హస్తినలో బాబు ‘జగన్’ జపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హస్తినలో బాబు ‘జగన్’ జపం

హస్తినలో బాబు ‘జగన్’ జపం

Written By news on Sunday, September 22, 2013 | 9/22/2013

హస్తినలో బాబు ‘జగన్’ జపం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన హస్తిన పర్యటనలో తొలి రోజైన శనివారం పూర్తిగా ‘జగన్’ నామస్మరణలోనే గడిపారు. ‘రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని వివరించడం’ అన్న స్వీయ ప్రవచిత లక్ష్యాన్ని అటకెక్కించారు. వైఎస్సార్‌సీపీ అధినేత బెయిల్‌ను మరోసారి ఏదోలా అడ్డుకోవడమే అసలు లక్ష్యంగా రోజంతా రకరకాలుగా పావులు కదిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మొదలుకుని శనివారం తాను కలిసిన ప్రతి ఒక్కరితోనూ జగన్ గురించే వీలైనంత ఎక్కువసేపు మాట్లాడారు.

Photo దాంతోపాటు జాతీయ రాజకీయాల్లో తన శకం ఇంకా ముగిసిపోలేదని జాతీయ పార్టీలకు నచ్చజెప్పేందుకు కూడా శాయశక్తులా ఆపసోపాలు పడ్డారు. శనివారం సాయంత్రం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల బృందంతో పాటుగా ప్రణబ్‌తో చంద్రబాబు 45 నిమిషాలకు పైగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అనిశ్చితిని తొలగించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి జేఏసీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు, విభిన్న వర్గాల వారితో చర్చలు జరిపి సమస్య పరిష్కరించేలా కేంద్రాన్ని, ప్రధానిని ఆదేశించాలని కోరామన్నారు. ‘‘ఓవైపు టీఆర్‌ఎస్‌ను కలుపుకొని రాజకీయ లబ్ధి పొందాలని, మరోవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు ముందు లేదా తర్వాత లాలూచీ పడాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇవన్నీ రాష్ట్రపతికి వివరించాం’’ అన్నారు. అయితే, నిజానికి ప్రణబ్‌తో మాట్లాడిన సమయం మొత్తాన్నీ పూర్తిగా జగన్ అంశంపైనే బాబు కేంద్రీకరించినట్టు సమాచారం. ఆయన బెయిల్‌ను అడ్డుకునేందుకు తనకున్న అధికారాలను ఉపయోగించాల్సిందిగా కూడా ప్రణబ్‌ను కోరినట్టు తెలుస్తోంది! రాష్ట్రపతితో జరిగిన సంభాషణలో ఎక్కువ భాగం వైఎస్సార్‌సీపీ, జగన్ బెయిలే ప్రధానాంశాలుగా సాగింది. ఆయన ఇచ్చిన వినతిపత్రంలో రాష్ట్ర కల్లోల పరిస్థితిని ప్రస్తావించినా చర్చించిన అంశం మాత్రం జగన్ బెయిల్ సంగతేనని తెలుస్తోంది.
Photo
 బెయిల్ అనివార్యమన్న లాయర్లు!

 నిజానికి శనివారం ఢిల్లీలో బాబు కార్యక్రమాల్లో సగానికి సగం గోప్యంగానే సాగాయి. ఒకరిద్దరు భద్రతా సిబ్బంది మినహా మరెవరినీ ఆయన తన వెంట తీసుకెళ్లలేదు కూడా! ఈ భేటీలన్నింటి లక్ష్యమూ జగన్ బెయిల్‌ను అడ్డుకోవడమేనని టీడీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించడం కన్పించింది. గుర్గావ్‌లో టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన అతిథి గృహంలో మధ్యాహ్నం కాసేపు గడిపిన బాబు, అక్కడ కూడా పలువురితో గుట్టుగా మంతనాల్లో మునిగితేలారు. అనంతరం నోయిడా సెక్టార్ 25ఎ లో తన లాయర్లు, మరికొందరు న్యాయ నిపుణులతో జగన్ బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘంగా మల్లగుల్లాలు పడ్డారు. అయితే ఈసారి జగన్‌కు బెయిల్ అనివార్యమని వారంతా అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో బాబు బాగా అసంతృప్తికి లోనైనట్టు సమాచారం. అదే గనక జరిగితే కనీసం జగన్ కేసు విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతూ కనీసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని వారికి ఆయన సూచించారంటున్నారు.

 బాబును లైట్ తీస్కున్న కారత్

 అనంతరం సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌తో బాబు భేటీ అయ్యారు. అయితే, ఎన్డీఏ కన్వీనర్ పదవిపై బాబు కన్నేశారన్న వార్తల నేపథ్యంలో ఆయనతో కారత్ అన్యమనస్కంగానే మాట్లాడినట్టు తెలిసింది. అంతేగాక ఇటీవలి కాలంలో బీజేపీకి సన్నిహితమయ్యేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై కారత్ అసంతృప్తిగా ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. విభజన విషయమై రాష్ట్రంలో నెలకొన్న కల్లోల పరిస్థితిని కారత్‌కు వివరించేందుకే వచ్చానని అనంతరం మీడియాకు బాబు చెప్పుకొచ్చారు. కారత్ మాత్రం విలేకరులతో మాట్లాడేందుకు ఆసక్తే చూపలేదు. ముక్తసరిగా ఒకట్రెండు మాటలతో సరిపెట్టారు.

 రాజ్‌నాథ్‌తో భేటీ

 రాష్ట్రపతితో భేటీ తర్వాత బాబు నేరుగా బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నివాసానికి వెళ్లి అరగంటపాటు చర్చించారు. అనంతరం రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. బాబు ఎన్డీఏలో చేరతారన్న ప్రచారాన్ని ప్రస్తావించగా, తాము రాష్ట్ర సమస్యలపైనే చర్చించాం తప్ప రాజకీయాంశాల ప్రస్తావన రాలేదని బదులిచ్చారు. అంతకుముందు వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు గురించి ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరితోనూ బాబు మంతనాలు జరిపారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్డీఏ కన్వీనర్ పదవి స్వీకరించేందుకూ బాబు తన సంసిద్ధతను కాషాయ నేతలకు తెలి యజేశారని సమాచారం.

 అడక్కు.. చెప్పేది వినంతే!
 మీడియాపై చంద్రబాబు అసహనం
 రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ విలేకరుల మీదికి బాబు ఒంటికాలిపై లేచారు. ‘సమైకాంధ్రకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉంది, మరి మీ పార్టీ కూడా..’ అంటూ ప్రశ్నిస్తున్న ఓ విలేకరిపై మండిపడ్డారు. ‘‘ఏయ్ వినయ్యా. నువ్వడిగిన దానికి నేను చెప్పేందుకు సిద్ధంగా లేను. నేను చేప్పేది నువ్వు వినాలి. రాష్ట్రపతికి మెమోరాండం ఇచ్చాం. అన్ని విషయాలూ అందులో ఉన్నాయి. అయినా నీ ఎజెండా నువ్వు పెట్టుకుంటే చెప్పడానికి నేను ఇక్కడకు రాలే’’ అంటూ మండిపడ్డారు. తాను రాజకీయాలు మాట్లాడబోనని మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు.
Share this article :

0 comments: