తెలంగాణ అభివృద్ధికి వైఎస్ బాటలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » తెలంగాణ అభివృద్ధికి వైఎస్ బాటలు

తెలంగాణ అభివృద్ధికి వైఎస్ బాటలు

Written By news on Monday, November 12, 2012 | 11/12/2012

జలయజ్ఞంలోనూ తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు 
ప్రజలను మరోమారు వంచించేందుకు బాబు పాదయాత్ర 
ఆయన పాలనలో తెలంగాణ ప్రజలది దౌర్భాగ్యమైన స్థితి 
జనం ముంబై, దుబాయిలకు వలసపోవాల్సిన దుస్థితి 
కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయి జగన్‌ను జైలులో పెట్టాయి. 
రాష్ట్రంలో జగన్‌తోనే వైఎస్ నాటి సువర్ణ పాలన సాధ్యం 

నల్లగొండ, న్యూస్‌లైన్: ‘‘తెలంగాణ అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి బాటలు వేశారు. అన్ని ప్రాంతాలను ఆయన సమదృష్టితో చూశారు. వైఎస్ కానీ, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఏనాడూ వ్యతిరేకం కాదు. తెలంగాణ ప్రజల కష్టాలను, కన్నీళ్లను దగ్గరగా చూసిన వ్యక్తి వైఎస్’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా సూర్యాపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. వైఎస్ సీఎం పదవి చేపట్టగానే తొలి సంతకం చేసిన ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు నిర్ణయం ద్వారా అత్యధికంగా తెలంగాణ రైతులు లబ్ధిపొందారని విజయమ్మ వివరించారు. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన జలయజ్ఞంలో తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యం ఇచ్చారని.. గుత్ప, అలీసాగర్, ఏఎంఆర్‌పీ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్-2, ఎల్లంపల్లి, నెట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారని ఆమె గుర్తు చేశారు. 

తెలంగాణలో 16.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సంపాదించారని.. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని విమర్శించారు. జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు కేవలం 20 శాతం మాత్రమే పూర్తయ్యాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. అధికార పక్షంతో కుమ్మక్కయ్యిందని ధ్వజమెత్తారు. వైఎస్‌ను ప్రజల మనసుల నుంచి తొలగించాలని చూస్తున్నారని.. కానీ, ఆయన మరణం తర్వాత తల్లడిల్లిన గుండెలు, చనిపోయినవారు, ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూస్తే ఈ ప్రాంత ప్రజల గుండెల్లో ఆయన ఎంతగా గూడు కట్టుకున్నారో అర్థమైందని పేర్కొన్నారు. వైఎస్ కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారికి విజయమ్మ నివాళి అర్పించారు. 

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..? 

‘‘రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఏ నేత కూడా ప్రయత్నించడం లేదు. పేదల కోసం వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ గురించి ఆలోచించే వారు లేరు. 108 వాహనాలు ఎటూ కదలడం లేదు. కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలేదు. సబ్సిడీ విత్తనాలు అందటంలేదు. ప్రజా సమస్యల గురించి అసెంబ్లీ చర్చించే తీరికా, ఓపికా పాలకులకు లేకుండాపోయింది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? పాలనసాగుతోందా..? అన్న అనుమానం కలుగుతోంది’’ అని విజయమ్మ వ్యాఖ్యానించారు. 

వంచించేందుకే బాబు పాదయాత్ర...

ప్రజలను మరో మారు వంచించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర పేరుతో నమ్మించాలని చూస్తున్నారని విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణ పల్లెలు చంద్రబాబు పాలనలో పడ్డ ఇబ్బందులను ఇంకా మరిచిపోలేదు. తెలంగాణ ప్రజలు ఎంతగా ఏడ్చారో తెలుసు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఇల్లూ వాకిలి వదిలి దుబాయి, ముంబైలకు వలస వెళ్లారు. రైతులను, మహిళలను జైళ్లలో పెట్టారు’’ అని విజయమ్మ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఆయన పాలనలోనే రాష్ట్రంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలుచేసుకున్నారు. మాటి మాటికీ కేంద్రంలో చక్రం తిప్పిన నాయకునిగా చెప్పుకునే బాబు.. అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి ఎందుకు రుణాలు మాఫీ చేయించలేక పోయారు? ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వలేక పోయారు? ఎందుకు రుణాలు రీషెడ్యూలు చేయించలేకపోయారు?’’ అని ఆమె ప్రశ్నించారు. బెల్టుషాపులు వాడ వాడన వెలువటానికి బాబే కారకుడని, కరెంటు ఇవ్వాలంటే ఎగతాళి చేసిన ఘన చరిత్ర బాబుదని ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి వాటిని తన వారికి ధారాదత్తం చేసింది బాబు కాదా?’’ అని నిలదీశారు. ఇప్పుడు ఈ అంశాలనే తాజా హామీలుగా గుప్పిస్తూ పాదయాత్రతో మోసం చేయాలని చూస్తున్నారని.. బాబు మాయ మాటలు ఎవరూ నమ్మొద్దని సూచించారు. ‘‘టీడీపీ, కాంగ్రెస్, సీబీఐ కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టారు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేశాయి.. ‘సాక్షి’ ఆస్తు ల జప్తు కుట్ర వీరు కలిసి పన్నిందే’’ అని విజయమ్మ విమర్శించారు. 

మళ్లీ వైఎస్ సువర్ణ పాలన... 

రాష్ట్రంలో తిరిగి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సువర్ణపాలన రావాలంటే అది వై.ఎస్.జగన్ వల్లే సాధ్యమవుతుందని విజయమ్మ పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, కుయుక్తులు పన్నినా, అన్నింటినీ దేవుడు చూస్తున్నాడని.. జగన్‌ను బయటకు తీసుకువస్తాడని నమ్ముతున్నానని చెప్పారు. వైఎస్‌ఆర్ కల నెరువేరుతుందని, ఆయన పథకాలన్నింటినీ తన జెండాలో ఎజెండాగా పెట్టుకున్న జగన్ సువర్ణ పాలన అందిస్తారని హామీ ఇచ్చారు. 

కమ్యూనిస్టు సోదరులపై చార్జిషీటా!

‘‘చంద్రబాబు పాలనలో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారు.. కరెంటు కోసం నానా అవస్థలు పడ్డారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ఆర్ 14 రోజుల పాటు దీక్ష చేశారు. చివరి రోజు బషీర్‌బాగ్‌లో గొడవ జరిగింది. రైతులు చనిపోయారు. కాల్పులు జరిపి రైతులను పొట్టనబెట్టుకున్న ఘనత చంద్రబాబుది. ఇప్పుడు ఆ ఉద్యమానికి సంబంధించి కమ్యూనిస్టు సోదరులపై చార్జిషీటు వేయాలని ఈ ప్రభుత్వం చూస్తోంది’’ అని విజయమ్మ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రం కోసం కేవలం ఐదేళ్ల ఐదు నెలల కాలంలో ఎంతో చేసిన వైఎస్‌ఆర్ గొప్పా.. లేక ఎనిమిదేళ్ల ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన చంద్రబాబు గొప్పో ఆయనే సమాధానం చెప్పాలని విజయమ్మ నిలదీశారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చిన బహిరంగ సభలో విజయమ్మ ఉత్సాహంగా ప్రసంగించారు. నల్లగొండ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, కె.కె.మహేందర్‌రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: