విద్యుత్‌చార్జీల పిడుగు 9,320 కోట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్‌చార్జీల పిడుగు 9,320 కోట్లు

విద్యుత్‌చార్జీల పిడుగు 9,320 కోట్లు

Written By news on Thursday, December 5, 2013 | 12/05/2013

 పేదలు, మధ్యతరగతి వర్గాలే సర్కారు టార్గెట్
* అదనపు రాబడికి డిస్కంల ప్రతిపాదనలు
* 2014-15కు ఈఆర్‌సీకి ఆదాయ, వ్యయ నివేదికల సమర్పణ
* బడ్డీకొట్ల నుంచి పరిశ్రమల వరకు అన్ని కేటగిరీలకూ షాకులు
* గృహ వినియోగదారులపై ఎక్కువ భారం..
* రూ. 2,456 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధం
* స్లాబులు విభజించి వాయించారు.. సగటున 31% పెంపు
* 50 యూనిట్లలోపు వారిపైనా.. రైతులకూ పరోక్ష వడ్డన
* వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలు!
 
సాక్షి, హైదరాబాద్: 2.23 కోట్లు  - ఇది విద్యుత్ చార్జీల పెంపుభారం పడుతున్న వినియోగదారుల సంఖ్య.
 9,320 కోట్లు - కొత్త విద్యుత్ చార్జీల పేరిట ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయదలచుకున్న మొత్తం.
 గత నాలుగేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీలు పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగించనుంది. అయితే ఈసారి గృహాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు అనే తేడా లేకుండా (ఉచిత విద్యుత్ మినహా) అన్ని కేటగిరీలనూ, రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులెవర్నీ వదలకుండా చార్జీలు పెంచేందుకు సిద్ధమయింది.

ముఖ్యంగా గృహవినియోగదారులకు భారీ షాకులిచ్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజలపై ఏకంగా రూ.9,320 కోట్ల మేరకు అదనపు విద్యుత్ చార్జీల భారం మోపే దిశలో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 2014-15కు సంబంధించిన వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్‌ఆర్)లను బుధవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సమర్పించాయి. చార్జీల పెంపులో ఏ ఒక్కరినీ మినహాయించకుండా అందరికీ షాక్‌లు ఇస్తూ ‘సమన్యాయం’ పాటించింది.

గృహ వినియోగదారులు, చిన్న చిన్న బడ్డీ కొట్లు మొదలుకుని చిన్న, పెద్ద పరిశ్రమలతో పాటు తాగునీటి సరఫరా, వీధి దీపాలు, మరమగ్గాలు, బొమ్మల తయారీ వంటి కాటేజీ పరిశ్రమలపైనా చార్జీల భారం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్లు ఉన్న రైతులనూ ప్రభుత్వం వదల్లేదు. యూనిట్‌కు పైసా చొప్పున కస్టమర్ చార్జీల రూపంలో వసూలు చేయనునుంది. ఫిక్స్‌డ్, డిమాండ్, కస్టమర్ చార్జీల రూపంలో పరోక్షంగానూ వాయించేందుకు సిద్ధమైంది.

ఇక కొత్తగా ‘హార్మోనిక్ సర్‌చార్జీ’ పేరుతో పరిశ్రమల నుంచి నెల మొత్తం విద్యుత్ చార్జీలో 25 శాతం అదనంగా వసూలు చేయనుంది. ఇక గృహ వినియోగదారులకు సగటున రూ.1.20 మేరకు చార్జీలు పెంచింది. అయితే 150 యూనిట్లు దాటి వినియోగించే గృహ వినియోగదారులకు మాత్రం ఏకంగా రూ.4.87 వరకు చార్జీల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని నాలుగు డిస్కంలకు రూ.52,753 కోట్ల ఆదాయం అవసరమని తేలగా... ప్రస్తుత విద్యుత్ చార్జీల వల్ల కేవలం రూ.36,344 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని డిస్కంలు అంచనా వేశాయి.

మిగిలిన రూ.16,409 కోట్లలో ఉచిత విద్యుత్‌తో పాటు ఇతర వర్గాల సబ్సిడీ కోసం రూ. 7,089 కోట్లను సబ్సిడీగా భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగిలిన రూ.9,320 కోట్లను ప్రజలను బాది వసూలు చేయూలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే డిస్కంలు చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్‌సీకి సమర్పించాయి. జనవరిలో బహిరంగ విచారణ అనంతరం మార్చి మూడో వారంలో ఈఆర్‌సీ తుది ఆదేశాలు జారీ చేయనుంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన విద్యుత్ చార్జీలు అమల్లోకి వస్తాయి.

బడ్డీ కొట్టైనా నడ్డి విరుగుతుంది
పొట్ట కూటి కోసం చిన్న చిన్న టీస్టాళ్లు, జిరాక్స్ సెంటర్లు, బడ్డీ కొట్లను నడుపుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. లో-టెన్షన్ (ఎల్‌టీ) -2 కేటగిరీ కిందకు వచ్చే వీటి విద్యుత్ చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. వీరికి విద్యుత్ చార్జీలను యూనిట్‌కు ఏకంగా రూపాయి మేరకు పెంచుతూ డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. వాస్తవానికి వీటికి ఇప్పటికే విద్యుత్ చార్జీలు భారీగా ఉన్నాయి.

నెలకు 50 యూనిట్లలోపు వినియోగించే వారు ఇప్పటికే యూనిట్‌కు రూ.5.40 చొప్పున చెల్లిస్తున్నారు. దీనిని రూ.6.40కి పెంచారు. ఇక 50 యూనిట్లు దాటి వినియోగిస్తే... మొదటి 50 యూనిట్లకు ప్రస్తుతం రూ.6.63 చెల్లిస్తుండగా ఇక నుంచి రూ.7.63 చెల్లించాల్సి రానుంది. 51-100 యూనిట్ల వారికి రూ.7.38 నుంచి రూ.8.38కి, 101-300 వరకు రూ.8.13 నుంచి రూ.9.13కు, 301-500 యూనిట్లకు రూ.8.63 నుంచి రూ.9.63కు 500 యూనిట్లు దాటితే రూ.9.13 నుంచి ఏకంగా కూ.10.13కు చార్జీలు పెంచారు.
 
కుటీర పరిశ్రమలు ఇక కుదేలు
రాష్ట్రంలో విద్యుత్ కోతల దెబ్బకు కుటీర పరిశ్రమలు ఇప్పటికే కునారిల్లుతున్నాయి. మరమగ్గ కార్మికులు ఆత్మహత్యల బాటపడుతున్నారు. గత ఏడాదిలో కుటీర పరిశ్రమలకు ఏకంగా 66 శాతం మేరకు చార్జీలను పెంచిన ప్రభుత్వం ఈసారీ వదల్లేదు. వీటికి చార్జీలను యూనిట్‌కు 67 పైసల మేరకు పెంచింది. వ్యవసాయాధారిత పరిశ్రమలకూ షాక్‌నిచ్చింది. ఉప్పుకయ్యలు, గ్రామీణ నర్సరీలను కూడా కాటేజీ పరిశ్రమల కేటగిరీలోకి మార్చి... యూనిట్ విద్యుత్ చార్జీలను 72 పైసల మేరకు పెంచింది. పుట్టగొడుగులు, చేపలు,రొయ్యల పెంపకం, కుందేళ్ల పెంపకం, ఫ్లోరీ కల్చర్‌కు కూడా షాక్‌లు ఇచ్చింది. కేవలం కోళ్ల పరిశ్రమకు మాత్రమే చార్జీలను తగ్గించింది.
 
ఇక వీధుల్లో చీకట్లే
రాష్ట్రవ్యాప్తంగా అనేక పంచాయతీలు, మునిసిపాలిటీలు ఇప్పటికే విద్యుత్ బిల్లులు బకాయిపడి ఉన్నాయి. దీంతో డిస్కంలు కనెక్షన్లు కట్ చేస్తున్నాయి. తాజాగా పెరగనున్న చార్జీలతో ఇక వీధుల్లో చీకట్లే మిగలనున్నాయి. తాగునీటి సరఫరాకూ ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అనేక పంచాయతీల్లో తాగునీటి విద్యుత్ కనెక్షన్లకూ బకాయిల భారం వెన్నాడుతోంది. దీంతో తాగునీటికి కూడా కొన్ని పంచాయతీలల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. వీధి దీపాలకు యూనిట్ విద్యుత్ చార్జీలు 0.38 నుంచి 0.93 రూపాయల మేరకు పెరగగా, తాగునీటి సరఫరాకు రూ. 1.29 నుంచి రూ.1.43 వరకు పెరిగాయి.
 
పరిశ్రమలకు పెను ముప్పు
గత రెండు సంవత్సరాలుగా అమలవుతున్న విద్యుత్ కోతలతో రాష్ట్రంలో పారిశ్రామికరంగం పెనుప్రమాదంలో పడింది. వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. వందలాది పరిశ్రమలు బ్యాంకులకు రుణాలు చెల్లించలేక నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మారిపోయాయి. కొన్ని పరిశ్రమల ముందు టు-లెట్ బోర్డులు వెలిశాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు.  గత నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాదిలో కూడా పరిశ్రమలను ప్రభుత్వం వదల్లేదు. యూనిట్‌కు 28 పైసల నుంచి 51 పైసల వరకూ పెంచింది.

చెరకు క్రషింగ్ యూనిట్లకైతే ఏకంగా యూనిట్ చార్జీని రూ.4.63 నుంచి రూ.7.03కి అంటే ఏకంగా రూ.2.40 పెంచింది. భారీ పరిశ్రమలకూ ప్రభుత్వం భారీగానే షాక్‌లు ఇచ్చిం ది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను కూడా హెచ్‌టీ-1 కేటగిరీలోకి చేర్చుతూ ప్రతిపాదనలు సమర్పించిన ప్రభుత్వం... వీటి విద్యుత్ చార్జీలను యూనిట్‌కు 83 పైసల వరకు పెంచింది. ఇక భారీ వాణిజ్య సంస్థ లు, మల్టీప్లెక్స్‌లు, విమానయాన సంస్థలతో పాటు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు కూడా యూనిట్‌కు 50 పైసల చొప్పున చార్జీలను పెంచాలని  నిర్ణయించాయి.
 
పరోక్ష చార్జీలూ పెరిగాయ్
విద్యుత్ చార్జీల పెంపుతో ప్రత్యక్షంగా చెల్లించే విద్యుత్ చార్జీలతో పాటు డిమాండ్, ఫిక్స్‌డ్, కస్టమర్ వంటి పరోక్షచార్జీలనూ ఎల్‌టీ-2 కేటగిరీలోని చిన్న చిన్న వాణిజ్య సంస్థలు ప్రస్తుతం కిలోవాట్‌కు రూ.50 చెల్లిస్తుండగా... ఇక నుంచి రూ.100 చెల్లించాల్సి రానుంది. ఎల్‌టీ కేటగిరీలోని పరిశ్రమలు, సీజనల్ పరిశ్రమలకు కూడా కిలోవాట్‌కు రూ.50 నుంచి రూ.100కు పెంచారు. చెరకు క్రషింగ్ యూనిట్లకు ఫిక్స్‌డ్ చార్జీలు కిలోవాట్‌కు రూ.20 నుంచి రూ.60కి పెరగనున్నాయి.

కాటేజీ పరిశ్రమలకు రూ.20 నుంచి రూ. 40కు పెంచేందుకు ప్రతిపాదించాయి. పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు ఒక హెచ్‌పీకి ప్రస్తుతం ఫిక్స్‌డ్ చార్జీలు రూ.30 చెల్లిస్తుండగా... వీటిని రూ.60కి పెంచారు. భారీ పరిశ్రమలు, భారీ వాణిజ్య సంస్థలు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు కేవీఏకు రూ. 350 నుంచి ఏకంగా రూ. 600కు పెంచారు. అంటే కేవీఏకు ఏకంగా రూ. 250 పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. కస్టమర్ చార్జీలు కూడా పెరగనున్నాయి.
 
పేదలు, మధ్యతరగతే సమిధలు..!
ప్రతిపాదిత విద్యుత్ చార్జీలను గమనిస్తే ప్రభుత్వం గృహ వినియోగదారులపై కక్ష కట్టిందా అన్పించక మానదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు కూడా విపరీతంగా చార్జీలు పెంచేసింది. గృహ వినియోగదారులకు 100 యూనిట్లకు ఉన్న స్లాబును 50 యూనిట్లుగా విభజించి గతంలో చార్జీలను పెంచిన ప్రభుత్వం... ఈసారి దాన్నీ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఎల్‌టీ-1 కిందకు వచ్చే గృహ వినియోగదారులను ఎల్‌టీ 1(ఏ) నుంచి 1 (డీ) వరకూ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ప్రతి కేటగిరీలో చార్జీలను వేర్వేరుగా నిర్ణయించింది.

నెలకు 50 యూనిట్లలోపు వినియోగించేవారిని ఎల్‌టీ-1(ఏ) కేటగిరీ కింద చేర్చింది. వీరికి చార్జీలను యూనిట్‌కు రూ.1.45 నుంచి రూ.1.95కు పెంచింది. అంటే 50 పైసలు పెంచిందన్నమాట. ఇక 100 యూనిట్లు వినియోగించేవారిని ఎల్‌టీ1(బీ) కింద చేర్చి మొదటి 50 యూనిట్లకు రూ.2.60 చొప్పున 51-100 యూనిట్లకు రూ.3.25 చొప్పున వసూలు చేయనుంది. ఇక 150 యూనిట్లు వాడితే తొలి 50 యూనిట్లకు రూ. 3.10, 51-100 యూనిట్లకు రూ.3.75, 101-150 యూనిట్లకు రూ.5.38 చొప్పున వసూలు చేయూలని నిర్ణయించింది.

ఇక నెలకు 150 యూనిట్లు దాటితే మాత్రం నడ్డి విరిగేలా వడ్డించేందుకు సర్కారు సిద్ధమైంది. మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు ఏకంగా రూ.6.32 చొప్పున, 201-250 యూనిట్లకు రూ.6.94, 251-300కు రూ.7.55, 301-400కు రూ.8.16, 401-500 యూనిట్లకు ఏకంగా రూ.8.77 చొప్పున వసూలు చేయనుంది. ఇక 500 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ.9.38 చొప్పున వసూలు చేయనున్నారు. ఈ విధంగా కేటగిరీలను విభజించి వాయించడం ద్వారా ఒక్క గృహ వినియోగదారుల నుంచే రూ.2,456 కోట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసింది.

200 యూనిట్లైతే రెట్టింపు చార్జీ!
112.6% మేర పెంపు

గృహ వినియోగదారులకు చార్జీల పెంపులో ప్రభుత్వం ప్రధానంగా పేదలు, మధ్యతరగతి వర్గాలనే లక్ష్యంగా చేసుకుంది. సుమారు 2 కోట్ల గృహ వినియోగదారుల్లో ఈ వర్గాలకు చెందిన కోటిన్నర మందిని లక్ష్యంగా చేసుకుని చార్జీలను భారీగా పెంచింది. ప్రధానంగా 200 యూనిట్లలోపు వినియోగించే పేద, మధ్యతరగతి వారిని భారీగా బాదేసింది. తాజా చార్జీల పెంపు ప్రతిపాదనలు పరిశీలిస్తే... 50 యూనిట్ల వారు ప్రస్తుతం నెలకు రూ.72.50 చెల్లిస్తుంటే (ఇతర చార్జీలను మినహాయించి) తాజా ప్రతిపాదనలతో రూ.97.50 మేరకు చెల్లించాల్సి రానుంది. అంటే 34% మేరకు చార్జీలను పెంచారన్నమాట.

ఇక 100 యూనిట్లలోపు వినియోగించే వారికి ఏకంగా 69% పెంచగా... 200 యూనిట్లు వినియోగించే మధ్యతరగతి వారి నెల బిల్లు ఏకంగా రూ.600 నుంచి రూ.1276 (112.6%)కు పెరగనుంది. అదే పెద్దల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. 500 యూనిట్లు వాడే వినియోగదారులు ప్రస్తుతం రూ.3,007 చెల్లిస్తుండగా... ఈ మొత్తం కేవలం రూ.3,693.50కు మాత్రమే పెరగనుంది. అంటే పెరుగుదల శాతం 26.92 మాత్రమే.
Share this article :

0 comments: