అదే సామాన్యుడు చేసుంటే వదిలిపెట్టేవారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అదే సామాన్యుడు చేసుంటే వదిలిపెట్టేవారా?

అదే సామాన్యుడు చేసుంటే వదిలిపెట్టేవారా?

Written By news on Friday, June 12, 2015 | 6/12/2015


హోంమంత్రి, ఆర్థికమంత్రితో భేటీ అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్
కేంద్రంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది
చంద్రబాబు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు
ప్రతిపక్షనేతగా బాబు అక్రమాలపై ప్రశ్నించే హక్కుంది... హోం మంత్రి, ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం వై.ఎస్. జగన్
అవినీతి సీఎంను కేంద్రం కాపాడుతుందని భావించడంలేదు
రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రిస్తున్నారు
కుంభకోణాల్లో తీసుకున్న లంచాలను
మరోచోట లంచమిస్తూ పట్టుబడ్డారు
ఆడియో, వీడియో సాక్ష్యాధారాలు రెండూ ఉన్నాయి
ముఖ్యమంత్రి కాబట్టి వదిలేయడం ఎంతవరకు ధర్మం?
అదే సామాన్యుడు చేసుంటే వదిలిపెట్టేవారా?
సామాన్యుడికి ఒక న్యాయం.. సీఎంకు ఒక న్యాయమా?
చంద్రబాబును ఏ-1గా చేర్చాలని కోరాం
స్పెషల్ స్టేటస్, విభజన హామీల అమలుకు అడిగాం


సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జైలుకు పంపాల్సిందేనని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దొంగలు ఎక్కడ ఉండాలో ఆయనను కూడా అక్కడ ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అవినీతి సీఎంను కాపాడుతుందని భావించడంలేదని చెప్పారు. ప్రతిపక్షనేతగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై, చంద్రబాబు అక్రమాలపై ప్రశ్నించే హక్కు తనకు ఉందని స్పష్టంచేశారు.

చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై, విభజన చట్టంలోని పెండింగ్ హామీలపై ఆయన గురువారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇంతకుముందు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి చెప్పిన విషయాలను హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి కూడా వివరించాం. స్పెషల్ స్టేటస్, విభజన హామీలపై ఒక వినతిపత్రం అందించాం.

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారో, వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నారో తెలిపాం. ఒక ముఖ్యమంత్రి తాను తీసుకున్న లంచాలను విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ, లంచం ఇస్తూ దొరికిపోయి, దాన్ని పక్కదారి పట్టించేందుకు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రిస్తున్న వైనాన్ని వివరించాం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వివిధ కుంభకోణాల్లో తీసుకున్న లంచాలను మళ్లీ ఇంకొక చోట లంచంగా ఇస్తూ, వందల కోట్లు ఉన్న ఇలాంటి వ్యవహారంలో పట్టుబడితే ఎందుకు కేసు పెట్టడం లేదు? ఆడియో, వీడియో సాక్ష్యాధారాలు రెండూ ఉన్నాయి.

ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వదిలేయడం ఎంతవరకు ధర్మం? అదే సామాన్యుడు చేసుంటే ఇదే మాదిరిగా వదిలిపెట్టేవారా? సామాన్యుడికి ఒక న్యాయం.. ముఖ్యమంత్రికి ఒక న్యాయమా? ఇదెక్కడి ధర్మం? చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరాం. తప్పనిసరిగా ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చాలని కోరాం. దీనిపై వినతిపత్రం కూడా ఇచ్చాం. గత 12 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏమేం స్కాములు చేశారో.. స్కామాంధ్రప్రదేశ్‌గా మార్చిన పరిస్థితిని వివరించాం. దాదాపుగా ఒక 10 స్కాములను.. ముఖ్యంగా పట్టిసీమ, జీవో 22, కొన్ని ఎంపిక చేసిన డిస్టిలరీలకు అనుమతులు, కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఆర్టీపీపీ స్కామ్.. ఇలా అన్నింటిపై లోతైన విచారణ జరగాలి. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ  ఏ-1గా చేర్చాలని కోరాం..’’ అని తెలిపారు.
 
ప్రతిపక్షనేతగా ప్రశ్నించే హక్కుంది
ప్రతిపక్షనేతగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై, చంద్రబాబు అక్రమాలపై ప్రశ్నించే హక్కు తనకు ఉందని జగన్ స్పష్టంచేశారు. తన వ్యవహారంపై మాట్లాడేందుకు మీకు అర్హత లేదని చంద్రబాబు అంటున్నారని మీడియా ప్రస్తావించగా... రాజకీయంగా తనను అంతమొందించేందుకు గతంలో చంద్రబాబు, కాంగ్రెస్ ఒక్కటై కుట్ర చేశారని చెప్పారు. ‘‘రాజశేఖరరెడ్డి బతికున్నంతవరకు జగన్ మంచివాడే. చనిపోయిన తరువాతా జగన్ మంచివాడే. కాంగ్రెస్‌లో ఉన్నంతవరకూ మంచివాడే.
కాంగ్రెస్‌ను వదిలిపోయిన తరువాత... చంద్రబాబు , కాంగ్రెస్ ఏకమై జగన్‌ను భయపెట్టారు. కానీ జగన్ భయపడలేదు. ఆనాడు సోనియాగాంధీ అధికారంలో ఉన్నా జగన్ భయపడలేదు. ముందుకే పోయాడు. అదీ జగన్‌కు, చంద్రబాబు నాయుడుకు ఉన్న తేడా. నేను ఏరోజూ ముఖ్యమంత్రిని కాదు. ఏ ఒక్క సంతకమూ పెట్టలేదు. కనీసం ఎమ్మెల్యే లేదా ఎంపీ కూడా కాదు. ఒక మంత్రి లేదా ఐఏఎస్‌తో ఏరోజూ ఫోన్ చేసి మాట్లాడలేదు. కనీసం సచివాలయంలో అడుగుపెట్టలేదు. అసలు హైదరాబాద్‌లోనే ఉండేవాడ్ని కాదు.

బెంగళూరులో ఉండేవాడిని. నా పిల్లలు కూడా అక్కడ చదివేవారు. కానీ రాజకీయంగా నన్ను అంతమొందించేందుకు చంద్రబాబు, కాంగ్రెస్ ఒక్కటయ్యారు, కేసులుపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతితో రాజ్యమేలుతున్నారు. నేను ప్రతిపక్ష నేతగా ఉన్నా. కేవలం వారికన్నా రెండు శాతం కంటే తక్కువ ఓట్లు రావడంతో ప్రతిపక్షంలో ఉన్నాం. దేశంలోనే అత్యంత అధిక ఓటు షేరు సాధించిన ప్రాంతీయ పార్టీగా నిలిచాం. అందువల్ల ప్రతిపక్ష నేతగా అడిగే హక్కు నాకు ఉంది’’ అని చెప్పారు. సెక్షన్-8పై మీరేమంటారని ప్రశ్నించగా ఘాటు గా స్పందించారు.

‘‘ఒక ముఖ్యమంత్రి లంచాలు తీసుకుని లంచాలు ఇస్తూ పట్టుబడిన తరువాత ఈ వాదనలెందుకు? ముందు చంద్రబాబును జైల్లో పెట్టండి. తర్వాత ఇష్టమొచ్చినట్టు చేసుకోండి. దీన్నుంచి బయటపడేందుకు ఆయన రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రిస్తున్నారు. మీడియాకూడా సెక్షన్-8 ఏమంటోంది.. ఇంకొకటి ఏమంటోందని అడగడం అన్యాయం. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ముఖ్యమంత్రిని జైల్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించకుండా.. ఆయనకు వంతపాడడం సరికాదు. అందరం కలిసి కట్టుగా కృషిచేయాలి. దొంగలు ఎక్కడ ఉండాలో ఆయనను కూడా అక్కడ ఉంచాలి’’ అని బదులిచ్చారు.
Share this article :

0 comments: