రాజధాని శంకుస్థాపనకు నాకు ఆహ్వానం వద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధాని శంకుస్థాపనకు నాకు ఆహ్వానం వద్దు

రాజధాని శంకుస్థాపనకు నాకు ఆహ్వానం వద్దు

Written By news on Thursday, October 15, 2015 | 10/15/2015


రాజధాని శంకుస్థాపనకు నాకు ఆహ్వానం వద్దు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కోసం తనకు ఎలాంటి ఆహ్వానం పంపొద్దని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆహ్వానం పంపినా హాజరు కాలేదని తర్వాత తనపై బండ విసరొద్దని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈమేరకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. మీరు, మీ ఆదేశాల మేరకు మీ అరడజను మంది మంత్రులు చేయబోయేది ఇదేనని ఈపాటికే తనకు, ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కార్యక్రమానికి రాకపోవడానికి కారణాలను కూడా జగన్ సవివరంగా ఈ లేఖలో తెలిపారు. అవి ఇలా ఉన్నాయి... (లేఖ పూర్తి పాఠం ఇక్కడ చూడండి)

1) ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మీ అధికారాన్ని ఉపయోగించి రైతుల భూములు లాక్కొని, వారి ఉసురు మీద మీరు రాజధాని కడుతున్నారు. మూడు పంటలు పండే మాగాణి భూములను పూలింగ్ పేరిట రైతుల మెడమీద కత్తిపెట్టి లాక్కున్న మీ వైఖరికి వ్యతిరేకంగా ఇప్పటికే మేం పలు సందర్భాల్లో దీక్షలు చేసినా, నిరసనలు తెలిపినా మీ తీరు మారలేదు. అందుకే రాదలచుకోలేదు.

2) రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30, సెక్షన్ 144ని ఎందుకు అమలుచేస్తున్నారు? ప్రజలు ఆనందంతో ఉంటే మరి ఎందుకు ఈ సెక్షన్లు అమలులో ఉన్నాయి? అక్కడ ఈ నిషేధ సెక్షన్లు గత సంవత్సర కాలంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు?

3) గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును బేఖాతరు చేస్తూ కోర్టును, ప్రజల మనోభావాలను రెండింటినీ లెక్క చేయని మీ వైఖరికి నిరసనగా రాదలచుకోలేదు.

4) అసైన్డ్ భూములు, పేదల భూములు అంటే చులకన స్వభావంతో అవి మీ అత్తగారి సొత్తు అన్నట్లు, మీ ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకునే మీ మనస్తత్వానికి నిరసనగా రాదలుచుకోలేదు.

5) మీ కమీషన్ల కోసం, మీ లంచాల కోసం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజల కడుపు కొడుతున్నారు. మీకు నచ్చిన ప్రైవేటు, విదేశీ సింగపూర్ కంపెనీలకు మీ ఇష్టం వచ్చినట్లు భూములు ఇస్తున్న మీ వైఖరికి నిరసనగా, మీరు చేస్తున్న ఈ స్కాంలో మీకు మద్దతు తెలపకూడదన్న భావనతో రాదలచుకోలేదు.

6) కేంద్రం రూ. 1850 కోట్లు రాజధాని కోసం డబ్బులు ఇచ్చింది. రింగ్ రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ఇంకా చేస్తామని కూడా చెబుతోంది. ఈ డబ్బును ఖర్చుచేసి బిల్లులు పెట్టండి ఇంకా ఇస్తాం.. మీ అవసరం మేరకు అంటోంది. విభజన చట్టం ప్రకారం మనకు ఇవ్వాల్సినవన్నీ నెరవేరుస్తాం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు రాజధాని నిర్మాణానికి ప్రైవేటు సింగపూర్ కంపెనీలతో లేక ప్రైవేటు విదేశీ కంపెనీలతో ఏం పని? రాజధానిలో ఉండాల్సిన హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సింది అక్కడే ఉన్న ప్రభుత్వ భూముల్లో కట్టుకొని, రోడ్లు వేసి, జోనింగ్ చేసి ప్రజలు రియల్ ఎస్టేట్ చేసుకుంటారో, లేక వారి భూములు వారే అట్టిపెట్టుకుంటారో ప్రజల ఇష్టానికి వదిలేయకుండా బలవంతంగా మీ సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేద ప్రజల భూమును లాక్కోవడానికి నిరసనగా.. మేం రాదలచుకోలేదు.

7) మీ వాళ్లను బినామీలుగా పెట్టుకొని రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలు కొనుగోలు చేయించి, వారి భూములు వదిలేసి పేదల భూములు మాత్రం ఇష్టం లేకపోయినా లాక్కొన్న మీ వైఖరికి నిరసనగా మేం రాదలచుకోలేదు.

8) ప్రజల డబ్బును దుబారా చేస్తూ మీరు ఒక్కరోజు తతంగాన్ని జరిపేందుకు ప్రజల డబ్బు దాదాపు రూ. 400 కోట్లు బూడిదపాలు చేస్తున్న మీ తీరుకు నిరసనగా రాదలచుకోలేదు.

చివరిగా ఒక్కమాట.. రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. మీరు శంకుస్థాపన చేస్తున్నది ప్రజల రాజధానికి కాదు. పేద ప్రజల రాజధానికి అసలే కాదు. ఇది మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లక్షల కోట్ల అక్రమ సంపాదనకు, విదేశాలకు విదేశీ కంపెనీల ద్వారా లక్షల కోట్లు తరలించడానికి, రైతుల కడుపు కొట్టడానికి మీరు చేస్తున్న శంకుస్థాపన. కాబట్టే ప్రజలందరి తరఫునా ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాం.
Share this article :

0 comments: