వైఎస్సార్‌ సీపీ మొదటి నుంచీ చెప్తూనే ఉంది... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌ సీపీ మొదటి నుంచీ చెప్తూనే ఉంది...

వైఎస్సార్‌ సీపీ మొదటి నుంచీ చెప్తూనే ఉంది...

Written By news on Saturday, September 28, 2013 | 9/28/2013

ఢిల్లీ సమైక్య మహాధర్నాలో వైఎస్‌ విజయమ్మ ఉద్ఘాటన
కోట్ల మంది రోడ్లపైకి వచ్చినా కాంగ్రెస్‌కు చీమ కుట్టినట్టు లేదు
కాంగ్రెస్‌, టీడీపీలు డ్రామాలు ఆడుతున్నాయి ఆ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేల్ని రాజీనామాల కోసం నిలదీయండి.. ‘సమైక్య’మని చెప్పలేని పార్టీలతో ప్రమాదం
సమైక్యాంధ్ర కోసం లేఖపై పార్టీల అధ్యక్షులతో సంతకాలు తీసుకోండి.. మొదటి సంతకం వైఎస్‌ జగన్‌ చేస్తారు..
జంతర్‌మంతర్‌ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల మహాధర్నా.. మద్దతుగా పాల్గొన్న విజయమ్మ సహా పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ సంక్షోభంతోనే రాష్ట్ర విభజన ఆగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పునరుద్ఘాటించారు. విభజనపై ఆందోళనతో కోట్లాది మంది రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నా కాంగ్రెస్‌కు చీమకుట్టినటై్టనా లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. రాజీనామాలు చేయాలని కాంగ్రెస్‌ కేంద్ర, రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే నిలదీయాలని పిలుపునిచ్చారు. లేఖను వెనక్కి తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబును డిమాండ్‌ చేయాలని ఉద్యోగులను కోరారు.

గతంలో డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన తర్వాత జరిగిన రాజీనామాలతోనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని విజయమ్మ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రాజ్యాంగ సంక్షోభం వస్తే కానీ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. అలాగే.. సమైక్యవాదులు ఎవరు, విభజనవాదులు ఎవరనేది గుర్తించాలని సూచించారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ ఒక లేఖను తయారు చేయించి, ఆ లేఖపై అన్ని పార్టీల అధ్యక్షుల సంతకాలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖపై తొలి సంతకం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పెడతారని చెప్పారు. ఈ లేఖపై సంతకాలతో ఎవరు ఎటువైపు ఉన్నారనేది తేలిపోతుందని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించింది. ఈ ఆందోళన కార్యక్రమానికి విజయమ్మ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం తప్పితే ప్రత్యామ్నాయం లేదు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది. నేడు రాష్ట్రం రావణ కాష్టంగా ఉంది. అన్నదమ్ములా ఉండాల్సిన మనలో అంతరాలు పెరిగాయి.

హైదరాబాద్‌ సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు రెండు వర్గాలుగా చీలటం చూస్తున్నాం. రాను రాను కొట్టుకునే పరిస్థితి దాపురిస్తోంది. దీనికి కాంగ్రెస్‌, టీడీపీలే కారణం’’ అని తూర్పారబట్టారు. కోట్లాది మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై జరుగుతున్న ఉద్యమంలో ఉద్యోగుల మొర ఆలకించాలని కోరుతూ ఇక్కడకు వచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున, తన తరఫున, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. విజయమ్మ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...

కాంగ్రెస్‌, టీడీపీలు డ్రామాలాడుతున్నాయి
‘‘రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ విధానం తెలపకుండా, ఎవరితో చర్చించకుండా గంటసేపు సీడబ్ల్యూసీలో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. యూపీఏ మిత్రపక్షాలతో మాట్లాడారు కానీ.. రాష్ట్రంలోని పార్టీలతో మాట్లాడాల్సిన అవసరం లేదా? ప్రజలను విశ్వా„సంలోకి తీసుకోలేదు. ప్రజలకు జవాబు చెప్పకుండా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వటానికి నిర్ణయం జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు బ్లాంక్‌ చెక్‌ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భయపడి ఉండేది. ఇప్పుడు కోట్ల మంది రోడ్లపై వచ్చారు. కాలేజీ, స్కూళ్లు, బస్సులు, ఆఫీసులు నడవటంలేదు. అయినా కాంగ్రెస్‌కు చీమకుట్టినట్టు లేదు.

58 రోజుల నుంచి ఆందోళన జరుగుతున్నా జవాబు చెప్పలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ప్రకటన నిర్ణయం జరగలేదు. కాంగ్రెస్‌, టీడీపీ డ్రామాలు మొదలుపెట్టాయి. సీఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్సలు ఇరు ప్రాంతాల నుంచి రోడ్‌మ్యాప్‌లు తీసుకెళ్లి చర్చించారు. ఆ రోజే గట్టిగా ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. టీడీపీ, బీజేపీ రాజీనామాలు చేస్తే సీడబ్ల్యుసీ నిర్ణయం వెనక్కి తీసుకుంటారని మంత్రి కొండ్రు మురళి చెప్తున్నారు. మీరు రాజీనామా చేసి ఇతరుల రాజీనామాలు అడిగితే బాగుంటుంది. మరోవైపు సీఎం కిరణ్‌ సమైక్యం అని చెప్తున్నారు. ఉద్యోగ సంఘాలను హైజాక్‌ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.

‘సమైక్య ఇందిరా కాంగ్రెస్‌’ అనే పేరుతో ఎన్నికల్లోకి వస్తామని లీకులిస్తున్నారు. చంద్రబాబు తొలుత బ్లాంక్‌ చెక్‌ ఇచ్చారు. తర్వాత సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధాని నిర్మించుకోవచ్చని చెప్పారు. ఉద్యమం ఉధృతమైన తర్వాత ఆత్మగౌరవం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. రెండు ప్రాంతాల వారిని తీసుకువచ్చినట్టు ఢిల్లీకి వచ్చి చెప్పారు. లేఖ వెనక్కి తీసుకోలేదు. తెలంగాణనూ సమర్థించలేదు. సమైక్యాంధ్ర అని చెప్పలేదు. ద్వంద్వ వైఖరులతో కాంగ్రెస్‌, టీడీపీలు నడుస్తున్నాయి.

వైఎస్సార్‌ సీపీ మొదటి నుంచీ చెప్తూనే ఉంది...
ఏ ప్రాంతానికీ అన్యాయం చేయవద్దని, అవసరమైతే తండ్రిలా విభజన చేయాలని నిర్ణయం రాకముందు నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చెప్తూ వస్తోంది. తండ్రిలా విభజన చేయలేనప్పుడు విభజన హక్కు మీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు? 30న నిర్ణయం రాబోతోందని ఎమ్మెల్యేలతో లేఖలు రాయించాం. అన్యాయం చేస్తే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని హోంమంత్రి షిండేకు లేఖ రాశాం. న్యాయం చేయలేకపోతే విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పాం.

వైఎస్సార్‌ సీపీ ఒక్కటే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసింది. మిగిలిన పార్టీలు అలా చేయలేదు. ఆంటోనీ కమిటీ ద్వారా న్యాయం జరగదని నేనూ, జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేశాం. వేరే రాష్ట్రానికి తరలిస్తారని ప్రచారం జరిగినప్పటికీ జగన్‌ ఒంటరిగా జైలులో వారం రోజుల పాటు దీక్ష చేశారు. నీళ్లు ఎలా.. ఉద్యోగం, ఉపాధి ఎలా? ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ నిండితే గానీ మనకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ కట్టేటప్పుడు చంద్రబాబు చూస్తా కూర్చున్నారు. ఆ పాపం నేడు మనం అనుభవిస్తున్నాం. దిగువప్రాంతానికి కరువు వచ్చినా, వరదలొచ్చినా సమస్యే. శ్రీశైలానికి నీళ్లు ఎలా ఇస్తారు? నాగార్జునసాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారు? పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటున్నారు.. ఎక్కడి నుంచి నీళ్లు నింపుతారు? కృష్ణా పరీవాహక ప్రాంతం అంతా ఒకవైపు ఉంచుతారా? అన్నదమ్ముల మధ్య కొట్లాట ఇలానే పెడతారా? మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి మద్రాసును దూరం చేశారు.

60 ఏళ్లుగా మనం కట్టుకున్న హైదరాబాద్‌ నుంచి మనలను వెళ్లిపొమ్మంటున్నారు. రాష్ట్రం ఇంకా ఏర్పాటు కాలేదు. అప్పుడే కేసీఆర్‌ మనల్ను వెళ్ళిపోవాలంటున్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లాలి? ఉద్యోగాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లాలి? కూలీలు పనుల కోసం, వ్యాపారం కోసం వ్యాపారస్తులు హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌ నుంచి వెళ్ళిపోవాలంటే ఎలా బతకాలి? రాష్ట్ర బడ్జెట్‌లో 40 నుంచి 50 శాతం వరకు హైదరాబాద్‌ నుంచే వస్తుంది. ఒక ప్రాంతానికి వస్తే ఇటువైపు వారికి (సీమాంధ్ర) జీతాలు చెల్లించే పరిస్థితే ఉండదు. ఇక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారు?

తెలంగాణలో సమస్యలు లేవని కాదు...
తెలంగాణలో సమస్యలు లేవని కాదు. అక్కడా సమస్యలు ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల పూరె్తైత్తే ఏడు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కలలు కన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమం ఉంది. అయితే ఉద్యమం అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్లింది. ఉచిత విద్యుత్‌, విద్యుత్‌ బకాయిల మాఫీ 70 శాతం తెలంగాణ ప్రజలకు ఉపయోగపడింది. సంక్షేమ పథకాలు ఇంటింటికి, మనిషి మనిషికి అందించటం జరిగింది.

టీడీపీ నుంచి ఉద్యమ పార్టీగా బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌ పెట్టి వచ్చిన నాయకులు రాజశేఖరరెడ్డి నాయకత్వాన్ని సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్‌ హయాంలో వెనుకబాటుతనం ఉద్యమం లేదు. రాష్ట్రాన్ని విభజించాలనే ఉద్యమానికి బలం లేదు. విభజన జరగలేదు. ఇప్పుడేదైతేరాష్ట్రం విడిపోవాలని ఉద్యమం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ఆ రోజు రెండుగా చీలిపోయింది. రాజశేఖరరెడ్డి సమర్థవంతమైన నేత. 23 జిల్లాలకు, మూడు ప్రాంతాలకు సమన్యాయం చేశారు. మూడు ప్రాంతాలకు నీళ్లు ఉండాలని 86 ప్రాజెక్టులు తీసుకున్నారు. రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే 86 ప్రాజెక్టులు పూరె్తై ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. సమర్థుడైన నాయకుడుంటే అన్ని ప్రాంతాల్లో సమ అభివృద్ధి జరుగుతుందనేది చూశాం.

రాష్ట్ర అభివృద్ధి కోసమే సమైక్య నిర్ణయం...
రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు నడవటానికి జగన్‌ నాయకత్వంలో సమైక్యాంధ్ర నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాంగ్రెస్‌, టీడీపీల అసలు రంగు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ సంఘాలు విచిత్ర వాదన చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని నడుపుతామని చెప్తున్నారు. అసలు సమస్య పుట్టింది రాజకీయం నుంచే. సమైక్యమని చెప్పలేని నాయకులు, పార్టీలను ఆహ్వానించి వారితో కలిసి ఉద్యమం చేయటం చాలా ప్రమాదకరం. సమైక్యం అనేది ఎవరు? విభజనదారులు ఎవరు? అనేది గుర్తించాలి.

సమైక్యంపై ఒక లేఖ తయారు చేయండని, మొట్టమొదటగా జగన్‌ సంతకం చేస్తారని చెప్పటం జరిగింది. ఆ లేఖను తయారు చేసి అన్ని పార్టీల అధ్యక్షులతో సంతకాలు పెట్టించండి. సంతకాలు పెట్టినప్పుడు సమైక్యవాదులు ఎవరు, విభజన వాదులెవరనేది తేలిపోతుంది. విభజించి లాభం పొందేవారు ఎవరనేది మనకు, ప్రజలకు తెలుస్తుంది. అన్ని పార్టీలను సమైక్య నినాదంపై తీసుకురావటానికి కృషి చేయాలని ఉద్యోగుల సంఘాలను నేను కోరుకుంటున్నా.’’



మహాధర్నాకు మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మతో పాటు.. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇతర నాయకులు ఉమ్మారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: