వందల కోట్లు ‘మట్టి’పాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వందల కోట్లు ‘మట్టి’పాలు

వందల కోట్లు ‘మట్టి’పాలు

Written By news on Friday, October 16, 2015 | 10/16/2015


వందల కోట్లు ‘మట్టి’పాలు
♦ రాజధాని శంకుస్థాపన పేరిట సర్కారు ఆర్భాటం
♦ మంచినీళ్లలా ఖర్చు  
♦ దేశ, విదేశీ ప్రముఖులకు అతిథి సత్కారాలు..
♦ 20 ప్రత్యేక విమానాలు, 15 ప్రత్యేక హెలికాప్టర్లు అద్దెకు
♦ ఫోర్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లలో 2,300 గదులు...
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి శంకుస్థాపన హంగుల కోసం ప్రభుత్వం రూ.కోట్లలో ఖర్చు చేస్తోంది.ప్రచార యావతో దుబారా, దుర్వినియోగానికి సిద్ధపడుతోంది.

ప్రజా సమస్యలతో ముడిపడి ఉన్న అనేక పనులకు సంబంధించిన రూ.3 వేల కోట్ల మేర బిల్లులను నిలిపి మరీ శంకుస్థాపనకు నిధులను వెచ్చిస్తోంది.ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లిన విషయాన్ని మరిచి అతిథుల పేరిట ఆర్భాటం చేస్తోంది.నిధులు ఖర్చుచేస్తున్న తీరుపై  విస్మయం వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు గొప్పలకు పోతున్న వైనంపైనా విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అయినవారు అందినకాడికి దండుకుంటున్న తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
అద్దెకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లు
ప్రధాని నరేంద్రమోదీ సహా 65 మంది కేంద్రమంత్రులు, సింగపూర్, జపాన్‌లకు చెందిన మంత్రులు, ఆ దేశాలకు చెందిన కార్పొరేట్ యజమానులు, ప్రతినిధి బృందాలు, 29 రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, 543 మంది లోక్‌సభ, 244 మంది రాజ్యసభ సభ్యులు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు సహా 1,500 మంది వీవీఐపీలకు ఆహ్వానాలు అందించారు. వీరితోపాటూ వివిధ రంగాలకు చెందిన వందలాది ప్రముఖులను, వివిధ దేశాలకు చెందిన 149 మంది దౌత్యవేత్తలనూ ఆహ్వానించారు. మొత్తంగా 21 వేలకుపైగా వీఐపీ ఆహ్వాన పత్రికలను ముద్రించారు.

వీటి ముద్రణకే రూ.కోట్లు వెచ్చించారంటూ ఓ ఉన్నతాధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడానికి 20 ప్రత్యేక విమానాలు.. గన్నవరం, శంషాబాద్ విమానాశ్రయాల నుంచి శంకుస్థాపన ప్రాంతానికి చేర్చేందుకు 15 ప్రత్యేక హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు.

ఒక్కో విమానానికి రోజుకు రూ.7.50 కోట్లు, హెలికాప్టర్ల కోసం రూ.4 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు.(హెలికాప్టర్లు గంటల ప్రాతిపదికన అద్దె.. ఫ్లయింగ్, వెయిటింగ్ చార్జీలు వేర్వేరుగా ఉంటాయి). వీవీఐపీలు వచ్చినా.. రాకున్నా అద్దె మాత్రం చెల్లించాల్సిందే. విమానాలు, హెలికాప్టర్ల అద్దెకే రూ.150 కోట్ల మేరకు వెచ్చిస్తున్నారు. హెలికాప్టర్లు దిగేందుకు వీలుగా 15 ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. ఇందుకు రూ.3కోట్లకుపైగా ఖర్చు చేశారు.
 
అతిథ్యం అదిరిపోయేలా!
దేశ, విదేశాల నుంచి వచ్చే వీవీఐపీలకు విజయవాడలో బస కల్పిస్తున్నారు. ఇందుకు ఈ నెల 21 నుంచి 23 వరకూ విజయవాడలో వివిధ స్టార్ హోటళ్లు, ప్రైవేటు అతిథి గృహాలన్నింటినీ అద్దెకు తీసుకున్నారు. విజయవాడలో ఫోర్ స్టార్ హోటళ్లలో 300 గదులు, త్రీస్టార్ హోటళ్లలో 500 గదులు, ప్రైవేటు అతిథి గృహాలలో 1,500 గదులను రిజర్వు చేసుకున్నారు. వీటికి రోజుకు(సగటున) రూ.6వేల చొప్పున మూడు రోజులపాటూ చెల్లిం చనున్నారు. వీవీఐపీలు బస చేయడానికే రూ.10 కోట్లకుపైగా కేటాయిస్తున్నారు. వారికి మరో రూ.10 కోట్లతో దేశ, విదేశీ రుచులతో విందు ఏర్పాటు చేయనున్నారు.
 
ప్రత్యేక రహదారులు : గన్నవరం విమానాశ్రయం, మంగళగిరి, జగ్గయ్యపేట, కృష్ణా కరకట్టల నుంచి ఉద్దండరాయునిపాలెంకు వరకూ ప్రత్యేక రహదారులు నిర్మిస్తున్నారు. ఇందుకు ఇప్పటికే రూ.28 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చేందుకు రూ.5 కోట్లు కేటాయించారు. ఈ రహదారుల్లో కొత్తగా మిరిమిట్లు గొలిపే లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.5 కోట్లు మంజూరు చేశారు.
 
250 ఎకరాల్లో సభ: శంకుస్థాపన అనంతరం లక్ష మందితో సభ నిర్వహించేందుకు వీలుగా 250 ఎకరాలను చదును చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. సాంసృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదికలను తీర్చిదిద్దడం కోసం రూ.15 కోట్లను వెచ్చించబోతున్నారు. లక్ష మంది ప్రజలకు భోజన ఏర్పాట్ల కోసం రూ.పది కోట్లను మంజూరు చేశారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కొత్త వస్త్రాల పంపిణీకీ రూ.కోట్లలో ఖర్చు కానుంది.అతిథుల జ్ఞాపికలకు గాను  రూ.2.5 కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు.
 
హోరెత్తిపోయేలా ప్రచారం: పత్రికలు, టీవీ చానల్స్‌ల్లో ప్రకటనలకు రూ.20 కోట్ల మేరకు ఖర్చు చేయనున్నారు. శంకుస్థాపనను చిత్రీకరించే బాధ్యతను నేషనల్ జియోగ్రఫీ చానల్‌కు కట్టబెట్టారు. అధికారుల బస, ఆతిథ్యం, తదిత రాలకు సాధారణ పరిపాలన ప్రొటోకాల్ విభాగం రూ.22 కోట్లు వెచ్చించనుంది.  
 
ఊరూరా పండుగా!: శంకుస్థాపనకు రాష్ట్రంలో 16 వేల గ్రామాల నుంచి కిలో మట్టి, పావు లీటరు నీటిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పసుపు గుడ్డ సంచిలో మట్టిని, రాగి పాత్రలో నీటిని సేకరించే కార్యక్రమానికి ఆయా జిల్లాల్లో వివిధ శాఖల పద్దుల కింద రూ.కోట్లు వెచ్చించారు. ప్రతీ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పది నిముషాల నిడివి గల వీడియో క్లిప్పింగ్స్‌ను, ఐదు ఫొటోగ్రాఫ్స్‌ను జిల్లా కలెక్టర్లు సీఆర్‌డీఏకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు గాను ఒక్కో జిల్లాకు సగటున రూ.3 కోట్ల వరకూ ఖర్చు చేయాలని నిర్ణయించారు. అంటే.. మట్టి సేకరణకే రూ.39 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Share this article :

0 comments: