బిల్లు పెడితే సోనియాగాంధీ వెళ్లిపోతారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిల్లు పెడితే సోనియాగాంధీ వెళ్లిపోతారా?

బిల్లు పెడితే సోనియాగాంధీ వెళ్లిపోతారా?

Written By news on Monday, December 2, 2013 | 12/02/2013

కాలర్ పట్టి అడిగితే ఏం చెబుతావ్?వీడియోకి క్లిక్ చేయండి
  • నీళ్ల కోసం రైతులు, ఉద్యోగాల కోసంయువత నిలదీస్తే ఏం సమాధానం ఇస్తావు?
  •  సమైక్య శంఖారావంలో చంద్రబాబుపై జగన్ నిప్పులు
  •  రాష్టం కలసి ఉన్నప్పుడే పై రాష్ట్రాల నుంచి చుక్కనీరు రావడం లేదు
  •  ఇక మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీరే
  •  మనదేశం కానివారంతా వారి దేశాలకు వెళ్లిపోవాలంటే సోనియా వెళ్తారా?
  •  30 ఏళ్లకే మీకంత వ్యామోహముంటే 60 ఏళ్లుగా కలిసున్న మమ్మల్నెలా విడదీస్తారు?
  •  హైదరాబాద్‌లో ప్రతి ఊరి నుంచి కనీసం 100 మంది ఉంటున్నారు
  •  చిరు ఉద్యోగాలు చేస్తూ.. లోన్లు తీసుకుని ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఇళ్లు కట్టుకున్నారు.. విభజన తర్వాత వాటి విలువ పడిపోతే ఆ నష్టాన్ని సోనియా భర్తీ చేస్తారా?
  •  రాష్ట్ర సమైక్యాన్ని కోరుతూ ఢిల్లీకి లేఖ రాయవెందుకు చంద్రబాబూ?
  •  డ్రామాలాడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. అసెంబ్లీని సమావేశపరిచి
  •  సమైక్య తీర్మానం ఎందుకు చేయడం లేదు?
కుప్పం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే పై రాష్ట్రాల నుంచి మనకు చుక్కనీరు రాని పరిస్థితి ఉంది. ఇక మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీరు తప్ప మంచినీరు ఎక్కడుంటుంది? చంద్రబాబూ.. రాష్ట్రం విడిపోతే మా పంటలకు నీరు ఎక్కడ్నుంచి వస్తుందని రైతులు నీ కాలర్ పట్టుకొని అడిగితే ఏం సమాధానం చెబుతావ్? గాలేరు-నగరి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, బీమా, కోయిల్‌సాగర్ లాంటి ప్రాజెక్టులకు నీళ్లెలా వస్తాయని నిలదీస్తే ఏం సమాధానం చెబుతావ్? పదేళ్లలో హైదరాబాద్‌ను వదిలి వె ళ్లిపొమ్మంటున్నారు.. అదే జరిగితే ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని యువత అడిగితే ఏం సమాధానం చెబుతావ్?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.
 
ఓట్లు, సీట్ల కోసం, తన కుమారుడిని ప్రధానిని చేయడం కోసం రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబుకు, సమైక్యం పేరుతో డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి జనం ఘోష వినిపించడం లేదా? అని నిలదీశారు. ప్రజలంతా రాష్ట్రం కలిసే ఉండాలని కోరుకుంటే చంద్రబాబు నోటి వెంట ‘సమైక్యం’ అన్న మాట కూడా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం రెండోరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి మొదలై పలమనేరు నియోజకవర్గం వరకు సాగింది. జగన్ వస్తే ప్రజలంతా తలుపులు మూసుకొని ఇళ్లలోనే ఉండి నిరసన తెలపాలని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పిలుపును పక్కనపెట్టి ప్రజలు తమ గుండె వాకిళ్లు తెరుచుకొని జననేతకు స్వాగతం పలికారు. గ్రామాలకు గ్రామాలు కదిలి రోడ్లపైకి వచ్చాయి. కడపల్లి, శాంతిపురం, కనుమలదొడ్డి గ్రామాల ప్రజలు మంగళ హారతులతో జగన్‌కు స్వాగతం పలకగా.. రామకుప్పం గ్రామస్థులు పట్టుబట్టి జగన్‌ను తమ ఊరికి తీసుకువెళ్లారు. ప్రజలు అడుగడుగునా అభిమానం చూపడంతో పలమనేరు నియోజకవర్గం వి.కోట మండల కేంద్రంలో బహిరంగ సభ 6 గంటలు ఆలస్యంగా జరిగింది. ఇక్కడికి తరలివచ్చిన ప్రజలను  ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

 
 ప్రజల గుండె చప్పుడు తెలుసుకోలేరా?
 ‘పాలకులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేయాలి. ఓటు కావాలంటే ప్రజల్లోకి వెళ్లి ప్రతి పేదవాని గుండె చప్పుడు వినాలి. ప్రతి పేదవాని మనసెరిగి పనిచేయాలి. కానీ ఈరోజు రాజకీయాలు ఎలా చేస్తున్నారంటే.. ప్రజల జీవితాలతో చదరంగం ఆడుతున్నారు. ఇలా చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి.. ఇలా విభజిస్తే ఎన్ని సీట్లు వస్తాయి.. ఒక మనిషిని తీసుకొనిపోయి జైల్లో పెడితే ఇంకెన్ని ఓట్లు వస్తాయని ఈ పాలకులు ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రజలకు జరుగబోయే నష్టాలు వీళ్లకు తెలుసా? ఒకవేళ తెలిసినా కళ్లున్న కబోదుల్లాగా ఉంటున్నారా? ఒక్కసారి కృష్ణా నదినే చూడండి. ఈరోజు రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే చుక్కనీరు రావడం లేదు. మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండితేనే గానీ కిందికి నీళ్లు వదలని పరిస్థితి ఉంది. ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉన్నా పై రాష్ట్రాలు మన కు చుక్కనీరు వదలని పరిస్థితి ఉంటే ఇక మధ్యలో ఇంకో రాష్ట్రాన్ని పెడితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్లు తప్ప మంచినీరు ఎక్కడుంటుంది? రాష్ట్రం విడిపోతుందనే ఊహాగానాల మధ్య బ్రిజేష్ కుమార్ టిబ్యునల్ తీర్పు చెప్పింది. రాష్ట్రం విడిపోతుందనే సంకేతాలు వస్తున్నాయి, ఇక అడిగే వారే లేర ని కృష్ణాలో మిగులు జలాల మీద మనకున్న హక్కులను పొరుగు రాష్ట్రాలకు పంచేసింది. నికర జలాల్లో వాళ్ల కోటాను పెంచింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఈ పాలకులు, బాబు.. సోనియాగాంధీని ఏమీ అనరు! చనిపోయిన దివంగత నేత వైఎస్సార్ మీద బురదజల్లటానికి ప్రయత్నం చేస్తారు. మిగులు జలాలు అందకపోతే  హంద్రీ-నీవాకు, గాలేరు న గరి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌కు ఎక్కడ్నుంచి నీళ్లు వస్తాయని అడగాల్సింది పోయి ఈ చంద్రబాబు.. ప్యాకేజీలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు.
 
 వారికి జరిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు?
 హైదరాబాద్‌ను పదేళ్లలో వదిలి వెళ్లిపొమ్మని శాసిస్తున్నారు. ప్రజలంతా 60 ఏళ్లుగా కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడు వెళ్లిపొమ్మంటే చదువుకున్న ప్రతి పిల్లవాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని సోనియాగాంధీని, కిరణ్‌కుమార్‌రెడ్డిని, చంద్రబాబును అడుగుతున్నా. అభివృద్ధిలో హైదరాబాద్ ఎప్పుడూ మూడు,, నాలుగో స్థానంలో ఉండేది. వైఎస్సార్ బతికున్న రోజుల్లో కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టేవి. ఏడాదికి 57 వేల మంది విద్యార్థులకు క్యాంపస్ ఉద్యోగాలు దక్కేవి. గత మూడేళ్లుగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు 57 వేల నుంచి 25 వేలకు తగ్గిపోయింది. ఎక్కడైనా రాష్ట్రం బాగుపడాలంటే ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులు, సముద్ర తీరాలు అన్నీ  కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కానీ తీరప్రాంతాన్ని ఒకరికి, రాజధానిని ఒకరికి ఇచ్చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు ప్రతి గ్రామం నుంచి కనీసం 100 మందికి తక్కువ కాకుండా హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పులు చేసి, బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ప్లాట్లు కొనుకున్నారు. ఇళ్లు కట్టుకున్నారు. విభజన చేస్తే వాళ్లు కొనుక్కున్న ఇళ్లకు, ప్లాట్లకు విలువలు పడిపోతే ఆ నష్టాన్ని సోనియాగాంధీ భర్తీ చేస్తారా? సమైక్య డ్రామాలాడుతున్న కిరణ్, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు భర్తీ చేస్తారా? రాష్ర్ట్ర ఆదాయంలో 55 నుంచి 60 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుంది. ఆ ఆదాయం రాకపోతే ఉద్యోగుల జీతాలకు డబ్బులు ఎక్కడ్నుంచి తెచ్చిస్తారు?
 
 బిల్లు పెడితే సోనియాగాంధీ వెళ్లిపోతారా?
సోనియాగాంధీ 1968 ముందు ఎవరో? ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. రాజీవ్‌గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత 1983వ సంవత్సరంలో దేశ పౌరసత్వం తీసుకున్నారు. ఇప్పటికి 30 సంవత్సరాలుగా మనలో ఒక్కరిగా, భారతీయురాలిగా కలిసిపోయారు. ఇవాళ  ఎవరైనా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, మన దేశం కానీవాళ్లందరూ తిరిగి వెళ్లిపోవాలంటే మీకు ఎలా ఉంటుంది? అలా అంటే కాంగ్రెస్ నేతలంతా కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోరా? 30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే.. 60 ఏళ్లుగా కలిసి బతుకుతున్న మమ్ముల్ని వేరు చేస్తామంటే మాకెలా ఉంటుంది?
 
మద్దతిస్తుంది బాబు.. పోరాటం చేస్తుంది జగన్..
1955లో తెలుగు జాతిని ఒక్కటి చేయడానికి హైదరాబాద్ స్టేట్‌కు చెందిన బూర్గుల రామకృష్ణారావు గారు తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. ఆవేళ 177 మంది ఎమ్మెల్యేలలో 147 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై 103 మంది విశాలాంధ్రకు అనుకూలంగా ఓటేశారు. ఇటు ఆంధ్రరాష్ట్రఅసెంబ్లీలో కూడా విశాలాంధ్ర కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ చరిత్రను మరిచిపోయి ఈరోజు ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. ప్రజలంతా ముక్తకంఠంతో సమైక్యాన్ని కోరుకుంటే చంద్రబాబూ.. మీరు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు లేఖ ఇవ్వడం లేదు. కనీసం సమైక్యం అన్న మాట కూడా మీ నోటి నుంచి ఎందుకు పలకరు? ఓవైపు రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియాగాంధీకి మద్దతు తెలుపుతూనే మరోవైపు నేను కుమ్మక్కయ్యానని నిందలు వేస్తారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు? రాష్ట్ర విభజనలో సోనియాకు మద్దతిస్తున్నది మీరు కాదా? ఆ సోనియాగాంధీతో పోరాటం చేస్తుంది జగన్‌మోహన్‌రెడ్డి కాదా? వైఎస్సార్ చనిపోయిన 18 నెలల తర్వాత కాంగ్రెస్ నేతలతో కలిసి కోర్టుల దాకా వెళ్లి నాపై కేసులు వేసింది మీరు కాదా? ఎఫ్‌డీఐ ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో మీ ఎంపీలను గైర్హాజరు పరిచి కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది మీరు కాదా? మొన్న అసెంబ్లీలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాసం పెడితే.. విప్ జారీ చేసి మరీ సర్కారును కాపాడింది మీరు కాదా?
 
 అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయరు?
 సమైక్యం అంటూ సీఎం గొప్పగా డ్రామాలు ఆడుతారు. రాష్ట్రాన్ని విభజించాలంటే చాలు అధికారులందరినీ పంపించి సోనియా ఆదేశాల మేరకు సహకరిస్తావు. చంద్రబాబు విభజించండి.. అని ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తే.. మీరు ఢిల్లీ నుంచి వచ్చి ఉద్యోగులను భయపెట్టించి సమ్మెను విరమింపజేస్తారు. సమైక్యాన్ని కోరితే అసెంబ్లీని వెంటనే ఎందుకు సమావేశపర్చడం లేదు? అసెంబ్లీలో సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు తీర్మానం చేయడం లేదు?
 
తెలుగువాడు కన్నెర్ర చేస్తే..
ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి, ఢిల్లీ పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరాటం. తెలుగువాడు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఢిల్లీకి తెలియాలి. వచ్చే ఎన్నికల్లో 30 పైచిలుకు ఎంపీ స్థానాలను గెలుచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం. ఢిల్లీ పెద్దలకు కాస్త చెవుడు.. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటికి గట్టిగా సమాధానాలు చెప్పాలి. తెలుగు జాతిని విడదీస్తామంటే ఒప్పుకుంటారా... (లేదు.. లేదు అంటూ జన స్పందన). ఢిల్లీవారికి తెలుగులో చెబితే అర్థం కాదు.. ఇంగ్లిషులో ‘నో’ అని చెప్పండి.. (నో.. నో అంటూ జనం). నీటి కోసం మనలో మనమే కొట్టుకొని చావాలా? (జనం: నో..నో..). మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకొని చావాలా? (జనం: నో.. నో..). రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియాను, అందుకు సహకరిస్తున్న కిరణ్‌ను, చంద్రబాబును క్షమించాలా? (నో.. నో.. అంటూ పెద్ద పెట్టున జనం నినాదాలు). ఇప్పటికైనా వారికి బుద్ధి రావాలి. జై సమైక్యాంధ్ర.. జై తెలుగుతల్లీ.. జై వైఎస్సార్!!’
Share this article :

0 comments: