ఎంపీనని జైల్లో పెడతారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఎంపీనని జైల్లో పెడతారా?

ఎంపీనని జైల్లో పెడతారా?

Written By news on Saturday, November 17, 2012 | 11/17/2012

అరెస్టు చేసి ఐదున్నర నెలలు దాటిందని నివేదన

‘‘అరెస్టు చేసిన 90 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేయకపోతే నిందితుడికి విధిగా బెయిలివ్వాలి. సుప్రీంకోర్టు గత తీర్పులూ అదే చెబుతున్నాయి. ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని సీబీఐ చెబుతున్న ఏడు అంశాలకు కూడా 90 రోజుల గడువు వర్తిస్తుంది.’’

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘సాక్షి’ పెట్టుబడుల వ్యవహారంలో అరెస్టు చేసిన తనకు బెయిలు మంజూరు చేయాలంటూ కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు కోర్టులో ఆయన రెండు బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. తనను అరెస్టు చేసి ఇప్పటికే ఐదున్నర నెలలు దాటిందని గుర్తు చేశారు. అరెస్టు చేసిన 90 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేయకపోతే విధిగా నిందితుడికి బెయిలివ్వాల్సి ఉందని పేర్కొంటూ సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద స్టాట్యుటరీ బెయిలు పిటిషన్ వేశారు. తనను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది తొలి చార్జిషీటుకు సంబంధించిన (సీసీ-8) కేసులో గనుక, దానిపై ఇప్పటికే దర్యాప్తు పూర్తయినందున బెయిలివ్వాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 437 కింద సాధారణ బెయిలు పిటిషన్ కూడా వేశారు. జగన్ తరఫున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వీటిని దాఖలు చేశారు.

‘‘ఇంకా ఏడు అంశాలపై దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సుప్రీంకోర్టుకు సమర్పించిన నోట్‌లో సీబీఐ పేర్కొంది. కానీ అవేమీ దర్యాప్తు జరుగుతుండగా బయట పడ్డవేమీ కావు. 2012 ఆగస్టులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా పేర్కొన్నవే. కాబట్టి దర్యాప్తు చేయడానికి సీబీఐకి గడువు వర్తిస్తుంది. గడువు లోపు పూర్తి చేయకుంటే నిందితుడికి ఆటోమేటిగ్గా బెయిలు లభిస్తుంది. చట్ట ప్రకారం ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన బెయిలు’’ అని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు గత తీర్పులను కూడా ఉదాహరించారు. రాజ్యాంగంలోని 19, 21 అధికరణాల కింద తనకున్న ప్రాథమిక హక్కులను సీబీఐ హరిస్తోందని ఆయన ఆరోపించారు. తన చట్టబద్ధ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఈ కోర్టు మీదే ఉందన్నారు. సీబీఐ ప్రత్యేక జడ్జి దుర్గాప్రసాదరావు పిటిషన్లను విచారణకు స్వీకరించారు. వాటిపై సీబీఐ సమాధానమేంటో చెప్పాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 21కి వాయిదా వేశారు.

కోర్టుకెళ్లే ముందు అరెస్టు చేశారు...

‘‘2011 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ (ఆర్‌సీ నెంబర్ 19(ఎ) నమోదు చేసింది. దాదాపు 9 నెలల పాటు దాదాపుగా దర్యాప్తు పూర్తి చేసి మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత, సరైన కారణాలు చూపకుండానే మే 27న నన్ను అరెస్టు చేసింది. నన్ను అరెస్టు చేసి ఆగస్టు 26 నాటికి 90 రోజులు దాటింది. నిజానికి ఆలోపే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయాలి’’ అని జగన్ గుర్తు చేశారు. కోర్టు ముందు హాజరయ్యేందుకు కేవలం కొన్ని గంటల ముందు సీబీఐ తనను అరెస్టు చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది వివక్షాపూరితమే గాక చట్టవిరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ‘‘ఎఫ్‌ఐఆర్ ఆర్‌సీ నంబర్ 19(ఎ)లో సీబీఐ నన్ను మే 27న అరెస్టు చేసింది. మొదటి చార్జిషీట్ (సీసీ-8)లో నాకు కోర్టు సమన్లు అందాయి. నన్ను కనీసం విచారించకుండానే నాపై ఏకంగా మూడు చార్జిషీట్లు కూడా దాఖలు చేసేసిన సీబీఐ... మరో నాలుగు రోజుల్లో కోర్టు ముందు హాజరవాల్సి ఉండగా నన్ను విచారణకు పిలిచింది. 

మూడు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి దాకా విచారించింది. అందుకు పూర్తిగా సహకరించా. తెల్లవారితే, నేను కోర్టు ఎదుట హాజరయితే, ఇక కేసు మొత్తం కోర్టు పరిధిలోకి వస్తుంది. నాకు బెయిలు వచ్చే వీలుంటుంది. ఆ అవకాశాన్ని దెబ్బ తీయడానికే కోర్టుకు వెళ్లేందుకు కొన్ని గంటల ముందు నన్ను అరెస్టు చేశారు’’ అని ఆయన వివరించారు. సీసీ నంబర్ 14లో ఆరో నిందితుడిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును, ఇతర నిందితులను సీబీఐ అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. ‘‘వారిని కూడా నేరానికి ప్రధాన కారకులుగా సీబీఐ పేర్కొం టోంది. కానీ అరెస్టు మాత్రం చేయలేదు. అంటే, నిందితులను అరెస్టు చేయకుండా, రిమాండ్‌కు తరలించకుండా కూడా దర్యాప్తు కొనసాగించవచ్చనేగా అర్థం?’’ అని ప్రశ్నించారు. తన అరెస్టును చట్టవిరుద్ధమని సీబీఐ న్యాయస్థానం కూడా అభివర్ణించిందని గుర్తు చేశారు. ‘‘90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని హైకోర్టు చెప్పినా సీబీఐ చేయలేదు. కాబట్టి చట్టబద్ధంగా నాకు బెయిల్ మంజూరు చేయండి’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎంపీనని జైల్లో పెడతారా?

ఒక వ్యక్తి హోదా గానీ, స్థాయి గానీ ఆయనకు వ్యతిరేకంగా మారకూడదని జగన్ పేర్కొన్నారు. తాను ఎంపీని గనక, తన పలుకుబడితో సాక్ష్యాలను తారుమారు చేయగలనని, సాక్షుల్ని ప్రభావితం చేయగలనని సీబీఐ చేస్తున్న వాదనను గట్టిగా ఖండించారు. ‘‘ఈయన ఈ పదవిలోకి రాకుండా ఉంటే బావుండేదనే స్థాయిలో ఒక వ్యక్తి తన హోదాను, స్థాయిని దుర్వినియోగం చేస్తే తప్ప అది ఆయనకు వ్యతిరేకంగా మారకూడదు. నేను ఎంపీగా ఎన్నికయింది ఇప్పుడు కాదు. సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేనాటికే ఎంపీని. అలాంటిది నన్ను కనీసం విచారణ కూడా చేయకుండా నాపై మూడు చార్జిషీట్లు వేశారు. దానర్థం నేను, నా పదవి ఈ దర్యాప్తుకు ఏమాత్రం అడ్డంకి కాలేదనే కదా? మరి ఆ కారణంతో నా బెయిలునెలా అడ్డుకుంటారు? నేను భవిష్యత్తులో కూడా ఎంపీగా ఉండొచ్చు. ఆ కారణంతో నాకు బెయిలివ్వకపోవటం సమంజసమా?’’ అని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, సాక్ష్యాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది గనుక దర్యాప్తును అడ్డుకునే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదని గుర్తు చేశారు. ‘‘ఎంపీగా, రాజకీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న నన్ను ఉప ఎన్నికల ప్రచార సమయంలో అరెస్టు చేశారు. ఇదే కేసులో నిందితుడు, ప్రభుత్వంలో అత్యంత శక్తివంతుడు అయిన మంత్రి మాత్రం బయటే ఉన్నారు. అలాంటప్పుడు నన్ను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదు. 

నన్ను రిమాండ్‌లో కొనసాగించడం పూర్తిగా వివక్షాపూరితం’’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో గత జూలై 27న తాను బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా.. తనను అరెస్టు చేసి అప్పటికి 90 రోజులు దాటనందున సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద తమ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని జగన్ చెప్పారు. గడువులోగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేయకపోతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే హక్కు తనకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘కానీ సుప్రీం ఆదేశాలకు సీబీఐ అధికారులు వక్రభాష్యం చెబుతున్నారు. దర్యాప్తును ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పజాలమని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సుప్రీం నిర్దేశించలేదని సీబీఐ డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ ఇటీవల మీడియాకు తెలిపారు. దర్యాప్తు పేరుతో చార్జిషీటు దాఖలును జాప్యం చేసే ప్రయత్నం జరుగుతోంది’’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ప్రత్యక్షంగా, పరోక్షంగా నేనెన్నడూ దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నేను బెదిరించినట్టు ఒక్క సాక్షి కూడా ఆరోపించలేదు. తుది విచారణకు అందుబాటులో ఉంటా. కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నా. బెయిల్ మంజూరు చేయండి’’ అని కోరారు.

source:sakshi
Share this article :

0 comments: