కుమ్మక్కు కుట్రలు చూడలేకే బయటకొచ్చాను - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుమ్మక్కు కుట్రలు చూడలేకే బయటకొచ్చాను

కుమ్మక్కు కుట్రలు చూడలేకే బయటకొచ్చాను

Written By news on Saturday, November 17, 2012 | 11/17/2012

చంచల్‌గూడ జైల్లో జగన్‌తో ములాఖత్
ప్రజల కోరిక మేరకే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే ఆ పార్టీని వీడాల్సి వస్తోందని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం ఆయన పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్ ద్వారా కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీని వదలాడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. ‘‘టీడీపీని స్థాపించినప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించిన నాపై పార్టీలో బురదజల్లే ప్రయత్నం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న చంద్రబాబు శైలిని తప్పుబట్టినందుకు పలమనేరు నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా మరొకరిని ప్రొత్సహిస్తూ నీచ రాజకీయాలకు తెరతీశారు. నేను మరో పార్టీలో చేరే పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించను కూడా లేదు. పాలక కాంగ్రెస్‌తో కుమ్మక్కై టీడీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే నేను వైఎస్సార్‌సీపీలో చేరే పరిస్థితి ఏర్పడింది. నేనెప్పుడూ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా చూసింది లేదు. ఆయన్ను కలిసింది ఇప్పుడే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో లాభం చేకూర్చాయి. 

వాటిని మళ్లీ జగన్ నెరవేర్చగలడన్న నమ్మకం నాకుంది’’ అని అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు. పలమనేరు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు జగన్‌తో కలిసి పని చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ‘‘టీడీపీ నన్ను సస్పెండ్ చేయడం కాదు, ప్రజలే ఆ పార్టీని ఎప్పుడో డిలీట్ చేశారు (తొలగించారు)’’ అని ఒక ప్రశ్నకు బదులుగా ఆయన చెప్పారు.

ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. శుక్రవారం చంచల్‌గూడ్ జైలులో ఆయన జగన్‌ను కలిశారన్న సమాచారం అందగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్కే ప్రసాద్ మీడియాకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం పంపారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున 92 మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, ఇప్పటివరకు 14 మంది పార్టీని వీడారు. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ బలం 78కి తగ్గింది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడటాన్ని టీడీపీ నేత దాడి వీరభద్రరావు తేలిగ్గా కొట్టిపారేశారు. పార్టీ నుంచి పోయే వారు పోతుంటారు, వచ్చే వారు వస్తుంటారన్నారు. ‘మీ కళ్ల ముందే బయటికి వెళ్లి విమర్శలు చేసిన వారు తిరిగి వచ్చి ఇదే వేదికపై కూర్చొని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం చూస్తున్నారు కదా!’ అని విలేకరులతో ఆయన వ్యాఖ్యానించారు.

రెండున్నర దశాబ్దాలుగా టీడీపీలోనే...

అమరనాథరెడ్డి రెండున్నర దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా పని చేశారు. పుంగనూరు నుంచి రెండుసార్లు, పలమనేరు నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా కూడా చేశారు. 2004లో టీడీపీ అధికారం కోల్పోయిన క్లిష్ట సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ సాహసించని సమయంలో వాటిని భుజానికెత్తుకున్నారు. 2009 ఎన్నికల ముందు నుంచి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆయన్ను అసంతృప్తికి గురిచేశాయి. కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయటికి వచ్చినప్పటి నుంచీ అమర్‌పై బాబు అనుమానం పెంచుకున్నారు. రాప్ట్రపతి ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండాలన్న బాబు నిర్ణయం, తెలంగాణపై తేల్చాలని ప్రధానికి లేఖ రాయడంపై అమర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఆయన్ను సాగనంపే వ్యూహంతో పలమనేరు బాధ్యతలను మాజీ మంత్రి పట్నం సుబ్బయ్యకు బాబు అప్పగించారు. అమరనాథరెడ్డి కుటుంబం టీడీపీ ఆవిర్భావంనుంచీ అందులోనే కొనసాగింది. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా వెన్నంటే నిలిచింది. 

అలాంటిది.. పార్టీకి ఎంతో సేవ చేసిన తన తండ్రి రామకృష్ణారెడ్డిపైనా బాబు తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని అమర్ జీర్ణించుకోలేకపోయారు. కార్యకర్తలు, నేతలతో ఆత్మీయ సభలు జరిపి, మెజారిటీ అభిప్రాయం మేరకు జగన్ నేతృత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నారు. వారం, పది రోజుల్లో పలమనేరులో భారీ బహిరంగ సభ నిర్వహించి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాలని భావిస్తున్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించి, విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాలని యోచిస్తున్నారు.
Share this article :

0 comments: