ఆరో రోజుకు చేరిన జగన్ నిరవధిక దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరో రోజుకు చేరిన జగన్ నిరవధిక దీక్ష

ఆరో రోజుకు చేరిన జగన్ నిరవధిక దీక్ష

Written By news on Monday, October 12, 2015 | 10/12/2015

 రోజుకు చేరిన జగన్ నిరవధిక దీక్ష
♦ తగ్గిన షుగర్, బీపీ, పల్స్‌రేటు.. బాగా నీరసించిన ప్రతిపక్ష నేత
♦ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయని సర్కారు
♦ అనుకూల మీడియా ద్వారా కుట్ర పూరిత ప్రచారం
 
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. జగన్ నిరాహారదీక్షకు పూనుకుని నేటికి (సోమవారం) ఆరు రోజులవుతోంది. దీంతో షుగర్ లెవల్ తగ్గింది. బీపీ, పల్స్‌రేటు పడిపోయాయి. బరువు కూడా తగ్గారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోగా, జగన్ షుగర్ లెవల్స్ పెరిగాయంటూ అనుకూల మీడియా ద్వారా ప్రచారానికి తెరలేపింది.

ఆ వార్తల ఆధారంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు జగన్ దీక్షపై అనుమానాలున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం షుగర్ లెవల్స్ 59 ఉండగా, మధ్యాహ్నానికి 83కు చేరాయని చెప్పారు. ఆహారం లేదా ఇన్సులిన్ తీసుకుని ఉంటారం టూ హేళనగా మాట్లాడారు. మంత్రుల దుర్మార్గపూరితమైన వ్యాఖ్యలను కొన్ని చానెళ్లు అదేపనిగా ప్రచారం చేశాయి. ప్రత్యేక హోదా సాధనకోసం ప్రతిపక్ష నేత ఆరు రోజులుగా ఆహారం మాని దీక్ష చేస్తూంటే స్పందించి పరిష్కారానికి పూనుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోకపోగా... తప్పుడు ప్రచారానికి తెరలేపడం, మంత్రులు చులకన పూరితంగా మాట్లాడటంపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

హెల్త్ బులెటిన్ విషయమై గుంటూరు ప్రభుత్వాసుపత్రి అధికారులను నిలదీశారు. గత నాలుగు రోజులుగా జగన్ ఆరోగ్య పరీక్షల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అయితే గత నాలుగు రోజుల వివరాలు లేవని అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేశారు. మరి అలాంటపుడు ఆరోగ్య మంత్రి వద్ద గత నాలుగు రోజుల వైద్య పరీక్షల వివరాలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీయగా... తమకు తెలియదని వైద్యాధికారులు సమాధానమిచ్చారు. తాము రక్తం సేకరించిన రెండు గంటల తర్వాత పరీక్షలు నిర్వహించడం వల్లే హెచ్చుతగ్గులు వచ్చాయని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్ స్పష్టంచేశారు.

తాము తీసుకెళ్లిన గ్లూకో మీటర్‌తో పరీక్షించినప్పుడు 88 చూపించగా, పక్కనే ఉన్న కొత్త గ్లూకోమీటరుతో పరీక్షించినప్పుడు 77గా చూపించిందని అసిస్టెంట్ ఆర్‌ఎంఓ డాక్టర్ రమేష్ అంగీకరించారు. గ్లూకోమీటర్‌వల్ల షుగర్‌లో వచ్చిన తేడాకు దీక్షలో తప్పు జరిగిందనుకోవడం సరికాదన్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై మంత్రుల వ్యాఖ్యలు, సర్కారు నాటకాలపై జగన్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మీడియా సమక్షంలో శాంపిల్స్ తీసుకుని పరీక్షించాలని సవాలు చేశారు.

రాష్ట్ర ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ, యువత బంగారు భవిష్యత్తు కోసం దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్‌లు విడుదల చేయకపోగా, అసత్య ప్రచారాలకు పాల్పడటంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా దీక్షకు జనం నుంచి వెల్లువెత్తిన మద్దతును చూసి భయపడిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు వైద్యులను అడ్డం పెట్టుకుని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 హోదా వచ్చే వరకూ దీక్ష ఆపేది లేదు
 రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ తాను చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాగా పట్టుదలతో ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు వెల్లడించారు. నిరాహారదీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలంతా దీక్షా వేదిక సమీపంలో అత్యవసరంగా సమావేశమై జగన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎలా ఉధృతం చేయాలన్న అంశంపై చర్చలు జరిపారు.

సమావేశానంతరం పార్టీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధి కోసం, విద్యార్థుల, యువకుల భవిష్యత్తు కోసం తాను దీక్షను కొనసాగించాలనే గట్టి పట్టుదలతో జగన్ ఉన్నారని చెప్పారు. కానీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటం పట్ల తామంతా ఆందోళనతో ఉన్నామని తెలిపారు. ఇది తమ వ్యక్తిగత సమస్య ఏమీ కాదని, కోట్లాది మంది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశమని, అందుకోసం తమ నాయకుడు ప్రాణాలను సైతం పణంగా పెట్టి దీక్ష చేస్తున్నారని వివరించారు. వైద్య పరీక్షల్లో ‘కీటోన్స్ పాజిటివ్’ అని వచ్చినట్లుగా గత రాత్రి వైద్యులు నిర్ధారించారని, క్రమంగా బరువు తగ్గుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

తాము వారించే యత్నం చేస్తున్నా ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే నాకు ముఖ్యం... నా ప్రాణాలు నాకు ముఖ్యం కాదు’ అని జగన్ చెబుతున్నారని బొత్స పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో వెల్లువెత్తి ప్రజల ఆకాంక్షను చూసి ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని తాము ఆశిస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక హోదా ఒక్కటే రాష్ట్రాభివృద్ధికి సంజీవని అని గట్టిగా భావిస్తున్నందున, ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా సమస్యకోసం, ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు జగన్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజాగ్రహానికి గురవుతారని బొత్స హెచ్చరించారు.
 
 బాగా నీరసించిన జగన్
 ఐదు రోజులుగా ఏమీ తీసుకోక పోవడంవల్ల బాగా నీరసించడంతో దీక్షా వేదికపై జగన్ ఎక్కువసేపు కూర్చోలేక అక్కడే పడుకున్నారు. అయితే తనకు మద్దతు ప్రకటించడానికి తండోపతండాలుగా వస్తున్న జనాన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేక ఆయన అపుడపుడూ లేచి కూర్చు ని వారికి అభివాదం చేస్తూ ఉన్నారు. జగన్ సతీమణి వైఎస్ భారతి, ఆమె తండ్రి డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డితో కలిసి దీక్షా శిబిరానికి వచ్చారు. జగన్ పరిస్థితిని చూసిన పార్టీ నేతలు అత్యవసరం గా సమావేశమై ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని నిర్ణయించారు.

ప్రతిపక్ష నేత చేస్తున్న దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని తెలియడంతో ఆయనను సందర్శించడానికి జనం కూడా నలు మూలల నుంచి పోటెత్తారు. దీక్షకు వచ్చే జనాన్ని రానీయకుండా పలు చోట్ల పోలీసులు అడ్డుకున్ననప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం సెలవుదినం కావడంవల్ల గుంటూరు పరిసరాల నుంచి విద్యార్థినీ విద్యార్థులు వెల్లువలా వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు.  

  గ్లూకో మీటర్‌లో  తేడా ఉన్న మాట వాస్తవమే
 అసిస్టెంట్ ఆర్‌ఎంఓ డాక్టర్ రమేశ్
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆదివారం రాత్రి పరీక్షలు నిర్వహించాం. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి  తీసుకెళ్ళిన గ్లూకో మీటర్‌తో షుగర్ పరీక్ష నిర్వహించగా 88 చూపించింది. పక్కనే ఉన్న మరో కొత్త గ్లూకో మీటర్‌తో పరీక్ష చేస్తే 77గా చూపించింది. మేము తీసుకెళ్ళిన గ్లూకోమీటర్‌లో తేడాలు ఉన్నాయి. దీని వల్లే గందరగోళమంతా జరిగింది. మంత్రులు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ను కలిసి రిపోర్టు ఇచ్చి ఉంటారని అనుకుంటున్నా. ప్రతిరోజూ జగన్ హెల్త్ బులిటెన్ రిలీజ్‌చేయాల్సి ఉండగా, ఎందుకు రిలీజ్ చేయ డం లేదో నాకు తెలియదు. గ్లూకో మీటర్ వల్ల షుగర్‌లో వచ్చిన తేడాకు దీక్షలో తప్పు జరిగిందనుకోవడం సరికాదు
Share this article :

0 comments: