నేడు సాయంత్రం కృష్ణా జిల్లాకు షర్మిల యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు సాయంత్రం కృష్ణా జిల్లాకు షర్మిల యాత్ర

నేడు సాయంత్రం కృష్ణా జిల్లాకు షర్మిల యాత్ర

Written By news on Wednesday, September 11, 2013 | 9/11/2013

విజయవాడ :
 సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘సమైక్య శంఖారావం’ బస్‌యాత్ర బుధవారం జిల్లాలోకి ప్రవేశించనుంది. రెండు రోజులపాటు సాగే ఈ యాత్ర దివిసీమ గుండె తట్టి కొల్లేరు వాసుల అభిమాన అలల నడుమ పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుతుంది. అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల గుండా ఈ యాత్ర సాగుతుంది.
 
 ఈ నెల 2న ఇడుపులపాయలోని వైఎస్ సమాధిని దర్శించి నివాళులర్పించిన షర్మిల అదే రోజున తిరుపతి నుంచి సమైక్య శంఖం పూరించిన విషయం విదితమే. చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో యాత్రను పూర్తిచేసుకొని బుధవారం సాయంత్రం 4గంటల సమయంలో రేపల్లె నుంచి పెనుమూడి-పులిగడ్డ వారధి మీదుగా ఆమె కృష్ణా జిల్లా అవనిగడ్డకు చేరుకుంటారు. అవనిగడ్డ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రాత్రి జరిగే బహిరంగ సభలో షర్మిల మాట్లాడతారు. ఆ రాత్రికి అవనిగడ్డలోనే బస చేసి గురువారం ఉదయం అక్కడ నుంచి చల్లపల్లి, కొడాలి, పామర్రు, అడ్డాడ, గుడ్లవల్లేరు, విన్నకోట, ముదినేపల్లి మీదుగా కైకలూరు చేరుకుంటారు.  కైకలూరులో సుమారు 11గంటల సమయంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఏలూరు వైపునకు ఆమె బస్‌యాత్ర సాగనుంది.
 
 అవనిగడ్డ బహిరంగసభ ఏర్పాట్లు పరిశీలన
 అవనిగడ్డ బస్టాండ్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభ ప్రాంతాన్ని, ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, బందరు, గుడివాడ తాజా మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్, పార్టీ నేతలు గుడివాక శివరావు, యాసం చిట్టిబాబు, లేళ్ల అప్పిరెడ్డి  తదితరులు మంగళవారం పరిశీలించారు. షర్మిల బస్ పైనుంచే ప్రసంగించే ఏర్పాటు ఉన్నందున స్థానికంగా వేదిక అవసరంలేదని వారు గుర్తించారు. జనం పెద్ద ఎత్తున తరలివస్తే.. సభ జరిగే  ప్రాంతం సరిపోతుందా లేదా అనేది వారు చర్చించారు.
 
 కాంగ్రెస్, టీడీపీల్లో గుబులు..
 మరోప్రజాప్రస్థానం పాదయాత్రతో అటు పార్టీశ్రేణుల్లోను, ఇటు ప్రజల్లోను ఉత్సాహం నింపిన షర్మిల సమైక్య శంఖారావంతో ఇప్పుడు జిల్లాకు రానుండడం.. కాంగ్రెస్, టీడీపీలకు కలవరపాటుగా మారింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి ప్రజలు మరింత దగ్గర కావడంతో పాలక, ప్రధాన ప్రతిపక్షాలకు గుబులు రేగుతోంది. ఇప్పటికే తెలంగాణ  ఏర్పాటుకు అనుకూల నిర్ణయంతో జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి తలెత్తింది. తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంది. లేఖ వెనక్కి తీసుకుంటానని చెప్పలేక, సమైక్యతకే కట్టుబడినట్టు తేల్చలేక చంద్రబాబు సంకటస్థితిని ఎదుర్కొంటుండగా.. ఆయనపై ప్రజలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. జిల్లాలో ఐదు రోజులుగా ఆయన నిర్వహిస్తున్న యాత్రకు జనం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం అలముకుంది. రోజుల తరబడి ఉద్యమిస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులంతా.. వైఎస్సార్‌సీపీ తీసుకున్న సమైక్య నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు.
  షర్మిల సమైక్యశంఖారావం బస్సుయాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ కోరారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు అవనిగడ్డ బస్టాండ్ సెంటర్, గురువారం ఉదయం 11గంటల సమయంలో కైకలూరు బహిరంగ సభల్లో ఆమె ప్రసంగిస్తారని తెలిపారు.
Share this article :

0 comments: