కాంగ్రెస్ ‘కొత్త’ జెండా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ ‘కొత్త’ జెండా?

కాంగ్రెస్ ‘కొత్త’ జెండా?

Written By news on Sunday, August 18, 2013 | 8/18/2013

సీమాంధ్ర ప్రాంతంలో తనకు పూర్తిగా నూకలు చెల్లాయన్న వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం, సరి‘కొత్త’ ఆలోచనలకు తెర తీస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, తదనంతర పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుదేలైందని పలు సర్వేలు ముక్త కంఠంతో తేల్చడం, వచ్చే ఎన్నికల్లో అది పూర్తిగా చతికిలపడటం ఖాయమని పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం తెలంగాణలోనైనా ఎంతో కొంత గట్టెక్కేందుకు రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంటే, దానివల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరడం సంగతి అలా ఉంచి సీమాంధ్రలో కాంగ్రెస్‌కు కనీసం నామరూపాలు కూడా మిగలకుండా పోయే పరిస్థితులు నెలకొనడం అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని కాంగ్రెస్ నేతలకు కనీసం జనంలోకి వెళ్లేందుకు కూడా ముఖం చెల్లడం లేదు! సీమాంధ్రలో తాము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున సమైక్య ఆందోళనలు వెల్లువెత్తుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు ఆందోళనకు లోనవుతున్నారు. పక్షం రోజులుగా సమైక్యోద్యమం నానాటికీ తీవ్రతరమవుతూ వస్తున్న తీరును చూశాక, సీమాంధ్రలో పార్టీ తిరిగి తలెత్తుకోవడం అసాధ్యమేనన్న నిర్ధారణకు వచ్చారు. దాంతో ‘కొత్త పార్టీ’ ఎత్తుగడతో గండం గట్టెక్కేందుకు మరో నయా నాటకానికి కాంగ్రెస్ తాజాగా తెర తీస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతోనే సమైక్యవాద నినాదంతో కొత్త పార్టీ పెట్టించడం, ఆ ముసుగులో ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాక దాన్ని తిరిగి విలీనం చేసుకోవడం ఈ ఎత్తుగడ సారాంశమని తెలుస్తోంది. దీని అమలుకు ఇప్పటికే రంగం సిద్ధమవుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్త పార్టీకి గట్టి పునాది వేయడంలో భాగంగా 1969, 1972 విభజన ఉద్యమాల పట్ల కఠినంగా వ్యవహరించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన ఇందిరాగాంధీ పేరు దానికి కలిసి ఉండేలా రూపకల్పన జరుగుతోందనికాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ‘‘సీమాంధ్రలో ‘కాంగ్రెస్’ పేరుతో సీమాంధ్రలో ఎన్నికల బరిలోకి దిగేందుకు పార్టీ నేతల్లో కనీసం ఒక్కరు కూడా ముందుకొచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ఇలాంటప్పుడు ఇంతకంటే వేరే మార్గం మాత్రం మాకు ఏముంటుంది?’’ అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దీని వెనుక కథ, స్క్రీన్‌ప్లే, డైరక్షన్ మొత్తం కాంగ్రెస్ అధిష్టానానిదేనని తెలుస్తోంది.
 
రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే ముప్పు నుంచి బయట పడటంతో పాటు అక్కడ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లలో చీలిక తెచ్చి రాజకీయంగా వీలైనంత లబ్ధి పొందడం కూడా కొత్త పార్టీ యోచన వెనక లక్ష్యంగా కన్పిస్తోంది. సమైక్య హోరులో కొట్టుకుపోకుండా పరువు దక్కించుకోవడంతో పాటు సమైక్య సెంటిమెంటును వేరే పార్టీలు ఏకమొత్తంగా తన్నుకుపోకుండా అడ్డుకట్ట వేయడం కోసం ఈ వ్యూహాన్ని రచిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన నేతగా సోనియాగాంధీ పేరుతో ఆ ప్రాంతంలో ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో సీమాంధ్రలో ‘సమైక్యానికి కట్టుబడిన ఇందిర’ పేరుతో పార్టీ పెట్టి ఓట్లు రాబట్టుకునే దిశగా వ్యూహరచన చేస్తోంది. కొత్త పార్టీ తరఫున సొంత పార్టీ నేతలనే బరిలోకి దించి, వారితో కాంగ్రెస్‌పైనే విమర్శలు గుప్పించి, సీమాంధ్రలో ఓట్లను వీలైనంతగా చీల్చి లబ్ధి పొందాలన్నది అధిష్టానం అభిప్రాయంగా కనిపిస్తోంది. సమైక్యవాదమే అజెండాగా ఆవిర్భవించే ఆ పార్టీ, ఎన్నికల దాకా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేసి, ఆ తర్వాత మళ్లీ అందులోనే కలిసిపోతుందన్నమాట!
 రాష్ట్ర ముఖ్యులతో ఇప్పటికే చర్చలు!
 కొత్త పార్టీ ఏర్పాటుపై రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. 1969లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ ప్రజా సమితి పేరిట కాంగ్రెస్ నేత మర్రి చెన్నారెడ్డి కొత్త పార్టీ పెట్టడం, ఎన్నికల్లో భారీగా లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాక దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని సీమాంధ్ర నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరోసారి దాన్నే పునరావృతం చేసే దిశగా ప్రణాళిక సిద్ధమవుతోందంటున్నారు. అయితే తెలంగాణ సెంటిమెంటును టీపీఎస్ సొమ్ము చేసుకున్నంతటి సానుకూలత కొత్త పార్టీకి ఉండకపోయినా కనీసం సీమాంధ్రలోని సమైక్య సెంటిమెంటు పూర్తిగా ఏదో ఒక్క పార్టీవైపే మొగ్గకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు. ముఖ్యంగా సీమాంధ్రలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఈ ప్రయోగం తప్పదన్న ఆలోచనకు అధిష్టానం వచ్చినట్టు చెబుతున్నారు. ఎందుకంటే సమైక్యోద్యమ సెగలు కాంగ్రెస్‌ను తీవ్రంగా తాకుతుండటంతో సీమాంధ్రలోని పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనలో పడుతున్నారు. ‘అందరికీ సమ న్యాయం జరగాలి. అలా లేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మేలు’ అని బలంగా వాణిని విన్పిస్తున్న వైఎస్సార్‌సీపీ వైపే అక్కడి ప్రజలు నిలుస్తుండటంతో కాంగ్రెస్ నేతల్లోనూ పలువురు అటే దృష్టి సారిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త పార్టీని కాంగ్రెస్ పెద్దలు తెరపైకి తెస్తున్నట్టు కనిపిస్తోంది. కొత్త పార్టీ ప్రజల భావోద్రేకాల నడుమ ఆవిర్భవించినట్టుగా చూపడం ద్వారా దాన్ని ప్రజలు విశ్వసించేలా చూసే దిశగా వారిప్పటికే స్క్రిప్టును సిద్ధం చేశారు. ఈ వ్యూహంలో భాగంగా, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చేసి ఈ పార్టీని ఏర్పాటు చేశారన్నట్టుగా కథ నడపాలని చూస్తున్నారు! నిజానికి ఆంటోనీ కమిటీని తెరపైకి తేవడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్నారు. కమిటీకి అభిప్రాయాలు చెప్పినా తమ సమస్యలను పార్టీ వినడం లేదన్న వాదనతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈకొత్త పార్టీకి అంకురార్పణ చేయనున్నారని కాంగ్రెస్‌లో గట్టిగా వినిపిస్తోంది.
 చేయాల్సిన సమయంలో చేయకుండా...
 కానీ కాంగ్రెస్ అధిష్టానం ‘కొత్త’ ఆలోచనలపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో ఆయోమయం, గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. ‘సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నవాళ్లమే అయితే అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నప్పుడే పదవులకు రాజీనామాలు చేయాల్సింది. అలా చేస్తే విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వాళ్లు. కానీ పదవుల కోసం అప్పుడు మిన్నకుండి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా దానివల్ల ఫలితం ఉంటుందనుకుంటే పొరపాటు’ అని వారంటున్నారు.
 
 కొత్త పార్టీ ఆలోచన నిజమే: రౌతు
 కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచనలు నిజమేనని రాజమండ్రి (సిటీ) కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అంగీకరించారు. ‘‘ఇందిర సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతమే సమైక్యవాదం. ఆ సిద్ధాంతాన్నే  కాంగ్రెస్ గౌరవించనప్పుడు మేమెందుకు ఆ పార్టీలో ఉండాలి?’’ అంటూ ప్రశ్నించారు! శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మాకు పార్టీ సుప్రీం కాదు. మా భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలు. ఇందిర పేరు చెప్పుకుని ప్రజల్లోకి వెళ్తాం’’ అని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిశాక కొత్త పార్టీకి పూర్తి స్వరూపం వస్తుందని రౌతు వివరించారు. ‘‘దానికి నాయకత్వం వహించేదెవరో త్వరలోనే చెబుతా. బహుశా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా నాయకత్వం వహించవచ్చేమో’’ అని కూడా పేర్కొన్నారు. కానీ ఇవన్నీ మీడియాలో ప్రసారమై కలకలం రేపడంతో, దాన్ని ఖండిస్తూ కాసేపటికే ఆయన వివరణ ప్రకటన ఇచ్చారు. ‘‘త్వరలో కొత్త పార్టీ ఆధ్వర్యంలో సమైక్యోద్యమం జరగనుందని నేను చెప్పినట్టు వార్తలొచ్చాయి. కానీ ఇందిర ఆశయాల మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానాన్ని కోరతామనేదే నా ఉద్దేశం’’ అని చెప్పుకొచ్చారు.
Share this article :

0 comments: