మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం

మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం

Written By news on Monday, November 12, 2012 | 11/12/2012

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా మద్దతు ఉపసంహరించుకున్నట్లు ఆయన సోమవారమిక్కడ తెలిపారు. సంఘ్ పరివార్ కార్యక్రమాలకు ఊతమిస్తున్న ప్రభుత్వానికి ఏ పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని ఒవైసీ స్పష్టం చేశారు. మద్దతు ఉపసంహరణపై గవర్నర్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే యూపీఏకు మద్దతుపై రాష్ట్రపతిని కలుస్తామని ఆయన తెలిపారు.

పార్టీ కార్యవర్గ సమావేశం అనంతరం ఒవైసీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వ శక్తులకు దూరంగా ఉండాలనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. ఆదోని, సంగారెడ్డి, మిర్యాలగూడ, పాతబస్తీలో జరిగిన అల్లర్లలో ముస్లింలు భారీగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. మైనార్టీ యువకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఒవైసీ విమర్శించారు.

ముస్లింల విషయంలో సీఎం కిరణ్ మరో పీవీ నర్సింహరావులా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సంఘ్ పరివార్ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలకు నిరసనగా మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఒవైసీ తెలిపారు. పోలీసు బలగాలతో తమను అడ్డుకోలేని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని ఓవైసీ తెలిపారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మద్దతు ఉపసంహరణపై వెనక్కి తగ్గిది లేదని ఒవైసీ మరోసారి స్పష్టం చేశారు.


source:sakshi
Share this article :

0 comments: