ఇది రాబందుల రాజ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది రాబందుల రాజ్యం

ఇది రాబందుల రాజ్యం

Written By news on Tuesday, November 13, 2012 | 11/13/2012


మరో ప్రజాప్రస్థానంలో సర్కారుపై షర్మిల నిప్పులు
వైఎస్ ఉన్నప్పుడు కరెంటు కోతల్లేకుండా బిల్లు రూ. 50 వచ్చేది
ఈ ప్రభుత్వం పేదల బతుకుల్లో చీకటి నింపుతోంది
ఉపాధి కూలి రూ. 20తో ఎలా బతకాలి.. ఇది శ్రమదోపిడీ కాదా?
సబ్సిడీ సిలిండర్లు ఏడాదికి 6 మాత్రమే ఇస్తే బడుగు జీవులు ఏం కావాలి?
ఒక్కో సిలిండర్‌కు రూ. 950 పెట్టి వారు ఎలా కొనుక్కుంటారు?
అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని దింపేయకుండా చంద్రబాబు నాటకాలాడుతున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 26, కిలోమీటర్లు: 338.8

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇచ్చే నాలుగు గంటల కరెంటుకు రూ.250 బిల్లు వేస్తున్నారట! మూడేళ్లలో మూడుసార్లు చార్జీలు పెంచిన ఈ ప్రభుత్వం.. మూడేళ్ల కిందటి సర్‌చార్జీలు ఇప్పుడు వసూలు చేస్తూ పేదోళ్ల బతుకుల్లో చీకటి నింపుతోంది. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు విద్యుత్తు కోతల్లేకుండా కరెంటు బిల్లు రూ.50 వస్తే.. ఇప్పుడు మొత్తం కోతలతోనే రూ.250 రావడం ఏ రకంగా న్యాయం. ఇది రాబందుల రాజ్యం కాదా..?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. బస్ చార్జీలు, కరెంటు చార్జీలు, గ్యాస్ చార్జీలు ఎడాపెడా పెంచేసి ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. వైఎస్ ఉన్నప్పుడు కరెంటు అవసరాలను ముందే ఊహించి కొనుగోలు చేసేవారని, ఈ ముఖ్యమంత్రి మాత్రం నిద్రపోతున్నారన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, టీడీపీ సాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం సోమవారం 26వ రోజు కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో సాగింది. ఈ సందర్భంగా బిణిగేర గ్రామంలో స్థానికులతో షర్మిల ముచ్చటించారు.

షర్మిల: స్థానికంగా మీ సమస్యలేమైనా ఉన్నాయా?

మహిళలు: మాకు ఉపాధి హామీ కింద రూ.20 కూలి మాత్రమే ఇస్తున్నారమ్మా.. ఈ డబ్బులతో ఎట్లా బతకాలి?

షర్మిల: రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కరువు పనికి ఎంతిచ్చేవారు?

మహిళలు: అప్పుడు రూ.80 నుంచి రూ.120 వరకూ వచ్చేది. కానీ ఇప్పుడు పనులివ్వడం లేదు. పనులున్నా రూ.20-30 ఇస్తున్నారు.

షర్మిల: ఇది శ్రమదోపిడీ కాదా..? ఈ ప్రభుత్వానికి మనసన్నదే లేదు. కరెంటు బాగా వస్తోందా? బిల్లులు ఎంతొస్తున్నాయి?

మహిళలు: కరెంటు నాలుగు గంటలే ఇస్తున్నారు. కానీ బిల్లు మాత్రం నెలకు రూ.250 వస్తోంది. మాకు వచ్చే కూలి డబ్బులతో ఈ బిల్లులు ఎట్లా కడతామమ్మా?

షర్మిల: గొప్పగా కరెంటు ఇస్తున్నారని మళ్లీ బిల్లులు వేస్తున్నారా? మళ్లీ వాటికి సర్‌చార్జీలు. ఇది రాబందుల రాజ్యం. దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది. రాజన్న ఉన్నప్పుడు కరెంటు అవసరాలను ముందే ఊహించి కొనుగోలు చేసేవారు. ఈ ముఖ్యమంత్రి నిద్రపోతున్నారు. ఆయన నిద్ర లేచేలోపే ఇతర రాష్ట్రాల వారు కరెంటు కొనుక్కుపోయారు. కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ మన విద్యుత్తు అవసరాలు తీర్చడమే కాకుండా ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా చవకగా సరఫరా చేయొచ్చు. కానీ లక్షల కోట్ల విలువైన ఆ సంపదను చంద్రబాబు రిలయన్స్‌కు కట్టబెట్టారు.

రైతులు: పొలాలకు కూడా గంటా రెండు గంటలే ఇస్తున్నారు. పంటలు ఎండి అప్పులు మిగులుతున్నాయి.
షర్మిల: రాజన్న ఏడు గంటలు ఇస్తానన్నాడు. ఇచ్చి చూపించాడు. జగనన్న రాజన్న కొడుకుగా ఇచ్చిన ప్రతిమాటను నిలబెడతాడు. 9 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తాడు.

మహిళలు: మా సంఘాలకు రుణాలు రావడం లేదు. ఇచ్చినా ఐదారువేలే. వాటికి కూడా పావలా వడ్డీ కాదు. మొత్తం లెక్కేస్తే రూ.2 వడ్డీ పడుతోంది.

షర్మిల: ముఖ్యమంత్రి గారు వడ్డీ లేని రుణాలిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ మీకు రూ.2ల వడ్డీ పడుతోంది. ఇది చాలా అన్యాయం. వైఎస్ ఉన్నప్పుడు రైతులకు రూ.12 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు. జగనన్న వస్తే రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. వృద్ధులు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1000 పెన్షన్ వస్తుంది. వికలాంగులకు చిన్న వ్యాపారం చేసుకునేందుకు వీలుగా ఏవైనా రుణాలు కూడా ఇప్పిస్తారు.

మహిళలు: గ్యాస్ ఇక ముందు రాదట.. మార్చి నెల వరకు మూడే ఇస్తారట!

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు బస్ చార్జీలు గానీ, కరెంటు చార్జీలు గానీ, గ్యాస్ గానీ, ఏ ఒక్క రూపాయి పన్ను గానీ పెంచలేదు. చంద్రబాబు రూ.145 ఉన్న గ్యాస్‌ను రూ.305 చేశారు. రాజన్న ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఈ ప్రభుత్వం 6 సిలిండర్లు రూ.450కి ఇస్తుందట. ఇంటికి నెలకో సిలిండర్ పడుతుందనుకుంటే మిగిలిన 6 సిలిండర్లకు రూ.950 చొప్పున కొనుక్కోవాలంట. అంటే సగటున రూ.750 పడుతుంది. రూ.350 ఎక్కడ. రూ.650 ఎక్కడ. ఇది రాబందుల రాజ్యం అనడానికి ఇదే నిదర్శనం.

చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టరు?

ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారు విరూపాపురం సభలో షర్మిలను కలిసి మాట్లాడారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకం ద్వారానే తాము జీవించి ఉన్నామంటూ ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో వ్యాధులను తీసేసి.. సామాన్యులను మళ్లీ ప్రభుత్వాసుపత్రికి పొమ్మంటోంది. ఇలాంటి సర్కారును అవిశ్వాసం పెట్టి దించేయకుండా చంద్రబాబు పాదయాత్రలంటూ డ్రామాలాడుతున్నారు. వాళ్లకు విశ్వసనీయత లేదని మరోసారి నిరూపించుకున్నారు’ అని అన్నారు.

అక్కున చేర్చుకున్న ఆదోని..

సోమవారం సాయంత్రానికి పాదయాత్ర ఆదోని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. భారీ సంఖ్యలో జనం తరలివచ్చి పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. షర్మిలకు గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ ఆప్యాయతను చాటుకున్నారు. రాత్రి 6.50కి ఆదోని శివారులో ఏర్పాటు చేసిన బసకు షర్మిల చేరుకున్నారు.


సుమలత మళ్లీ బడికి..

కర్నూలు జిల్లా బిణిగేరకు చెందిన సుమలత అనే పదేళ్ల చిన్నారి వాళ్ల నాయనమ్మతో కలిసి షర్మిలను చూసేందుకు వచ్చింది. స్కూలుకు వెళ్తున్నావా చిన్నా అని షర్మిల అనగా ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. ఐదో తరగతి వరకు చదువుకున్నానని, ఈ ఏడాదే చదువు మానేశానని, తల్లిదండ్రులిద్దరూ బండలు కొట్టే పనిచేస్తారని, తనను చదివించలేరని ఏడ్చింది. దీంతో చలించిపోయి షర్మిల... పాప, నాయనమ్మల కన్నీళ్లు తుడుస్తూ నేను చదివిస్తానమ్మా అంటూ ఓదార్చారు. ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మనూరు జయరాం ఆ పాపను చదివించేందుకు ముందుకొచ్చారు. పాపను స్కూల్‌లో చేర్పిస్తానని మాటిచ్చారు.
Share this article :

0 comments: