అంతిమ విజయం మనదే!:అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంతిమ విజయం మనదే!:అంబటి

అంతిమ విజయం మనదే!:అంబటి

Written By news on Saturday, October 6, 2012 | 10/06/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ తిరస్కారానికి గురైందని అధైర్యపడవద్దు.. జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ, ఈడీ చేస్తున్న కుట్రలు భగ్నం కాక తప్పదు.. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలను ఎదుర్కొని ధైర్య సాహసాలతో ముందుకు కదిలే వారసత్వం మనకుంది.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మనకు అదే నేర్పారు.. ప్రజా న్యాయస్థానంలో మనకు పూర్తి బలం ఉందనే విషయం గుర్తించి పార్టీ శ్రేణులు కదం తొక్కాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

అంతిమవిజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు శుక్రవారం జగన్‌కు బెయిలు నిరాకరించిన కొద్దిసేపటికి అంబటి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ను జైల్లోనే ఉంచి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారి ఆటలు ఏ మాత్రం సాగనివ్వకుండా పార్టీ కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలన్నారు. సుప్రీంకోర్టు బెయిలిస్తుందని.. 132 రోజుల తరువాత జగన్ మళ్లీ జనంలోకి వస్తారని.. తామంతా ఎంతో ఆశగా ఎదురు చూశామని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు బెయిల్‌ను తిరస్కరించడం తమకు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించిందన్నారు. జగన్ జైల్లో ఉంటే వైఎస్సార్ సీపీ మనుగడ ఉండదని కొందరు కలలు కంటున్నారని, విజయమ్మ నాయకత్వంలో దేదీప్యమానంగా పార్టీ ముందుకు నడుస్తుందని అంబటి చెప్పారు. 

పార్టీకి ఇబ్బంది లేదు: బెయిల్ తిరస్కరణపై మళ్లీ తాము సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే విషయం పరిశీలిస్తున్నామని అంబటి తెలిపారు. తుదికంటా న్యాయపోరాటం చేస్తామని... అంతిమ విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందనుకున్నపుడల్లా కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ, ఈడీ ఏదో ఒక గందరగోళం సృష్టించడం పరిపాటి అయిందని ఆయన విమర్శించారు. బెయిల్ పిటిషన్ విచారణకు రావడానికి ఒక్క రోజు ముందు ఈడీ అటాచ్‌మెంట్ నోటీసులు ఇవ్వడం వల్ల కోర్టు ప్రభావితమై ఉండొచ్చని తాము భావిస్తున్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత నెల 28వ తేదీన బెయిల్ విచారణ ఉందన్నపుడు కూడా సీబీఐ న్యాయవాదులను మార్చి సమయాన్ని దాట వేశారని గుర్తుచేశారు. జగన్ జైల్లో ఉండటం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇబ్బంది లేదనే విషయం కార్యకర్తలు, అభిమానులు గ్రహించాలన్నారు. అయితే మహాతల్లి విజయమ్మకు, జగన్ భార్యా పిల్లలు, సోదరికి కుటుంబసభ్యులకు మానసిక ఇబ్బంది ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

బాబు పాకుడు యాత్ర చేసినా ప్రతిష్ట పెరగదు

జగన్ జైలులో ఉన్నప్పుడు తాను పాదయాత్ర చేస్తే రాజకీయ బలం పెరుగుతుందని చంద్రబాబు ఆశిస్తే అది అడియాసే అవుతుందని అంబటి ఎద్దేవా చేశారు. పాదయాత్ర కాదు కదా, పాకుడు యాత్ర చేసినా ఆయన ప్రతిష్ట, బలం పెరగదని తేల్చి చెప్పారు.
Share this article :

0 comments: