే ప్రాంతంలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిపై కూడా వేటు వేశారు. ఒక్కో రోగి వద్ద రూ.1,500 నుంచి రూ.80 వేలకు పైగా వసూలు చేసినట్టు అవేర్‌పై ఫిర్యాదులందాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. ‘‘దీనిపై ఆస్పత్రికి సంజాయిషీ నోటీసిచ్చాం. కానీ యాజమాన్యం నుంచి స్పందనే లేదు. దానికి తోడు ఆస్పత్రి అక్రమాలకు పాల్పడ్డట్టు మేం స్వయంగా జరిపిన విచారణలో తేలింది. దాంతో జూలై 15 నుంచి ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశాం’’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే జూలై 13 దాకా అవేర్‌లో వైద్యానికి ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతి పొందిన రోగులకు అందులోనే సేవలందేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. పూర్తిగా నయమయ్యేదాకా వైద్యం చేయాల్సిన బాధ్యత ఆసుపత్రిదేనని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ రంగారెడ్డి జిల్లా నెట్‌వర్క్ టీమ్ లీడర్ యువరాజు తెలిపారు. అవేర్ కాదంటే సమీప ఆస్పత్రులలో వైద్యం చేయిస్తామని, రోగులు ఆందోళన చెందొద్దని తెలిపారు.

నిమ్స్.. నిండా మునుగుడే: ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రికి రోజుకు 2,000 మంది రోగులు వస్తున్నారు. తక్కువ ఖర్చుకే మెరుగైన వైద్యం అందుతుండటంతో రాష్ట్ర నలుమూలల నుంచి రోగులు ఇక్కడికి వస్తున్నారు. వారిలో చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. వైద్యులు మాత్రం అన్ని అర్హతలూ ఉన్నా చాలామందిని ఆరోగ్యశ్రీ కింద చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఒకవేళ చేర్చుకున్నా శస్త్రచికిత్సలు మినహా, పరీక్షలు తదితరాలన్నింటికీ ముందే డబ్బులు వసూలు చేస్తున్నారు! కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ట్రామా కేర్ వంటి ఖరీదైన మందులను రోగులే స్వయంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది.

కలెక్టర్‌కు ఫిర్యాదు: గతంతో పోలిస్తే ఆరోగ్యశ్రీపై ప్రజల్లో అవగాహన పెరిగింది. బోరబండకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి అపోలో ఆస్పత్రిపై హైదరాబాద్ కలెక్టర్ గుల్జార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. గుండె శస్త్రచికిత్స కోసం అపోలోను సంప్రదిస్తే, దానికి ఆరోగ్యశ్రీ వర్తించదని, రూ.50 వేలు కడితేనే వైద్యం చేస్తామని చెప్పారంటూ మొరపెట్టుకున్నారు. దాంతో ఆయనకు తక్షణం వైద్య సేవలందేలా చూడాలని జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌ను కలెక్టర్ ఆదేశించారు.
Share this article :

0 comments: