మామలాగే జగన్ కూడాఏదైనా పెద్దమనసుతో ఆలోచిస్తాడు..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మామలాగే జగన్ కూడాఏదైనా పెద్దమనసుతో ఆలోచిస్తాడు..!

మామలాగే జగన్ కూడాఏదైనా పెద్దమనసుతో ఆలోచిస్తాడు..!

Written By news on Tuesday, May 6, 2014 | 5/06/2014

భర్త మీద ప్రేమ, ప్రజలకు మంచి జరగాలనే కోరిక తప్ప రాజకీయాలంటే ఇష్టం లేని సగటు ఇల్లాలు ఆమె. ఇంటి బాధ్యతలు... వ్యాపార బాధ్యతల నిర్వహణతోనే సతమతమయ్యే వై.ఎస్. భారతి కొద్దిరోజులుగా పులివెందుల అసెంబ్లీ స్థానంలో భర్త వై.ఎస్. జగన్ తరఫున ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. అంత బిజీలోనూ ‘ఎక్స్‌ప్రెస్ టి.వి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నారు. గత అయిదేళ్ళలో ఎదురైన అనేక కష్టాలు, సన్నిహితులైన వ్యక్తులే స్వార్థంతో చేసిన ఆరోపణలు, కొన్ని నెలల పాటు భర్తకు దూరంగా గడపాల్సి వచ్చిన బాధామయ క్షణాలు... వాటన్నిటితోపాటు వాళ్ల మామ పట్ల తనకున్న గౌరవం, భర్త మీద తనకున్న ప్రేమాభిమానాలు... ఇలా ఎన్నో అంశాల గురించి మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యాంశాలు...
 
దేవుడు ఆశీర్వదించాలి... మంచిగా వర్షాలు రావాలి... మన ఆర్థిక వ్యవస్థ బాగుండాలి... ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి.
   
 దేవుని ఆశీస్సులతో జగన్ ముఖ్యమంత్రి అయితే, తండ్రీ కొడుకులిద్దరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావడం రాష్ట్రంలో తొలిసారి అవుతుంది. అయితే, దానికిమించి తండ్రీ కొడుకులిద్దరూ అత్యుత్తమ ముఖ్యమంత్రులుగా చరిత్రలో వుండిపోవాలని నా ఆకాంక్ష!
   
 ఇక జగన్‌కయితే... తరువాతెప్పుడో వచ్చిన తరాలు కూడా ‘ఒక నాయన... కొడుకు ఉండేవారు. వాళ్ళు చాలా బాగా చేశారు. ప్రజలకు అండగా నిలబడ్డారు. ప్రజలకు బాగా సహాయపడ్డారు’ అని అనిపించుకొనేలాగా ప్రజలకు సేవ చేయాలన్నది ఆలోచన!

 
జగన్‌గారు రాజకీయాల్లోకి రాక ముందు మీ లైఫ్ ఎలా ఉండేది? వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయి?
 భారతి: 2001 - 02 ప్రాంతంలో అనుకుంటా... మేము బెంగుళూరుకు షిఫ్టయ్యాం. అక్కడ మాది చాలా ప్రశాంతమైన జీవితం. అక్కడ జగన్‌కు చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇద్దరో, ముగ్గురో ఉండేవాళ్ళు. బంధువులు కూడా అక్కడ పెద్దగా ఉండేవాళ్ళు కాదు. దాంతో, మాకు చాలా తీరిక సమయం దొరికేది. మేము, పిల్లలం కలసి చాలా సేపు గడిపేవాళ్ళం. పొద్దున్నే ఇద్దరం ఆఫీసుకు పోయేవాళ్ళం. ఇద్దరం సాయంకాలం వాకింగ్‌కు వెళ్ళేవాళ్ళం. అలాగే, జగన్ కూడా సాయంత్రాలు పిల్లలతో చాలా సమయం గడిపేవాడు. మాది వెరీ క్లోజ్ నిట్ హ్యాపీ ఫ్యామిలీ.
 
మరి ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోతున్నామన్న భావన కలుగుతోందా?
భారతి: ముందు అలా అనిపిస్తా ఉండింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు ‘దేవుడా! ఆయన బయట ఉంటే, సంతోషంగా ఉంటే చాలు... తన పనితో బిజీగా ఉండి, మాకు అంత టైమ్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఫరవాలేదు’ అనుకొనేదాన్ని. ఇప్పుడేమో పిల్లలతో ఇంకొంచెం సేపు ఆయన గడిపితే బాగుంటుందని నాకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది. బహుశా, జగన్‌కు కూడా అనిపిస్తూ ఉంటుందని అనుకుంటా.
 
పిల్లలు ఎవరితో క్లోజ్‌గా ఉంటారు? మీతోనా? జగన్‌గారితోనా?
భారతి: ఇద్దరితోనూ బాగా ఉంటారు. ఎందుకంటే, బెంగుళూరులో మేము నలుగురమే ఉండేవాళ్ళం. పెద్దగా బంధువులు, ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. కాబట్టి, మేము నలుగురం ఎంతో ఎటాచ్డ్, వెరీ క్లోజ్!
 
అలాంటి లైఫ్‌లో ఒక్కసారిగా పెద్ద కుదుపు వచ్చింది కదా...
భారతి: అవును! మామ చనిపోతారు... మా లైఫ్ ఇలా ఒక్కసారిగా మారిపోతుందని ఊహించలేదు. మొన్న పులివెందులకు ఎన్నికల ప్రచారానికి వస్తూ వెళ్తున్నప్పుడు నేను అదే అనుకుంటూ ఉన్నా... అయిదేళ్ళ క్రితం ఇదే మే నెలలో మామ ఉన్నారు. జీవితం పూర్తిగా వేరేగా ఉండింది. ఇలా ఉంటుందని ఊహించడానికి కూడా అందనంతగా అయిదేళ్ళ తరువాత జీవితం మారిపోయింది. (కొద్దిగా వేదాంత ధోరణిలో...) అంతే! దేవుడు కొన్ని చేస్తూ ఉంటాడు. మనం ఏం చేయగలం! మనం పరిగెత్తి అయినా సరే, ఆ జీవితంతో పాటు ముందుకు వెళుతూ ఉండాలి.
 
ఎప్పుడైనా ఇవన్నీ వదిలేసి, ఆ పాత లైఫ్ ఉంటే బాగుండునని మీకు అనిపించిందా?
భారతి: జగన్ జైలులో ఉన్నప్పుడు మాత్రం అనిపించింది.  ‘జగన్ బయటకు వస్తే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి... మళ్ళీ ఇంత బాధ తట్టుకోలేను’ అనిపించింది. ఎందుకంటే, ‘ఇక్కడ వాళ్ళకు నీతి లేదు, న్యాయం లేదు. రాజకీయాల్లో ఉంటే, వాళ్ళు ఈ కుట్రలు అవీ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇలాంటి బాధలు పెడితే, నేను తట్టుకోలేను. ఇక్కడే ఉంటే బాధలు పడాల్సి వస్తుంది. వెళ్ళిపోవాలి’ అనుకుంటూ ఉన్నా. జగన్ బయటకు వచ్చిన తరువాత చెప్పా... ‘ఎక్కడికైనా వెళ్ళిపోతా జగన్... నేను మళ్ళీ ఈ బాధలు పడలేను’ అన్నా. ‘ఎక్కడికి వెళతావ్... ఎక్కడికీ వెళ్ళలేవు... ఉండు..’ అన్నాడు నవ్వుతూ...!
 
జగన్‌గారు జైలులోకి వెళతారని కానీ, జీవితం ఇలా మారిపోతుందని కానీ ఊహించలేదు. మరి, అలా జైలుకు వెళ్ళినప్పుడు జగన్‌గారిలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి? ఆయన మైండ్‌సెట్ ఎలా ఉండేది?
 భారతి: జగన్‌ది చాలా పాజిటివ్ మైండ్‌సెట్. ‘ఇది ఇలా జరిగిందే.. ఎలా?’ అని ఎప్పుడూ అనుకోడు. ‘ఇది ఇలా జరిగింది. మనం ఇప్పుడు దీనిలో ఎలా ఉండాలి’ అని అనుకుంటాడనుకుంటా! రాష్ట్రంలోని ఈ 294 అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటిలోని మండలాలు, పంచాయతీలు - అన్నీ ఇప్పుడు ఆయనకు అక్షరాలా నోటికి వచ్చు. వాటన్నిటి గురించి ఆయన చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ప్రతి జిల్లా, దాని వనరులు - అన్నీ ఆయన చాలా వివరంగా చదివాడు. అలా... ఒకటి అయిపోయిన తరువాత మరొకదానితో మైండ్ ఎలా ఆక్యుపై చేసుకోవాలో చూస్తాడు. అన్నింటి గురించి సమాచారం, వివరాలు కనుక్కొనేవాడు. నదుల గురించి తెలుసుకొనేవాడు. తరువాత డ్యామ్‌ల నిర్మాణం ఎక్కడెక్కడ ఏయే దశల్లో ఉంది, మనం ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కడితే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలం లాంటివన్నీ - ఇవన్నీ కూడా ఆయన సవివరంగా స్టడీ చేశాడు.
 
ఇప్పుడు జగన్‌గారిని చూస్తే, ఎంతటి స్ట్రగుల్‌నైనా ఎదుర్కొనే వ్యక్తిగా కనపడుతున్నారు. గతంలో రోజూ 16 నుంచి 18 గంటల పాటు ఓదార్పు యాత్ర చేసేవారు. శ్రమ అనుకోకుండా ఇప్పుడు కూడా నిర్విరామంగా తిరుగుతూనే ఉన్నారు. అంతటి స్ట్రెంత్ ఆయనకు ఎక్కడ నుంచి వస్తోంది? ఇంతకు ముందు కూడా అలానే ఉండేవారా?
 భారతి: వాళ్ళమ్మ పెంచిన తీరు అలాంటిది. జగన్ వాళ్ళు పుట్టుకతోనే ఉన్నవాళ్ళు. వెండిపళ్ళెంతో పుట్టారంటారు కదా... అలా! అందుకే, చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి, పెరగాల్సిన అవసరం రాలేదు ఆయనకు. ఏ కష్టాలూ పడలేదు. వాళ్ళ నాయన చనిపోయేంత వరకు కూడా ఆయనకు కష్టపడాల్సి రాలేదు. వాళ్ళ నాయన చనిపోయిన తరువాత ఇన్ని కష్టాలు పడి, వెనక్కి తిరగకుండా ఇలా ఉండడమనేది ఆశ్చర్యమే. ఆ ధైర్యం, నిబ్బరం ఆ దేవుడే ఇచ్చాడని అనుకుంటూ ఉంటా. మా మామ ఆత్మ జగన్‌లోకి వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. మా మామగారి లాగే ఇప్పుడు జగన్ కూడా అంత పెద్ద మనసుతో ఆలోచిస్తాడు. అందరినీ కన్సిడర్ చేయాలి అనుకుంటాడు. ఎవరి మీద కూడా అనవసరంగా కోపం కానీ, ద్వేషం కానీ పెట్టుకోడు. అలాగే, అనవసరంగా ఎవరి గురించైనా మాటలు మాట్లాడడం లాంటివి చేయడు. మా గురించి ఇన్ని పత్రికల్లో, టీవీల్లో ఏవేవో రాస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు కదా! మాకైనా కోపం వస్తుంటుందేమో కానీ, జగన్‌కు మాత్రం పెద్దగా కోపం కూడా రాదు. ‘వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారులే’ అన్నట్లుగా ఉంటాడు. చాలా పెద్ద మనసు. చాలా పెద్ద దృక్పథం. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు మాకెంత కష్టం అనిపించిందో, అలా జగన్‌కు వాళ్ళ నాయన పోయినప్పుడు చాలా కష్టమనిపించిందనుకుంటా. ఎవరమైనా కష్టాలు పడిన తరువాత పరిణతి చెందుతాం... కొద్దిగా పెద్దవాళ్ళమవుతాం. కష్టాలు మనకెన్నో విషయాలు నేర్పిస్తాయి. వాళ్ళ నాయన చనిపోయిన తరువాత జగన్ కూడా చాలా నేర్చుకున్నాడనుకుంటా.
 
రాజశేఖరరెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు... ఆయన వల్ల లబ్ధి పొందినవాళ్ళు... కూడా ఆయన చనిపోయిన తరువాత మారిపోయారు. వారి మాట తీరులో, ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. జగన్‌గారి మీద ఆరోపణలు చేయడం కూడా చూశాం. అలాంటి వాళ్ళను మీరు చాలా దగ్గర నుంచి కూడా చూసి ఉంటారు. మీరు మనవాళ్ళనుకున్నవాళ్ళు కూడా అలా బిహేవ్ చేయడం చూసినప్పుడు మీకు ఏమనిపించింది?
 భారతి: మామ చనిపోయింది 2009 సెప్టెంబర్‌లో. ఆ తరువాత 2010 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నుంచి జగన్‌కు బయటకు వచ్చారు. మహా అయితే 2010 నుంచి 2014 వరకు - ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ వాళ్ళు జగన్ గురించి ఎన్నో మాటలు మాట్లాడారు.... మామ గురించీ చాలా మాట్లాడారు. వాళ్ళు అలా మాట్లాడినవన్నీ చూసినప్పుడు, జీవితం చాలా పెద్దది కదా... వీళ్ళు కేవలం రెండు మూడేళ్ళ లాభం కోసం ఇంతగా ఎందుకు దిగజారుతున్నారు? ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని నాకు ఎప్పుడూ అనిపించేది. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మమ్మల్ని అన్నేసి మాటలు మాట్లాడినవాళ్ళను కాంగ్రెస్ అధిష్ఠానమే పూర్తిగా ముంచేసింది కదా! రెండేళ్ళు మూడేళ్ళు పదవిలో ఉండడం కోసం, ఓ రెండేళ్ళు మూడేళ్ళు వాళ్ళకు వాళ్ళు సర్దిచెప్పుకోవడం కోసం.... ఎందుకని రాష్ట్రాన్ని విభజించారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదని అని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఎందుకింత చీప్‌గా తయారయ్యారు. పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కానీ, కొంతమంది మామకు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు.  వాళ్ళ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. వాళ్ళను చూసి చాలా బాగా అనుకుండేదాన్ని. కానీ, వాళ్ళు ఎంతో నీచానికి దిగజారారు. తాము మాట్లాడే మాటలు అబద్ధాలని వాళ్ళకు తెలుసు. అయినా సరే, వాళ్ళు అలా లేనిపోనివి మాట్లాడుతున్నారంటే, వాళ్ళు చాలా పడిపోయారన్నమాట. వాళ్ళు ఎందుకిలా చేస్తున్నారా అని అనుకొన్నాను.
 
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, అది మంచిది కాదు.. పార్టీలోనే కొనసాగమని జగన్‌గారికి సలహా ఇచ్చారు. అలాగే, కొత్త పార్టీ పెడుతున్నప్పుడు ఒక సందిగ్ధత ఉంటుంది. అలాంటి సమయంలో మీ పాత్ర ఎలా ఉండింది?
భారతి: నేను పెద్ద ఏమీ చెప్పలేదు. అందరూ చెబుతూ వచ్చారు. ఓదార్పు యాత్ర చేయవద్దని చాలామంది జగన్‌కు సలహా ఇచ్చారు.  ఆ రోజంతా ఇంటికి జనం వస్తూనే ఉన్నారు. బంధువులు వచ్చారు... అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నాం కదా... ఎమ్మెల్యేలు వచ్చారు. శ్రేయోభిలాషులు వచ్చారు. అందరూ వచ్చి, చెబుతూనే ఉన్నారు. అందరూ వెళ్ళిపోయిన తరువాత జగన్‌ను అడిగాను... ‘ఫైనల్‌గా ఏం చేద్దామనుకుంటున్నావ్... జగన్’ అని. అంతే... నేను చెయ్యమని కానీ, చెయ్యద్దని కానీ ఏమీ చెప్పలేదు. అప్పుడు జగన్ ఓ మాట అన్నాడు - ‘ఓదార్పు యాత్రకు పోకుంటే, నేను పైకి పోయిన ఆయనకు (వై.ఎస్. రాజశేఖరరెడ్డికి) ఏం సమాధానం చెప్పాలి’ అని! ‘వీళ్ళందరూ ఏమని చెబుతున్నారు - ఇది చేస్తే దీనివల్ల మనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదంటున్నారు... అంతేకదా! ఇవాళ జగన్మోహన రెడ్డి ఎవరూ అంటే... రాజశేఖరరెడ్డి కొడుకు. ఆయన కోసం నిలబడడానికి నేను భయపడడం కరెక్ట్ కాదు. పైకి పోయిన ఆయనకు నేను సమాధానం చెప్పుకోవాలి. నేను ఓదార్పు యాత్రకు పోతున్నా’ అని చెప్పాడు. అది సరైన సమాధానమని నాకు అనిపించింది. అంత గుండె లోతుల్లో నుంచి ఒక పని చేయాలని ఒక మనిషికి అనిపిస్తున్నప్పుడు మనం వద్దనడం కరెక్ట్ కాదని అనిపించింది.
 
జగన్ గారు ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు మీతో సంప్రతిస్తూ ఉంటారా?
భారతి: మామ ఉన్నప్పుడు ఎలా చేస్తే మేలు అని ఆయనతో చర్చిస్తుండేవాడు. మామ చనిపోయిన తరువాత... ఇప్పటికీ జగన్ అందరూ చెప్పేటివీ వింటాడు.  పార్టీలో కొందరు కీలక వ్యక్తులతో ఏం చేయాలనేది చర్చిస్తాడు. అందరూ చెప్పినదాన్ని ఆధారంగా చేసుకొని, తను ఒక తుది నిర్ణయానికి వస్తాడు.
 
జగన్ గారిలో మీకు బాగా నచ్చే అంశం ఏమిటి?
భారతి: చాలా నిజాయతీగా ఉంటాడు. చాలా చాలా హానెస్ట్‌గా ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ... మనం చేసిన వంట బాగా లేకపోతే... అది బాగుందని కూడా అబద్ధం చెప్పలేడు. లేనిది ఉన్నట్టు అస్సలు చెప్పలేనే చెప్పలేడు. చాలా నిజాయతీగా ఉంటాడు. జగన్ ఒక మాట అన్నాడూ, చెప్పాడూ అంటే... అది ఆయన పూర్తిగా నమ్మి, నిజాయతీగా చెబుతున్నాడనే! నాకు తెలిసి చాలామంది ఆడవాళ్ళకు.... భర్త నిజం చెబుతున్నాడా, లేదా అని డౌట్లు రావచ్చు. కానీ, నాకెప్పుడూ ఆ డౌట్ రాలేదు... రాదు... జగన్ ఉన్నది ఉన్నట్టు చెబుతాడు. జగన్ చెప్పాడూ అంటే, అది అక్షరాలా నిజమే!
 
జగన్‌గారిలో మీకు నచ్చని అంశం?
భారతి: (సాలోచనగా...) నచ్చని అంశం అంటూ పెద్దగా ఏదీ లేదు అనుకుంటా!
 
వై.ఎస్. చనిపోయిన తరువాత ఒకదాని తరువాత ఒకటిగా ఎదురైన అవరోధాలు కావచ్చు, వచ్చిన ఒత్తిళ్ళు కావచ్చు... వాటన్నిటినీ జగన్‌గారు మీతో పంచుకుంటారా?
భారతి: జగన్ వాస్తవానికి తన మనసులో ఉండే బాధ ఎప్పుడూ పెద్దగా బయటకు చెప్పుకోడు. జగన్ అసలు వెరీ వెరీ ఫోకస్డ్. తనకు సంబంధం లేని విషయాలలో అస్సలు జోక్యం చేసుకోడు. ప్రతి దాని గురించి వ్యాఖ్యానించాలని కానీ, ప్రతి విషయంలో తల దూర్చాలని కానీ అనుకోడు. కానీ, తాను ఏ పని చేసినా ఎంతో అంకితభావంతో చేస్తాడు. అంటే, ఇక దానిలో నూటికి నూరు శాతం కాకుండా, నూటికి రెండు వందల శాతం తనకు తాను లీనమై చేస్తాడు. ఒక ‘సాక్షి’ పెట్టడం కానివ్వండి... ఓదార్పు యాత్ర చేయడం కానివ్వండి... కాంగ్రెస్‌తో పోరాటం కానివ్వండి... అంతే. చేశాడు. జైలుకి వెళ్ళి, పదహారు నెలలు ఉన్నా కూడా తల వంచకుండా వచ్చాడు. ఏదైనా పని చేపడితే, దాన్ని మనం మనస్ఫూర్తిగా చేయాలి. ఆ తరువాత దేవుడు ఎలా రాసిపెడితే, అలా జరుగుతుంది అనే మనస్తత్వం జగన్‌ది. అంతేకాకుండా, ఏదైనా దాచిపెట్టి చేయడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ జగన్‌కు చేతకాదు. వీటన్నిటి నేపథ్యంలో - దేవుడి ఆశీస్సులు ఉంటే, ఇప్పుడు మనకున్న నాయకులందరిలోకీ జగన్ అత్యుత్తమ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకుంటున్నా. దేవుడు ఆశీర్వదించాలి... మంచిగా వర్షాలు రావాలి... మన ఆర్థిక వ్యవస్థ బాగుండాలి... ఆ దేవుని దయ వల్ల జగన్ బెస్ట్ సి.ఎం. అవుతాడని ఆశిస్తున్నాను.
 
వై.ఎస్. రాజశేఖరరెడ్డి రైతుపక్షపాతి అనే పేరుండేది. మరి, జగన్‌గారికి రాష్ట్ర పరిపాలనలో ఎవరి సంక్షేమానికి సంబంధించి ఎక్కువ ఆసక్తి ఉందని మీరు అనుకుంటున్నారు?
భారతి: ఎక్కువగా మహిళల సంక్షేమం గురించి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే, ఇప్పుడు జగన్ అమలు చేస్తానంటున్న పథకాలన్నీ ఆలోచించి చూడండి. చాలా మంది బీదవాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళాడు. వాళ్ళ మాటలు విన్నాడు. కష్టాలన్నీ స్వయంగా చూశాడు. బీదవాళ్ళకు ఎక్కువగా ఇబ్బందులు వచ్చేది చదువుల దగ్గర... ఆరోగ్యం బాగా లేనప్పుడు, పిల్లల విషయంలో! దానికితోడు, భర్తలు తాగుబోతులైతే మహిళలకు మరిన్ని కష్టాలుంటాయని ఎక్కువ శాతం మాతో అంటూ ఉంటాడు. అందుకే, జగన్ ఎక్కువగా మహిళల సంక్షేమం, తల్లుల గురించి ఆలోచిస్తూ ఉంటాడని నాకు అనిపిస్తూ ఉంటుంది. గమనిస్తే, జగన్ పథకాలన్నీ కూడా ఏదో ఒక రకంగా ఆడపడుచుల బాగు కోరేవిగా, వాళ్ళ జీవితాలను మెరుగుపరిచేవిగా ఉంటాయి.
 
ఓదార్పు యాత్రలో వెళ్ళిన తరువాత బహుశా జగన్‌గారి ఆలోచనల్లో మార్పు వచ్చిందేమో...
భారతి: ఊ... ఊ... బహుశా వాళ్ళ బాధలన్నీ వినడం వల్లే ఆయన ఆ మార్గం ఎంచుకున్నారనుకుంటా. అంతేకాదు... రైతుల గురించి కూడా జగన్ చాలా ఆలోచిస్తాడు. మా మామ ఎప్పుడూ రైతు సంక్షేమం గురించే మాట్లాడేవారు... చెప్పేవారు. అది మా మామ నుంచి ఆయనకు కూడా వచ్చింది. దానితో పాటు మహిళల సంక్షేమం గురించి జగన్ అదనంగా ఆలోచిస్తాడు. ఆడవాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయని జగన్ ఆలోచన అనుకుంటా!
 
ఈ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే...
భారతి: (మధ్యలోనే అందుకుంటూ... నవ్వుతూ...) వస్తాయి..!
 
(నవ్వుతూ...) ఫలితాలు అనుకూలం వచ్చి, జగన్ ముఖ్యమంత్రి అవుతారు. తండ్రీ కొడుకులిద్దరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం రాష్ట్రంలో ఓ రికార్డు అవుతుంది!
భారతి: ఆ రికార్డే కాకుండా... తండ్రీ కొడుకులిద్దరూ అత్యుత్తమ ముఖ్యమంత్రులుగా ఉండాలనీ, తరువాతెప్పుడో వచ్చిన తరాలు కూడా ‘ఒక నాయన... కొడుకు ఉండేవారు. వాళ్ళు చాలా బాగా చేశారు. ప్రజలకు అండగా నిలబడ్డారు. ప్రజలకు బాగా సహాయపడ్డారు’ అని అనిపించుకొనేలాగా ప్రజలకు సేవ చేయాలన్నది జగన్ ఆలోచన!

 ******************

కష్టాలు ఎదురవుతాయని తెలిసినా తండ్రికోసం, ప్రజలకిచ్చిన మాటకోసం జగన్ ఓదార్పుకోసం వెళ్తానన్నప్పుడు... గుండె లోతుల్లోంచి ఒక పని చేయాలని ఒక మనిషికి అనిపిస్తున్నప్పుడు మనం వద్దనడం కరెక్ట్ కాదని అనిపించింది.
     
జగన్ జైలులో ఉన్నప్పుడు అనిపించింది - ఇక్కడ వాళ్ళకు నీతి లేదు, న్యాయం లేదు. రాజకీయాల్లో ఉంటే, వాళ్ళు ఈ కుట్రలు అవీ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇలాంటి బాధలు పెడితే, నేను తట్టుకోలేను. ఇక్కడే ఉంటే బాధలు పడాల్సి వస్తుంది. వెళ్ళిపోవాలి - అని! అదే మాట జగన్‌కు చెపితే  ‘ఎక్కడికి వెళతావ్... ఎక్కడికీ వెళ్ళలేవు... ఉండు..’ అన్నాడు నవ్వుతూ...!

  ******************

జగన్ చాలా నిజాయితీగా ఉంటాడు. ఎంతంటే... మనం చేసిన వంట బాగాలేకపోతే, బాగుందని కూడా అబద్ధం చెప్పలేడు.
     
 జగన్ ఒక మాట అన్నాడు, చెప్పాడంటే అది ఆయన పూర్తిగా నమ్మి నిజాయితీగా చెప్తున్నాడనే అర్థం.
     
 జగన్‌లోని అంకితభావం, కష్టపడే తత్వం, పట్టుదల, చేసే పనిపై చిత్తశుద్ధి కూడా నాకు చాలా నచ్చుతాయి.
     
 అన్నిటికీమించి జగన్ చాలా ఫోకస్డ్. ఏ పని అయినా అంకితభావంతో చేస్తాడు. అది సాక్షి పెట్టడం కానివ్వండి... కాంగ్రెస్‌తో పోరాటం కానివ్వండి... ఓదార్పుయాత్ర కానివ్వండి...
     
 ఏదైనా పని చేపడితే మనస్ఫూర్తిగా చేయాలని, ఆ తర్వాత దేవుడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుందనే మనస్తత్వం జగన్‌ది.
 
Share this article :

0 comments: