పదేళ్లకోసారి ‘స్థానిక’ రిజర్వేషన్లు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పదేళ్లకోసారి ‘స్థానిక’ రిజర్వేషన్లు!

పదేళ్లకోసారి ‘స్థానిక’ రిజర్వేషన్లు!

Written By news on Thursday, August 2, 2012 | 8/02/2012

కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఆమోదం

హైదరాబాద్. న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల రొటేషన్‌ను ఇకపై పదేళ్లకోసారి చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఐదేళ్లకోమారు రిజర్వేషన్లు మారుతుండేవి. దీనిని రెండు టర్మ్‌ల (పదేళ్లు)కు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదముద్ర వేసింది. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే కొత్త రొటేషన్ పద్ధతి అమలులోకి వస్తుంది. ఐదేళ్లకోసారి రిజర్వేషన్ మార్చడం వల్ల ప్రజాప్రతినిధులు ఆ ప్రాంత అభివృద్ధిపై సరైన దృష్టి పెట్టడంలేదన్న అభిప్రాయం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మునిసిపాలిటీ/వార్డు/పంచాయతీ/మండలం/జిల్లా పరిధిలో కనీసం ఐదు శాతం జనాభా ఉంటేనే ఆ వర్గానికి రిజర్వేషన్ అమలు చేయనున్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలు, విధుల బదలాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం చర్చించింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు జానారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, మహీధర్‌రెడ్డి, గీతారెడ్డి పాల్గొన్నారు. మండల, జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్‌లలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉన్న సభ్యత్వాన్ని కూడా తొల గించాలన్న ప్రతిపాదనపై కూడా మంత్రుల బృందం సానుకూలంగా స్పందించింది. మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్లలో చట్టసభల్లోని ప్రజాప్రతినిధులకు సభ్యత్వంతోపాటు, ఓటు హక్కు ఉంటుంది. మేయర్, మునిసిపల్ చైర్‌పర్సన్‌ల ఎంపిక పరోక్ష పద్ధతిలో ఉన్నందున ఈ ప్రజాప్రతినిధుల ఓట్లు కీలకంగా మారుతున్నాయి. వీరి సభ్యత్వాన్ని తొలగించడం వల్ల ఓటు హక్కు కూడా పోతుంది. 

కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాత్రమే మేయర్‌ను, చైర్‌పర్సన్‌ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపును తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనను మంత్రులు ఆమోదించారు. అధికారాల బదలాయింపు ‘వీలైతే’ అన్న స్థానంలో ‘తప్పనిసరి’ అన్న పదాన్ని వినియోగించాలన్న సవరణకు ఆమోద ముద్ర వేశారు. అధికారాల బదలాయింపునకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖలో 29 అంశాలను బదలాయించాలి. పురపాలక శాఖలో 18 అంశాల బదలాయింపు జరగాలి. పురపాలక శాఖకు సంబంధించి అగ్నిమాపక విభాగం మినహా మిగిలిన అన్ని అధికారాలను బదలాయించినట్లు ఈ సమావేశంలో అధికారులు వివరించినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటిపై రెండు మూడు రోజుల్లో మరోసారి సమావేశమై చర్చించి నివేదిక ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు.

పంచాయతీల్లో ఇకపై గ్రామ సభలే కీలకం కానున్నాయి. ఈమేరకు గ్రామ సభలకు పంచాయతీలు జవాబుదారీగా ఉండాలని సవరణ చేయనున్నారు. ఏ పని అయినా గ్రామ సభ ఆమోదంతోనే చేపట్టాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ ఎన్నికలను 2001 జనాభాతో లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని పాత పద్ధతిలోనే (60.5% రిజర్వేషన్లు) నిర్వహించడానికి అనుమతించాలని ప్రభుత్వం హైకోర్టును కోరిందని, కోర్టు తీర్పు రావాల్సిందని అధికారులు మంత్రులకు వివరించారు. హైకోర్టు తీర్పు వచ్చాకే మునిసిపల్ ఎన్నికలపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని నిర్ణయించారు.

తాత్కాలిక సిబ్బంది కొనసాగింపు
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గత సంవత్సరం వివిధ స్థాయిల్లో నియమించిన అధికారులను డిసెంబర్ 12వ తేదీ వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సిబ్బంది లేకపోతే ఎన్నికల నిర్వహణ కష్టమని, వారిని కొనసాగించాలంటూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రాంగోపాల్ పంపిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి కేడర్‌లో ప్రత్యేకాధికారి, సూపరింటెండెంట్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, జిల్లా పంచాయతీ కార్యాలయంలో 22 మంది డివిజినల్ పంచాయతీ అధికారులు, డివిజినల్ పంచాయతీ కార్యాలయాల్లో 82 మంది సీనియర్ అసిస్టెంట్లను కొనసాగించాలని నిర్ణయించారు.
Share this article :

0 comments: