లేఖ పూర్తి పాఠమిది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లేఖ పూర్తి పాఠమిది

లేఖ పూర్తి పాఠమిది

Written By news on Thursday, November 14, 2013 | 11/14/2013

విభజనతో అంతా చేటే
రాష్ట్ర విభజనకు విధివిధానాలను రూపొందించే విషయంలో వివిధ పార్టీల అభిప్రాయాలను, సూచనలను తెలుసుకోడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు బుధవారం ఢిల్లీలో కలుసుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ పార్టీ తీసుకున్న వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ   అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన సవివరమైన లేఖను మంత్రుల బృందానికి అందజేశారు. ఆ లేఖ పూర్తి పాఠమిది...
 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రివర్గం 2013 అక్టోబర్ 3న తీసుకున్న నిర్ణయం 75 శాతం రాష్ట్ర ప్రజల అభీష్టానికి విరుద్ధమైనది. ఈ నిర్ణయం వల్ల ముందు తరాలకు శతాబ్దాల తరబడి తీవ్ర హాని కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టే గత మూడున్నర నెలలుగా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కేంద్ర నిర్ణయం తెలుగు ప్రజలకు  సహజంగానే 1905 నాటి బెంగాల్ విభజనను గుర్తుకు తెస్తోంది. నాడు కర్జన్ అనుసరించిన ‘విభజించి పాలించు’ కుటిల నీతినే కాంగ్రెస్ అధిష్టానం  నేడు ఏపీ విషయంలో చేపట్టింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలేగాక దేశ ప్రజలు సైతం లేవనెత్తుతున్న పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది:

 1.    ఓట్లు, సీట్లు రాబట్టుకోడానికి కేంద్రం తన అధికారాలను స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగ పరచవచ్చా?
 2.    2009 డిసెంబర్ 9న కేంద్రం రాష్ట్రాన్ని విభజించాలని ఏకపక్షంగా నిర్ణయించింది. పైగా అది, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన కానుక అని ఆ పార్టీ పేర్కొంది. అలాంటి కొలబద్దతో రాష్ట్ర విభజనకు పాల్పడవచ్చా?
 3.    రాజకీయ ఉద్దేశాలతో, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్న కేంద్రం... ఆంధ్రప్రదేశ్ 1955లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్సార్సీ) చేసిన ప్రతిపాదనల మేరకు జరిగిన పునర్వ్యవస్థీకరణతో  ఏర్పడ్డ భాషాప్రయుక్త రాష్ట్రమని విస్మరించింది. రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉన్నంత మాత్రాన నిర్దిష్టమైన ప్రాతిపదికగానీ, హేతుబద్ధతగానీ లేకుండానే ఇలా ఏపీని విభజించవచ్చా?  
 4.    దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ప్రత్యేక రాష్ట్రాలను కోరుతున్నారు. కొన్ని శాసనసభలు అందుకు అనుకూలంగా తీర్మానాలను కూడా చేశాయి. అవన్నీ మూలనపడి ఉండగా సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు ఏపీ విభజన కోసం కేంద్రం ఎందుకు ఉరుకులు పరుగులు పెడుతోంది?  
 5.    నేడు కేంద్రం ఇలా ఇష్టానుసారంగా పార్లమెంటు సాధారణ మెజారీటీతో ఏపీని విభజిస్తే, ముందు ముందు వచ్చే   ప్రభుత్వాలకు అది ఆనవాయితీగా మారదా?
 6.    రాష్ట్ర శాసన సభను సంప్రదించకుండానే కేంద్ర మంత్రివర్గం 2013 అక్టోబర్  3న రాష్ట్ర విభజన నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ ప్రథమ సిఫారసుగా పేర్కొన్న శ్రీకృష్ణ కమిషన్ నివేదికను విస్మరించింది. దాన్ని దృష్టిలో ఉంచుకుంటే రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్‌కు ప్రాతిపదిక ఏమిటి?అది ఎలా సమంజసం?
 7.    ఏ నిర్ణయానికైనా నిజమైన ప్రాతిపదికలు ప్రజాభీష్టం, శాసనసభలే. ఆ రెంటినీ విశ్వాసంలోకి తీసుకోకుండా సంబంధిత శాఖల నుంచి మంత్రుల బృందం నివేదికలను కోరేంత దూరం పోవడమేమిటి?
 8.    ఇంతవరకు ఏర్పడ్డ 28 రాష్ట్రాల విషయంలో పాటించిన ఉత్తమ సంప్రదాయాలన్నిటినీ ఏపీ విభజనలో ఎందుకు విస్మరిస్తున్నారు?   

 చరిత్ర

 1956లో ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమైనప్పుడు హైదరాబాద్ శాసనసభ మూడింట రెండు వంతుల మెజారిటీతో భాషాప్రాతిపదికపై సమైక్య రాష్ట్రం ఏర్పాటుకు తీర్మానాన్ని ఆమోదించింది. కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా అందుకు తీర్మానించింది. నేటి రాష్ట్ర విభజన నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటి? తెలుగువారంతా ఒక్కటికావాలనే తెలుగు ప్రజల ప్రగాఢ  వాంఛ కారణంగానే భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందంటూ 1972లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ  పార్లమెంటు వేదికపై నుంచి గుర్తు చేశారు.‘‘సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలు పోరాటం సాగించారంటే అందుకు ప్రేరణ బహుశా తెలుగువారి సుదీర్ఘ చరిత్రే అయివుండాలి... పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న కొందరి కోరికను జయించినది తెలుగు ప్రజల ఆ ఆకాంక్షే’’ అని ఆమె ఆ సందర్భంగా అన్నారు.
 
 హైదరాబాద్
 హైదరాబాద్ నగరం గత 60 ఏళ్ల కాలంలో మొత్తం 23 జిల్లాలకు కేంద్రంగా అభివృద్ధి చెందింది. రాష్టం విడిపోతే యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలి? రాష్ట్రానికి 972 కిలోమీటర్ల తీరం ఉంది. రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ రంగాలకు అది ఇరుసుగా ఉంది. మెట్రో నగరం, తీర ప్రాంతం, సముద్ర రవాణా వ్యవస్థ, అంతర్జాతీయ విమానాశ్రయాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి అభివృద్ధి చక్రంలోని విడిభాగాలుగా ఉన్నాయి. వేటికవిగా వాటిని విడదీస్తే రెండు ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తరలిపోతాయి, కొత్తవి రావు, లే-ఆఫ్‌లు పెరుగుతాయి, కొత్తగా ఉపాధి కల్పన జరగదు. దేశంలో అతి ఎక్కువగా మాట్లాడే భాషగా హిందీ తర్వాత తెలుగు రెండో స్థానంలో ఉంది. బడ్జెట్ రీత్యా దేశంలోని మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అలాంటి పెద్ద, బలమైన రాష్ట్రాన్ని విభజించడానికి ప్రయత్నించడమంటే తెలుగుజాతిని బలహీనపర్చే కుట్రగానే భావించాల్సి ఉంటుంది.
 
 గత 60 ఏళ్లుగా తెలుగు ప్రజలందరు చేసిన సమష్టి కృషి ఫలితంగానే నేడు హైదరాబాద్ రాబడి రాష్ట్ర బడ్జెట్‌లో సగానికి పైగా ఉంది. రాష్ట్ర విభజనతో ఉద్యోగులకు జీతాలు చెల్లించడ మే ప్రభుత్వానికి కష్టమౌతుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కుంటుపడతాయి. ఓట్ల కోసం, సీట్ల కోసం భావి తరాలకు ముప్పుగా మారే ఈ విభజనకు పాల్పడటం సమంజసం కాదు. పైగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు నేడు హైదరాబాద్‌లో ఉపాధిని పొందుతున్నారు. తమ చిన్న పొదుపులను ఇక్కడే మదుపు చేశారు. విభజన జరిగితే ఆ పెట్టుబడుల విలువ ఒక్కసారిగా పడిపోతుంది. వారికి కలిగే నష్టాన్ని సోనియాగాంధీ, కాంగ్రెస్‌లు భ ర్తీ చేస్తాయా?
 
 రెండు రాయలసీమ జిల్లాలను కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వంటి హాస్యాస్పదమైన ప్రతిపాదనలు కొన్ని షికార్లు చేస్తున్నాయి. ఓట్లు, సీట్ల కూడికలు తీసివేతల లెక్కల బుర్రల్లోంచే అలాంటి నీచ ప్రతిపాదనలు పుట్టుకొస్తాయి. రెండు జిల్లాలే ఎందుకు? మొత్తం 23 జిల్లాలను ఇప్పటిలాగే ఉంచేసి, రాష్ట్రం పేరును తెలంగాణగా మారిస్తే సరిపోతుంది. తన సొంత రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పాల్పడుతోందని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి.
 
 నేడు అధికార కాంగ్రెస్ పార్టీ ఏపీని చీల్చడానికి ప్రయత్నిస్తోంది. ఇతర రాష్ట్రాలు, ప్రజలు, పార్టీలు ఇది తమకు సబంధించిన వ్యవహారం కాదని మిన్నకుంటే రేపు వారి వంతుకూడా వస్తుంది. తమిళనాడును చీల్చడానికి  జయలలిత, చిదంబరం ఆమోదిస్తారా? పశ్చిమబెంగాల్‌ను విభజిస్తామంటే మమతాబెనర్జీ, కమ్యూనిస్టులు ఊరుకుంటారా? ఒడిశాను చీల్చేస్తామంటే నవీన్ పట్నాయక్ సరేనంటారా? గుజరాత్‌ను రెండు ముక్కలు చేసేస్తామంటే మోడీ తల ఊపేస్తారా? అంతదాకా ఎందుకు పంజాబ్‌ను విభజిస్తామంటే ప్రధాని మన్మోహన్‌సింగ్ అంగీకరిస్తారా? అసలు ఇలాంటి ప్రతిపాదనలను ఆయా రాష్ట్రాల ప్రజలు సహిస్తారా?
 
 ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న ఈ అన్యాయాన్ని దేశం మౌనంగా ప్రేక్షకునిలా చూస్తూ ఉండిపోతే, రేపు కేంద్రంలో అధికారంలోకి వచ్చే మరో పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవే ఎత్తుగడలను అనుసరించదా? మేధావులు, ప్రజాస్వామిక సంస్థలు, రాజ్యాంగాన్ని గౌరవించేవారంతా కేంద్రం నేడు ఏపీకి చేస్తున్న ఈ అన్యాయంపై స్పందించకపోతే ఆ రక్కసి రేపు మరో రాష్ట్రంలో ప్రత్యక్షమౌతుంది.  ఈ సందర్భంగా నాజీల ఫాసిస్టు భావజాలం గురించి జర్మన్ మత తత్వవేత్త మార్టిన్ నీమోలర్ చేసిన హెచ్చరికను గుర్తు చేసుకోవడం అవసరం.
 
 మొదట వాళ్లు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,
 కమ్యూనిస్టును కాను కాబట్టి నేను మాట్లాడలేదు.
 ఆ తర్వాత వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారు,
 సోషలిస్టును కాను కాబట్టి నేను మాట్లాడలేదు.
 ఆ తర్వాత వాళ్లు ట్రేడ్  యూనియనిస్టుల కోసం వచ్చారు,
 ట్రేడ్  యూనియనిస్టును కాను కాబట్టి నేను మాట్లాడలేదు.
 ఆ తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు
 యూదును కాను కాబట్టి నేను మాట్లాడలేదు.
 ఆ తర్వాత వాళ్లు కేథలిక్కుల కోసం వచ్చారు,
 కేథలిక్కును కాను కాబట్టి నేను మాట్లాడలేదు.
 ఆ తర్వాత వాళ్లు నా కోసం వచ్చారు, అప్పుడు వెనక్కి చూస్తే..
 నా కోసం మాట్లాడటానికి ఎవరూ మిగల్లేదు.

 
 మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పనిసరి
 నేటి రాష్ట్రాలు ఎస్‌ఆర్‌సీ ప్రతిపాదనల మేరకు భాషాప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేసినవి. కాబట్టి వీటి విభజనకు రాష్ట్ర శాసనసభలోనూ, పార్లమెంటులోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ ఆమోదం తప్పనిసరి. ఆ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలి. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అలాంటి నిబంధన లేకపోతే ఓట్ల కోసం, సీట్ల కోసం బలమైన రాష్ట్రాలను విభజించి, బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి.   
 
 అధికార కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షం టీడీ పీ, టీఆర్‌ఎస్‌ల తో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలతో  గత నాలుగేళ్లుగా ఏపీ పరిస్థితి దిగజారిపోయింది. ఈ విభజన తెలుగు ప్రజలకు ఉపయోగపడేది కాదని, అలాంటి అవసరమే లేదని రాష్ట్ర జనాభాలోని 75 శాతం ప్రజలు భావిస్తున్న విషయం గత మూడున్నర మాసాలుగా సాగుతున్న ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో 17 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆశే కేంద్ర ం, కాంగ్రెస్‌లను ఈ విభజనకు పురిగొల్పిన చోదక శక్తి.
 
 విభజిస్తే కన్నీళ్లే మిగులుతాయి..
 రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న జల వివాదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ట్రిబ్యునళ్లు, కోర్టు తీర్పులు, ఆదేశాలు, వాటర్ బోర్డుల ఏర్పాటు ఉన్నా తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ వివాదం చెలరేగుతూనే ఉంది. ఏపీ అభ్యంతరాలను బేఖాతరు చేసి మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు వంటి నిర్మాణాలను చట్ట విరుద్ధంగా చేపడుతూనే ఉంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక తమ అవసరాలు తీరిన తర్వాతనే ఏపీకి నీటిని వదులుతామని అంటున్నాయి. సమైక్యంగా ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే, రాష్ట్రాన్ని విభజిస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? విభజనతో రాష్టంలో కృష్ణా నది ప్రవహించే ప్రాంతం వెంబడి తరచుగా ఘర్షణలు తలెత్తవా? కృష్ణా ఆయకట్టుకు నీరు ఎలా అందిస్తారు? గోదావరి జలాల సంగతి ఏమిటి? పోలవరం ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది? మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టుల గతి ఏమిటి? కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రజలాలు తప్ప తాగునీటికి వనరు ఏముంటుంది?
 
 ట్రిబ్యునళ్లు, బోర్డులు నిరర్థకమైనవి కావడం వల్ల సమైక్యంగా ఉండగానే రాష్ట్రం దుర్భిక్షానికి, వరద బీభత్సానికి గురికావాల్సి వస్తోంది. విభజన జరిగితే పరిస్థితి మరింతగా విషమిస్తుంది. మరో జల మండలినో లేదా వాటర్‌బోర్డునో ఏర్పాటు చేయడం.. దేనికి తోడ్పడుతుంది? కృష్ణా జలాల వినియోగానికి బచావత్ ట్రిబ్యునల్ మా రాష్ట్రానికి పూర్తి హక్కులను ఇచ్చింది. మా హక్కులను పూర్తిగా విస్మరించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ హక్కులను మహారాష్ట్ర, కర్ణాటకలకు కట్టబెట్టింది. రాష్ట్ర విభజన జరగబోతుందన్న వార్తలతో అప్పుడే ఆ రెండు రాష్ట్రాలు మిగులు జలాల్లోనూ, కేటాయించిన జలాల్లోనూ కూడా తమ వాటాలను పెంచాలని కోరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తెలుగు ప్రజలపై మరింత తీవ్రమైన దుష్ర్పభావం చూపక మానదు.
 
 అసలు ఈ జల మండళ్లు ఎందుకు? మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి మనకు వచ్చే నీటి విషయంలో లేని ఈ మండళ్లు ఎందుకు? ఎగువన ఉన్న రెండు రాష్ట్రాలు తమ ఇష్టానుసారం ప్రాజెక్టులు కట్టుకొని, తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు వాడుకోవడాన్ని అనుమతించి,.. తెలంగాణ, సీమాంధ్రల్లో ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టకుండా నిరోధించడానికే. తెలుగు రైతులు నదీ జలాల్లోని తమ న్యాయమైన వాటాను కోల్పోవడాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోవాలని వారు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర జల వనరుల శాఖ పర్యవేక్షణ కింద ఉండే జల మండలిని, దాని పర్యవేక్షణ  కింద ఉండే వాటర్ బోర్డును ఏర్పాటు చేస్తారని అంటున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని ఈ ఏర్పాటును ఎందుకు చేస్తున్నట్టు?  
 
  దేశంలో మరెక్కడా లేని విధంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు రైతాంగానికి ఉచిత విద్యుత్ వరాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో నేడున్న 31 లక్షల విద్యుత్ కనెక్షన్లలో దాదాపు 20 లక్షలు తెలంగాణలోనే ఉన్నాయి. రైతులకు రోజుకు రెండు లేదా మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా ఉంటోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు విభజన జరిగితే రైతులకు అరగంటపాటు కూడా విద్యుత్ సరఫరా ఉండదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా, రైతాంగంపైనా కలిగే ఈ తీవ్ర దుష్పరిణామాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు.
 
 ఆలోచనలను రేకెత్తించేదిగా అనిపిస్తున్న ఒక వాదనపై ఈ సందర్భంగా కొంత చెప్పదల్చుకున్నాం. సోనియాగాంధీ 1968లోనే రాజీవ్‌గాంధీని పెళ్లి చేసుకున్నా, భారత పౌరసత్వాన్ని స్వీకరించినది మాత్రం 1983లోనే. ఆమె భారత పౌరురాలై సరిగ్గా 30 ఏళ్లయింది. ఈ 30 ఏళ్ల అనుబంధం తర్వాత విదేశాల్లో జన్మించిన... జన్మతః భారతీయులు కాని వారంతా దేశం విడిచిపోవాలని పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే ఆమెకుగానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్‌లో కలసిమెలసి ఒక్కటిగా నివసిస్తున్న కోట్లాది మంది తెలుగు ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్న ఇది. గత 60 ఏళ్లుగా పెనవేసుకున్న  ఈ అనుబంధాన్ని అర్థం చేసుకోవాలని, కోట్లాది మంది తెలుగు ప్రజలకు కొన్ని తరాలపాటు అధోగతి పాలు చేసే ఈ రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
 జై  ఆంధ్రప్రదేశ్
 జై  తెలుగు తల్లి

 
 వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డి
 హైదరాబాద్
 13.11.2013
Share this article :

0 comments: