కనీసం చప్పట్లయినా కొట్టండి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కనీసం చప్పట్లయినా కొట్టండి!

కనీసం చప్పట్లయినా కొట్టండి!

Written By news on Monday, November 25, 2013 | 11/25/2013

అనంతపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా సీఎం కిరణ్ అభివర్ణిస్తోన్న రచ్చబండ కార్యక్రమం... ‘అధికార’ దుర్వినియోగానికి పరాకాష్టగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటిచెప్పడానికి మంత్రులు  నార్పల ‘రచ్చబండ’ సాక్షిగా అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలపై ఆర్టీఏ అధికారులను ప్రయోగించి, బెదిరించి... వాహనాలను సమీకరింపజేశారు.
 
 వాటిని ఐకేపీ సిబ్బందికి అప్పగించి.. పది మంది సభ్యులున్న ప్రతి మహిళా సంఘానికి రూ.1,500 చొప్పున ఐకేపీ నిధులు పంపిణీ చేసి... సభకు తరలింపజేశారు. సభకు వస్తేనే రేషన్‌కార్డు, పెన్షన్, ఇళ్లు వంటి మంజూరు చేయిస్తామని బెదిరించి మరి కొందరిని రప్పించారు. అధికార దుర్వినియోగం చేసి జనసమీకరణలో ఒకింత బయటపడిన కాంగ్రెస్ నేతలు.. సభలో ప్రజాస్పందన కరువవడంతో అవాక్కయ్యారు.
 
 ‘కనీసం చప్పట్లయినా కొట్టండి’ అని సాక్షాత్తూ సీఎం కిరణ్ ప్రాధేయపడినా ప్రజలు స్పందించకపోవడమే అందుకు తార్కాణం. రచ్చబండలో భాగంగా సీఎం కిరణ్ ఆదివారం నార్పలలో పర్యటించారు. ఉదయం 11.30 గంటలకు బెంగళూరు నుంచి హెలీకాప్టర్‌లో నార్పలకు చేరుకున్న సీఎం.. రెండే రెండు గంటలు గడిపారు. మధ్యాహ్నం 1.30 గంటలకు చిత్తూరు జిల్లాకు బయలుదేరి వెళ్లారు. నార్పల పర్యటనలో రూ.32.91 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహించకుండా... నేరుగా బహిరంగ సభకు చేరుకున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తాను సీఎంగా బాధ్యతలు చేపట్టాక అభివృద్ధిపథంలో దూసుకెళ్లేలా చేశానంటూ గొప్పలు చెప్పుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కడదాకా పోరాడతానని చెబుతూ.. తనను మాత్రమే సమైక్య చాంపియన్‌గా గుర్తించాలని ప్రజలను పరోక్షంగా కోరారు.

 జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌లైతే సీఎం కిరణ్‌కు ఏకంగా ‘సమైక్య సింహం’ అంటూ బిరుదే ఇచ్చేశారు. ఇదొక పార్శ్వమైతే.. మరొక పార్శ్వం మంత్రి శైలజానాథ్ అధికార దుర్వినియోగం. ప్రైవేటు విద్యా సంస్థల వాహనాలను సమీకరించాలంటూ ఆర్టీఏ అధికారులను ఉసిగొల్పారు. అన్ని అనుమతులూ ఉన్నా ప్రైవేటు విద్యాసంస్థల వారిని ఆర్టీఏ అధికారులు బెదిరించి.. శనివారం రాత్రే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఐకేపీ అధికారులకు అప్పగించారు. శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల పరిధిలోని ఐకేపీ సిబ్బందికి ఆ వాహనాలను డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి అప్పగించారు.
 
 పది మంది సభ్యులున్న మహిళా సంఘానికి రూ.1500 చొప్పున ముట్టజెప్పి.. వాహనాల్లో మహిళలను నార్పలకు తరలించారు. ఇక శింగనమల చెరువుకు హెచ్చెల్సీ నీటిని ఇప్పిస్తామంటూ ఆయకట్టు రైతులను రచ్చబండ సభకు తీసుకొచ్చారు. బెదిరించి.. భయపెట్టి తీసుకొచ్చిన జనం నుంచి ఏమాత్రమూ స్పందన కన్పించకపోవడంతో మంత్రులు డీలాపడ్డారు. తన ప్రసంగానికి ఏమాత్రం స్పందన రాకపోవడంతో సీఎం కిరణ్ ‘కనీసం చప్పట్లయినా కొట్టండి’ అంటూ పదే పదే బతిమాలుకోవడం గమనార్హం.
Share this article :

0 comments: