సీబీఐవి ద్వంద్వ ప్రమాణాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐవి ద్వంద్వ ప్రమాణాలు

సీబీఐవి ద్వంద్వ ప్రమాణాలు

Written By news on Thursday, October 4, 2012 | 10/04/2012

వాన్‌పిక్ భూముల వ్యవహారంలో సీబీఐ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని ఈ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ‘‘ఈ కేసులో సీబీఐ నా పట్ల ఒక రకంగా, మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు పట్ల మరో రకంగా వ్యవహరిస్తోంది. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా వాదిస్తోంది. కార్యదర్శుల బెయిల్ పిటిషన్ సమయంలో అన్ని నిర్ణయాలకు కార్యదర్శులదే బాధ్యతని చెబుతోంది. మా బెయిల్ పిటిషన్ల సమయంలో మాత్రం అన్ని నిర్ణయాలకు మంత్రులదే బాధ్యతని చెబుతూ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది’’ అని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి యు.దుర్గాప్రసాదరావు తీర్పును ఈ నెల 9కి వాయిదా వేశారు.

జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో అరెస్టయిన తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోపిదేవి వెంకటరమణ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు జరిగాయి. ముందుగా మోపిదేవి తరఫున ఎం.సురేంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ‘‘వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన క్యాబినెట్ నోట్‌ను రూపొందించింది మోపిదేవి కాదు. అప్పటి కార్యదర్శి మన్మోహన్‌సింగ్ దానిని రూపొందించారు. నోట్ తయారుచేసిన వ్యక్తి సమన్లు అందుకుని విచారణకు హాజరై వెళ్లిపోయారు. పిటిషనర్ మాత్రం సంబంధం లేని వ్యవహారాలతో జైలులో ఉన్నారు’’ అని పేర్కొన్నారు. చార్జిషీట్‌లో పలువురు మంత్రులపై ఆరోపణలు ఉన్నా.. అందరినీ ఒకేలా చూడటం సాధ్యం కాదని సీబీఐయే చెబుతోందని, దీన్నిబట్టి సీబీఐ ఒక్కొక్కరిపట్ల ఒక్కో రకంగా వ్యవహరిస్తోందని స్పష్టంగా అర్ధమవుతున్నట్లు వివరించారు. ఈ వాదనలను సీబీఐ న్యాయవాది బళ్లా రవీంద్రనాథ్ తోసిపుచ్చారు. ఈ కేసులో మోపిదేవి పాత్ర, ఇతర మంత్రుల పాత్రకు భిన్నంగా ఉందని ఆయన తెలిపారు.

source:sakshi
Share this article :

0 comments: