రాజకీయాల నుంచి వైదొలగాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రాజకీయాల నుంచి వైదొలగాలి

రాజకీయాల నుంచి వైదొలగాలి

Written By news on Friday, July 20, 2012 | 7/20/2012

ఎన్నికల్లో స్పష్టమైన వైఖరి తీసుకోకుండా రాజకీయాల్లో ఎలా కొనసాగుతారు?
ఓటేయని చంద్రబాబు దేశద్రోహం చేసినట్లు కాదా?
కేసీఆర్ ఎవరెవరితో డీల్స్ కుదుర్చుకున్నారో ప్రజలకు తెలుసు
కాంగ్రెస్‌తో డీల్ ఉంటే.. జగన్‌పై కేసులెందుకు వస్తాయి?

హైదరాబాద్, న్యూస్‌లైన్: దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో స్పష్టమైన వైఖరి తీసుకోలేని పార్టీలు రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయరాదని టీడీపీ, టీఆర్‌ఎస్‌లు తీసుకున్న నిర్ణయాన్ని తూర్పారబట్టారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఓటేయాల్సిన బాధ్యత ఉంది.. ఓటేయక పోతే దేశద్రోహం చేసినట్లే... రాజ్యాంగానికి ద్రోహం చేసినట్లే’’ అని గతంలో చంద్రబాబు నీతులు వల్లించారని గుర్తు చేస్తూ మరి ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయని చంద్రబాబు రాజ్యాంగానికీ, దేశానికీ ద్రోహం చేసినట్లు కాదా? రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టినట్లు కాదా? అని నిలదీశారు. చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకపోవడం దుర్మార్గమని, ఆయన చేతగానితనానికి, ఆయన గందరగోళంలో ఉన్నారనడానికి నిదర్శనం అని విమర్శించారు.

సుప్రీంకోర్టును అవమానిస్తారా?

జగన్ బెయిల్‌కు, రాష్ట్రపతి ఎన్నికకూ సంబంధం ఉందని టీడీపీ, టీఆర్‌ఎస్‌తో పాటు కొన్ని పత్రికలు ప్రచారం చేయడాన్ని గట్టు ఖండించారు. బెయిల్ ఇచ్చేది న్యాయస్థానం, ఓటు వేసేది రాష్ట్రపతికి అనే విషయాన్ని విస్మరించి తప్పుడు ప్రచారం చేస్తూ సుప్రీంకోర్టును కూడా అవమానిస్తున్నారని ఆయన అన్నారు. డీల్ (ఒప్పందం) కుదిరిందంటూ టీఆర్‌ఎస్ చేసిన విమర్శలను ఆయన తిప్పి కొట్టారు. టీఆర్‌ఎస్ నాయకుడు కేసీఆర్ ఎవరెవరితో ఎలా డీల్స్ కుదుర్చుకున్నారో ప్రజలకు బాగా తెలుసన్నారు. అసలు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లే డీల్స్ కుదుర్చుకోవడంలో సిద్ధ హస్తులని ఆయన అన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నందుకే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్‌కు నామమాత్రపు ఓట్లు వచ్చాయన్నారు.

డీల్ ఉంటే.. కేసులెందుకు వేస్తారు?

కాంగ్రెస్‌తో తాము డీల్ కుదుర్చుకుని ఉంటే జగన్‌పై అక్రమ కేసులు ఎందుకు వస్తాయని గట్టు ప్రశ్నించారు. సీబీఐని అడ్డం పెట్టుకుని జగన్‌పై టీడీపీ, కాంగ్రెస్, రామోజీరావు కుట్ర పన్నుతున్న విషయం జగద్విదితం అని అన్నారు. సైకిల్ కాంగ్రెస్‌గా మారిన టీడీపీతోగాని, కాంగ్రెస్‌తోగాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యే పరిస్థితే రాదన్నారు. ఓటేయాలని నిర్ణయించుకున్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న మీడియా.. ప్రజాస్వామ్యంలో ఓట్లేయనిటీడీపీ, టీఆర్‌ఎస్‌లను ఎందుకు ప్రశ్నించదని ఆయన నిలదీశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మరో మార్గం లేనందువల్లనే తాము ప్రణబ్‌ైవె పు మొగ్గు చూపాల్సి వచ్చిందన్నారు. తమ పార్టీ ఎప్పుడూ లౌకిక వాదానికీ, దేశ సార్వభౌమత్వానికీ కట్టుబడి ఉంటుందని, దేశానికి ఇలాంటి సమస్యలు వచ్చినపుడు ముందుండి పోరాడుతుందని ఆయన అన్నారు. యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ చేతుల మీదుగా స్పీకర్ అయిన యనమల ఆ పదవికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించారని అన్నారు. తెలంగాణలో కూడా తమ పార్టీ బలోపేతం అవుతోందనేది పరకాల ఉప ఎన్నికల్లో తేలిందని, అందుకే టీఆర్‌ఎస్ తమను లక్ష్యంగా చేసుకుందని ఆయన పేర్కొన్నారు.
Share this article :

0 comments: