22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోకి షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోకి షర్మిల పాదయాత్ర

22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోకి షర్మిల పాదయాత్ర

Written By news on Saturday, November 17, 2012 | 11/17/2012


22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోకి షర్మిల పాదయాత్ర

హైదరాబాద్, న్యూస్‌లైన్: త్వరలో తెలంగాణలో అడుగుపెట్టనున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత నేతల సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సాగిస్తున్న నీచ రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఆయన సోదరి షర్మిల.. అక్టోబరు 18న ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్దన్, కె.కె.మహేందర్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్‌రావు, జిట్టా బాలకృష్ణారెడ్డి, బాల మణెమ్మ, ఎడ్మ కిష్టారెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. షర్మిల పాదయాత్ర ఈ నెల 22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో అడుగుపెట్టనున్న సందర్భంగా తెలంగాణ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకనున్నట్లు బాజిరెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి వైఎస్ ఎంతో కృషి చేశారని, తెలంగాణలో ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులున్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు వైఎస్ చాలా కృషిచేశారు. 

నాలుగు సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు బాటలు వేశారు. మహానేత ప్రారంభించిన పనులు దాదాపు 90 శాతం పూర్తయినా.. కేవలం 10 శాతం పనులను ఈ అసమర్థ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. పాదయాత్రలో భాగంగా అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టులను షర్మిల సందర్శిస్తారు’’ అని ఆయన వివరించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల మీదుగా సాగుతుందని చెప్పారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టనుందని తెలిపారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పాదయాత్ర ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన వారిలో సీజీసీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు తెలంగాణకు చెందిన కేంద్ర పాలక మండలి (సీజీసీ), కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ), జిల్లా కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.

source:sakshi
Share this article :

0 comments: