అంధకార భారతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంధకార భారతం

అంధకార భారతం

Written By news on Wednesday, August 1, 2012 | 8/01/2012


22 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కరెంట్ పూర్తిగా కట్టయింది
60 కోట్ల మందికి పైగా గంటల తరబడి అష్టకష్టాల పాలయ్యారు
సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతి పెద్ద కరెంటు సంక్షోభం
పట్టాలపైనే వందలాది రైళ్లు.. నరకం చవిచూసిన ప్రయాణికులు
చుక్కల్లో విమాన టికెట్లు.. ఢిల్లీ నుంచి విజయవాడకు రూ. 27,000
4,500 మెగావాట్ల కరెంటు వాడుకునే ఢిల్లీకి 40 మెగావాట్లయినా అందలేదు
పలు నగరాల్లో ట్రాఫిక్ లైట్స్ లేక కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది
కరెంట్ కోతతో దేశం అల్లాడింది
అదే సమయంలో...
విద్యుత్ మంత్రి షిండే హోం మంత్రిగా పదోన్నతి పొందారు!
విద్యుత్ శాఖను చేపట్టిన మొయిలీ.. బాధ్యతల స్వీకరణకు ఇంతకంటే దుర్దినం మరోటి లేదంటూ వాపోయారు

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: కనీవినీ ఎరగని కరెంటు సంక్షోభంతో మంగళవారం భారతదేశం అల్లాడిపోయింది. సోమవారం నాటి కరెంటు కష్టాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. మూడు ప్రధాన గ్రిడ్లు ఒకేసారి పూర్తిగా కుప్పకూలాయి. దాంతో... ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 వేల మెగావాట్ల కరెంటు సరఫరా ఒక్కసారిగా ఆగిపోయింది. దాంతో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఉత్తర, తూర్పు, ఈశాన్య భారతం ఒకేసారి సంపూర్ణ కరెంటు కోత బారిన పడింది. మొత్తం 22 రాష్ట్రాలకు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా దేశ జనాభాలో సగం మంది, అంటే ఏకంగా 60 కోట్ల మందికి పైగా గంటల తరబడి అక్షరాలా అష్టకష్టాల పాలయ్యారు. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదిగా నమోదైన ఈ కరెంటు సంక్షోభం దెబ్బకు రవాణా తదితర అత్యవసర సేవలన్నీ కుదేలయ్యాయి. రైళ్ల రాకపోకలకు, ఆస్పత్రి సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. 10 రాష్ట్రాల్లో ఏడు జోన్ల పరిధిలో 300కు పైగా రైళ్లు పట్టాలపైనే నిలిచిపోయాయి. మరెన్నో రైళ్లు స్టేషన్లలో ఆగిపోయాయి. రైళ్లలో, స్టేషన్లలో లక్షలాది మంది ప్రయాణికులు అల్లాడిపోయారు. కరెంటు లేక చాలాచోట్ల పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. ఆస్పత్రుల్లో కరెంటు లేక ఆపరేషన్లు కూడా ఆగిపోయాయి. దాంతో రోగులు ప్రత్యక్ష నరకం చవిచూశారు. పలు రాష్ట్రాల్లో గ్యాస్, మంచినీటి సరఫరా కూడా దాదాపుగా నిలిచిపోయాయి. 

తూర్పు, ఉత్తర, ఈశాన్య భారతం పూర్తిగా స్తంభించిపోయింది. ఢిల్లీలో జనజీవితం పూర్తిగా అతలాకుతలమైంది. రోజూ 4,500 మెగావాట్ల కరెంటును వాడుకునే రాజధాని నగరానికి మంగళవారం ఒక దశలో కనీసం 40 మెగావాట్లు కూడా సరఫరా కాలేదు! దాంతో వీఐపీ జోన్లతో సహా నగరంలో గంటల తరబడి ఎక్కడా కరెంటన్నదే కన్పించక ట్రాఫిక్ లైట్లు, మెట్రో రైళ్లతో సహా సర్వం నిలిచిపోయాయి. చివరికి తాగునీరు కూడా లేక ఢిల్లీ అల్లాడిపోయింది. చివరికి పశ్చిమ, దక్షిణాది గ్రిడ్ల సాయంతో.. నిలిచిపోయిన 50 వేల మెగావాట్లలో సగం మేరకు కరెంటు సరఫరాను మంగళవారం రాత్రి సమయానికి అతి కష్టంమీద పునరుద్ధరించగలిగారు. ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు దాదాపుగా పూర్తిస్థాయిలో, ఉత్తరాది రాష్ట్రాల్లో 70 వాతానికి కరెంటు సరఫరా మొదలైందని పవర్ గ్రిడ్ పేర్కొంది. కానీ తూర్పు భారతదేశంలో మాత్రం సగానికి పైగా ప్రాంతం ఇంకా అంధకారంలోనే మగ్గిపోతోంది. దేశ విద్యుదుత్పత్తి అవసరాలకు చాలినంతగా లేదని, కరెంటు సమస్య తీవ్రంగా ఉందని పవర్‌గ్రిడ్ ఉన్నతాధికారి ఒకరు అంగీకరించారు. మంగళవారం నాటి ఉదంతమే అందుకు అద్దం పట్టిందని ఆయనన్నారు!

సోమవారం ఉత్తరాది గ్రిడ్ వైఫల్యంతో ఎనిమిది రాష్ట్రాల్లో 30 కోట్ల మంది కరెంటు కోతతో నరకయాతన అనుభవించడం తెలిసిందే. మంగళవారం కూడా మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి ఉత్తరాది గ్రిడ్ వైఫల్యంతోనే సమస్యకు బీజం పడింది. వరుసగా తూర్పు, ఈశాన్య గ్రిడ్లు కూడా వెనువెంటనే కుప్పకూలడంతో చూస్తుండగానే అది కాస్తా ప్రచండ రూపు దాల్చింది. ఢిల్లీతో పాటు యూపీ,బెంగాల్, బీహార్, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఏడు ఈశాన్య రాష్ట్రాలే గాక చండీగఢ్‌తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాలు కరెంటు కోతతో అల్లాడిపోయాయి. దీన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కరెంటు వైఫల్యాల్లో ఒకటిగా చెబుతున్నారు. కానీ ఇంతటి సమస్యకు కారణమేమిటో ఇంకా తెలియదంటూ దేశంలోని గ్రిడ్లన్నింటినీ నిర్వహించే ప్రధాన సంస్థ ‘పవర్ గ్రిడ్’ చైర్మన్ చేతులెత్తేసింది. కేంద్ర తాజా మాజీ విద్యుత్ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మాత్రం కొన్ని రాష్ట్రాలు పరిమితికి మించి కరెంటును లాగేసుకోవడమే ఇంతటి విపత్తును తెచ్చి పెట్టిందంటూ ముక్తాయించారు. బాధ్యతలు స్వీకరించడానికి ఇంతకంటే దుర్దినం ఇంకోటి ఉండబోదంటూ మంగళవారం అదనంగా విద్యుత్ శాఖను కూడా చేపట్టిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ వాపోయారు. కరెంటు సరఫరా కష్టాలను త్వరలో పరిష్కరిస్తామని ప్రతినబూనారు.

మరోవైపు కేంద్ర, రాష్ట్రాల మధ్య వాగ్యుద్ధానికి కూడా ఈ ఉదంతం తెర తీసింది. యూపీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ పరిమితికి మించి కరెంటును వాడుకుంటున్నాయని, తీరు మార్చుకోకుంటే వాటిపై చర్యలు తప్పవని అంతకుముందు షిండే హెచ్చరించగా ఆయన వాదనను ఆ రాష్ట్రాలు తిప్పికొట్టాయి. గుజరాత్ సీఎం మోడీ అయితే ఏకంగా ప్రధానిపైనే వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. ‘‘సగం జనాభా కరెంటు కోతతో అల్లాడుతోంది. ప్రతిదానికీ సంకీర్ణ ధర్మపు పరిమితులే కారణమని మీరు చెబుతుంటారు. కోతకు కూడా బహుశా అదే కారణమమేమో ప్రజలు తెలుసుకోగోరుతున్నారు’’ అంటూ ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘అసమర్థపు పోకడలతో యూపీఏ సర్కారు సామాన్యుని జేబులు ఖాళీ చేసింది. ద్రవ్యోల్బణంతో కడుపులు మాడ్చింది. చివరికి ఈ రోజు వారిని కారుచీకట్లలోకి తోసేసింది’’ అంటూ దుయ్యబట్టారు. మొయిలీ మాత్రం ఈ సమస్యకు రాష్ట్రాలను నిందించలేమనడం విశేషం.
Share this article :

0 comments: