అబద్ధాల్లో బాబు గిన్నిస్ రికార్డ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అబద్ధాల్లో బాబు గిన్నిస్ రికార్డ్

అబద్ధాల్లో బాబు గిన్నిస్ రికార్డ్

Written By news on Tuesday, April 29, 2014 | 4/29/2014

‘సాఫ్ట్‌వేర్’ అభివృద్ధి  తన ఘనతే అని చెప్పుకుంటున్నాడు..
ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఈ రంగంలో రాష్ట్రం ఐదో స్థానానికి పడిపోయింది
ఎప్పుడు ఎన్నికలొస్తే అప్పుడు  ఈయన శంకుస్థాపనలతో మోసం చేశాడు..
వైఎస్ హయాంలోనే ఫైఓవర్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, రింగ్‌రోడ్డు సాకారం..
పేదరికానికి ప్రాంతీయ బేధం లేదు.. ప్రాంతమేదైనా పేదల సంక్షేమమే వైఎస్‌ఆర్ సీపీ ధ్యేయం..
సీమాంధ్ర సీఎంగా చేపట్టబోయే పథకాలన్నీ తెలంగాణలోనూ అమలయ్యేందుకు కృషి చేసా

 
 
హైదరాబాద్: ‘‘అబద్ధాలు చెప్పడంలో టీడీపీ అధినేత చంద్రబాబు పేరును గిన్నిస్ బుక్‌లో చేర్చాల్సి ఉంది. చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతూ నిజమని నమ్మించడంలో చంద్రబాబును మించిన ఘనుడు లేడు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, సాఫ్ట్‌వేర్ రంగంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చానని పదే పదే చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు. వాస్తవం ఏమిటంటే.. చంద్రబాబు పాలనలోకి రాకముందు సాఫ్ట్‌వేర్ రంగంలో దేశంలో మన రాష్ట్రం మూడోస్థానంలో ఉండేది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో మన రాష్ట్రం ఐదో స్థానానికి పడిపోయింది. ఈ వాస్తవాన్ని మరుగున పరచి అబద్ధాలతో జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు.

సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించి పలు చోట్ల ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా నగర ప్రజలు పెద్ద సంఖ్యలో జగన్ సభలకు హాజరయ్యారు. వివిధ సభల్లో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

 అబద్ధాల్లో బాబుకు సాటెవ్వరు?

అక్షరాస్యత, శిశు మరణాలు, పేదరికం.. ఇలా పలు రంగాల్లో మన రాష్ట్ర పరిస్థితి చంద్రబాబు హయాంలో ఎంతో దిగజారింది. తన తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎయిర్‌పోర్ట్, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డులతో పాటు దేవాదుల, అలీ సాగర్ ప్రాజెక్టులు కూడా తన హయాంలోనే రూపుదిద్దుకున్నాయని చెప్పిన అబద్ధాలనే పదే పదే చెపుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. ఆయన హయాంలో రెండుసార్లు ఎన్నికలు వస్తే ప్రాజెక్టులకు రెండుసార్లు శంకుస్థాపనలు చేసిన ఘనుడు ఆయనే. ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేయడం.. అధికారంలోకి వస్తూనే వాటిని గాలికి వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. పాడి పంటలతో రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయడమే కాదు.. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాజధాని నగరంలో ఫ్లైఓవర్లు, రింగ్‌రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. ఓటు వేసే ముందు మోసగాళ్ల మాటలకు మోసపోకుండా దివంగత నేత చేసి చూపిన అభివృద్ధిని గమనించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి.
 
పేదరికానికి ప్రాంతం లేదు..

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదవాడి గుండె చప్పుడు వినడంలో.. పేదవాని కష్టసుఖాలను పంచుకోవడంలో.. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించేవారు. అదే స్ఫూర్తితో తెలంగాణలోని ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతంలో అమలు చేయబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్నీ తెలంగాణలో కూడా అమలు చేసేందుకు వైఎస్‌ఆర్‌సీపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతుంది. దివంగత నేత వైఎస్‌ను అభిమానించే లక్షలాది హృదయాలను దూరం చేసుకునే సమస్యే లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలంగాణలో కూడా ‘సువర్ణయుగాన్ని’ సాధించుకుందాం. అందుకోసం ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం.

కుళ్లు, కుట్రల రాజకీయాలకు చరమగీతం...

దివంగత నేత వైఎస్ కన్నా ముందు, తర్వాతా చాలామంది ముఖ్యమంత్రులను చూశాం. అయితే ఒక్క వైఎస్‌ను మాత్రమే ‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి’ అని ప్రాంతాలకు అతీతంగా ప్రతి పేదవాడూ గుర్తుంచుకున్నాడు. పేదవాడి గుండె చప్పుడు విన్న నేత వైఎస్ ముఖ్యమంత్రిగా వైఎస్ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలే అందుకు కారణం. వైఎస్ కన్నా ముందు రాష్ట్రంలో భయానక పాలన సాగింది. ఆ భయానక పాలనలో పేదవాడు కనీసం రేషన్ కార్డుకు కూడా నోచుకోని పరిస్థితి. తలసరి కనీస ఆదాయం రూ.24 వేలు మించితే వారికి తెల్ల రేషన్ కార్డు వచ్చేది కాదు. వైఎస్ అధికారంలోకి రాగానే ఆ కనీస ఆదాయ పరిమితిని రూ.72 వేలకు పెంచారు. ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని, ప్రతి పేద కుటుంబంలో ఒకరైనా పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ను ప్రవేశపెట్టారు.

రామరాజ్యమయితే నేను చూడలేదు కానీ వైఎస్ సువర్ణ పాలన చూశానని గర్వంగా చెప్పగలను. వైఎస్ మన నుంచి దూరమయ్యాక రాష్ట్రంలో పేదవాడికోసం ఆలోచించే నాయకుడే లేకుండా పోయాడు. ఆయన మరణానంతరం ఆరోగ్యశ్రీ పరిధి నుంచి 133 రోగాలను కాంగ్రెస్ సర్కారు తొలగించింది. ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ను రూ.35 వేలకు పరిమితం చేసి పేద విద్యార్థులు వైద్యులు, ఇంజనీర్లు కాకుండా అడ్డుకుంటున్నారు. అస్తవ్యస్త కాంగ్రెస్ పాలన, ఓట్లు, సీట్ల కోసం అబద్ధాలు ఆడుతున్న నేతలు, కుళ్లు రాజకీయాలు చేస్తున్న నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత రాజకీయాల్లో మాటమీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు. రాజకీయాల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థమే లేకుండా పోయింది. చెడిపోయిన ఈ వ్యస్థలో సమూల మార్పులు తేవాల్సి ఉంది.’’

 సోమవారం నగరంలో జరిగిన జగన్ రోడ్‌షో, సభల్లో జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజవర్గాల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కోటంరెడ్డి వినయ్‌రెడ్డి, పీజేఆర్ కుమార్తె పి.విజయారెడ్డి, కొలన్ శ్రీనివాస్‌రెడ్డి, మాల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు దినేష్‌రెడ్డి, సయ్యద్ సాజిద్‌అలీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు సురేష్‌రెడ్డి, ఎస్‌సీ సెల్ నేత ఎన్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

జీవో 166 కింద ఇళ్ల క్రమబద్ధీకరణ


‘‘గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఫిలింనగర్ 18 బస్తీలతో పాటు, బంజారాహిల్స్‌లోని ఎన్బీటీనగర్, సింగాడికుంట, ఎంఎస్.మక్తా, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అన్ని బస్తీల్లో జీవో 166 కింద ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం కృషి చేయడమే మా మొదటి ప్రాధాన్యత. ఇళ్ల రెగ్యులరైజేషన్ కోసం ఎలాంటి పోరాటానికైనా వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉంటుంది. అలాగే బడుగు, బలహీన వర్గాలకు పక్కా ఇళ్లు నిర్మించే బాధ్యతను కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.’’

సమయం ముగిసిపోవడంతో...

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రోడ్‌షో నిర్వహించారు. భారీ ఎత్తున హాజరైన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. షెడ్యూల్ ప్రకారం జగన్ సోమవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే ఎల్బీనగర్‌లో రోడ్‌షో ముగించుకుని ఆయనఇబ్రహీంపట్నం చేరుకునేలోగా ప్రచార గడువు సమయం పూర్తయిపోయింది. అయినప్పటికీ అభిమాన నేత కోసం భారీ సంఖ్యలో అభిమానులు సభా ప్రాంగణంలోనే నిరీక్షించారు.

సమయం మించిపోవడంతో సభా స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. దీంతో సభకు వచ్చిన అశేష జనవాహిని సభా ప్రాంగణం నుంచి రహదారిపైకి రాగానే జగన్ అక్కడికి చేరుకున్నారు. తన కోసం నిరీక్షించిన పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నిరాశ చెందకుండా జగన్ తన వాహనంలో నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. తర్వాత దారి పొడవునా బారులు తీరిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. మాట్లాడాలని అభిమానులు, కార్యకర్తలు కోరగా వాచ్‌ను చూపిస్తూ సమయం మించిపోయిందని సంకేతాలిచ్చారు. జగన్‌ను చూసిన అభిమానులు ఒక్క ఉదుటన వాహనంవైపు దూసుకురాగా వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. కాగా ఎల్బీనగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్, రహదారి మరమ్మతుల కారణంగా జగన్ ఇబ్రహీంపట్నం చేరుకునేందుకు ఆలస్యమైంది.
Share this article :

0 comments: