కాంగ్రెస్, చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్‌ల పరంపరలో మరో అంకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్, చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్‌ల పరంపరలో మరో అంకం

కాంగ్రెస్, చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్‌ల పరంపరలో మరో అంకం

Written By news on Friday, October 5, 2012 | 10/05/2012

చిదంబరానికి చంద్రబాబు లేఖ
స్వయంగా అందజేసిన టీడీపీ ఎంపీలు
అదే సమయంలో చిదంబరానికి బాబు ఫోన్!
ఈడీ అటాచ్ చేస్తోందంటూ వెంటనే ‘లీకులు’
అనంతరం నోట్ విడుదల చేసిన ఈడీ
పరిణామక్రమంపై రాజకీయ వర్గాల విస్మయం
మ్యాచ్‌ఫిక్సింగ్‌కు మరో నిదర్శనం

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అధికార కాంగ్రెస్, విపక్ష నేత చంద్రబాబు మధ్య నడుస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్‌ల పరంపరలో మరో అంకం గురువారం ఢిల్లీ వేదికగా ఆవిషృ ్కతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులను ఇంకా అటాచ్ చేసుకోలేదేమంటూ కేంద్ర ఆర్థిక మంత్రికి బాబు లేఖ రాయడం, టీడీపీ ఎంపీలు దాన్ని స్వయంగా తీసుకెళ్లి అందజేయడం, తర్వాత ‘జగన్ ఆస్తులను అటాచ్ చేస్తున్న ఈడీ’ అంటూ హస్తినలో ఓ ప్రముఖ వార్తా సంస్థకు లీకు వెళ్లడం ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయాయి! అనంతరం ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు ఈడీ కూడా నోట్ విడుదల చేసింది.

‘అవినీతి మహమ్మారి నిర్మూలన’ అంటూ ప్రధానికి చంద్రబాబు రాసిన ఏడు పేజీల లేఖ ప్రతిని టీడీపీ ఎంపీలు గురువారం చిదంబరానికి, అనంతరం రాత్రి 8 గంటలప్పుడు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అందజేశారు. దేశంలో అవినీతి ప్రస్తావనతో మొదలు పెట్టిన బాబు, ఆ తర్వాత లేఖలో అత్యధిక భాగాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లపై ఏళ్ల తరబడి తాను చేస్తూ వస్తున్న రొడ్డకొట్టుడు ఆరోపణలతోనే నింపేశారు. ‘ఎక్కడైనా సాధారణంగా కేసులు విచారణలో ఉండగానే నిందితుల ఆస్తిపాస్తులను ఈడీ అటాచ్ చేసుకుంటుంది. కానీ అక్రమ సొమ్ముతో జగన్ వేలాది కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారంటూ దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లు కూడా దాఖలు చేసినా ఇప్పటిదాకా ఏ ఆస్తులనూ అటాచ్ చేసుకోలేదు’ అంటూ తన ఉద్దేశాన్ని స్పష్టంగా వెల్లడించారు. అక్రమంగా జరిగిన సహజ వనరుల కేటాయింపులను రద్దు చేయడంతో పాటు, ‘వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు అవినీతి, అక్రమ మార్గాల ద్వారా కూడబెట్టిన ఆస్తులన్నింటినీ జప్తు చేయండి’ అంటూ కేంద్రానికి సలహా ఇచ్చారు. 

‘సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ కేసుపై వాదనలు జరుగుతున్న సమయంలో హఠాత్తుగా సీబీఐ న్యాయవాదిని కేంద్ర న్యాయ శాఖ మార్చింది. ఇది కేవలం కేసును నీరుగార్చేందుకే. జగన్‌ను 10 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి పొందిన ఈడీ, కనాకష్టంగా అందులో రెండు రోజులను మాత్రమే వినియోగించుకోగలిగింది’ అంటూ ఆక్షేపణలకు కూడా దిగారు. బాబు లేఖను మధ్యాహ్నం సుమారు 3 గంటలప్పుడు టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కె.నారాయణరావు, గుండు సుధారాణి, రమేశ్ రాథోడ్, సి.ఎం.రమేశ్ చిదంబరానికి నార్త్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో అందజేశారు. 20 నిమిషాల పాటు ఆయనతో చర్చించారు. 

అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. దాంతోపాటు అదే సమయంలో చంద్రబాబు కూడా చిదంబరంతో ఫోన్‌లో మాట్లాడారు. పాదయాత్రలో ఉన్న బాబు, మధ్యాహ్న భోజన విరామం కోసం పెనుకొండలో ఆగిన సందర్భంగా ఈ మేరకు ఫోన్ చేశారని తెలుస్తోంది. చిదంబరంతో టీడీపీ ఎంపీల భేటీ ముగిసిన కాసేపటికే, ‘జగన్ కేసులో కొందరి ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తోంద’ంటూ ఓ ప్రముఖ వార్తా సంస్థకు లీకులు వెళ్లాయి! ఈడీ వర్గాలను సంప్రదించగా, దీన్ని ధ్రువీకరించేందుకు నిరాకరించాయి. అనంతరం అటాచ్‌మెంట్ వివరాలతో ఈడీ నుంచి నోట్ విడుదలైంది.

ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న వారి ఆస్తులు జప్తు చేయాలని చిదంబరం, షిండేలకు విన్నవించామని నామా చెప్పారు. రాత్రి షిండేతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రానికి బాబు చేసిన సూచనలను వివరించారు. బాబు లేఖ వల్లే ఈడీ అటాచ్‌మెంట్ నోటీసు జారీ చేసిందనుకుంటున్నారా అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. దాన్ని టీడీపీ ఎంపీలు చిదంబరానికి అందజేసిన వెంటనే ఈడీ అటాచ్‌మెంట్ ప్రకటన చేసిందని, దీని వెనక కుట్ర ఉందని వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేసిన విమర్శలను, కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ ప్రచారాన్ని ప్రస్తావించగా.. నోటికొచ్చినట్టు మాట్లాడటం తగదని నామా అన్నారు. కోర్టు విచారణ కాంగ్రెస్ వల్ల జరగడం లేదని, కోర్టు ద్వారా జరుగుతోందని అధికార పార్టీని వెనుకేసుకొచ్చారు! జగన్ కేసును బలహీనపర్చడానికి సీబీఐ న్యాయవాదులను కేంద్రం మారుస్తోందని ఆరోపించారు. శుక్రవారం ప్రధానిని కలుస్తామన్నారు.
Share this article :

0 comments: