బాబు నాటకమే నాట్ బిఫోర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు నాటకమే నాట్ బిఫోర్

బాబు నాటకమే నాట్ బిఫోర్

Written By ysrcongress on Tuesday, December 13, 2011 | 12/13/2011

* బాబు అక్రమాస్తుల కేసుపై సుప్రీంలో విజయమ్మ పిటిషన్
* ‘నాట్ బిఫోర్’ల ద్వారా చంద్రబాబు తదితరులు నిష్పాక్షిక విచారణపై అనుమానాలు రేకెత్తిస్తున్నారు
* పలు ధర్మాసనాల ముందు ‘నాట్ బిఫోర్’లుగా ఉన్న న్యాయవాదులతో వకాలత్‌లు దాఖలు చేయించారు
* తమకు కావాల్సిన బెంచ్ కోసం వారిని వాడుకున్నారు
* విచారణ జరుగుతున్న తీరును చూస్తుంటే బాబు తదితరులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఉంది
* హైకోర్టులో నిష్పాక్షిక విచారణ జరిగే పరిస్థితులు లేవు
* అలాంటప్పుడు కేసును బదిలీ చేయవచ్చునని సుప్రీం చెప్పింది.. న్యాయం బతకాలంటే మరో హైకోర్టుకు బదిలీ చేయండి

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: చంద్రబాబు, ఆయన బినామీల అక్రమాస్తుల కేసును నిష్పాక్షిక విచారణ కోసం మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబునాయుడు, సీఎం రమేష్ తదితరులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ‘నాట్ బిఫోర్ నాటకాలతో’ నిష్పాక్షిక విచారణపై అనుమానాలు రేకెత్తించారని, తద్వారా ప్రజా ప్రయోజనాలకు తీరని నష్టం వాటిల్లుతోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

‘న్యాయమూర్తులు జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ వి.వి.ఎస్.రావు, జస్టిస్ గోడా రఘురాం, జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డిలకు నాట్ బిఫోర్‌గా ఉన్న సి.రామచంద్రరాజు, డి.శ్రీనివాసరావు, హరేంద్రప్రసాద్‌ల చేత సీఎం రమేష్, చంద్రబాబు బంధువు నాగరాజనాయుడు, మురళీమోహన్ వకాలత్‌లు దాఖలు చేయించారు. తద్వారా జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహనరావు తదితర ధర్మాసనాల ముందుకు తమ పిటిషన్లు విచారణకు రాకుండా చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనూహ్యంగా రంగంలోకి వచ్చింది. ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాక ఆశ్చర్యకరంగా సీబీఐ విచారణ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. వాస్తవానికి రిలయన్స్‌కు వ్యతిరేకంగా హైకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ కేసులో రిలయన్స్ ఇంప్లీడ్ కావడం.. ఉత్తర్వులను రద్దు చేయాలని కోరడం ద్వారా చంద్రబాబు-రిలయన్స్‌ల మధ్య ఉన్న సంబంధం రుజువైంది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడంతో తనకు రిలయన్స్‌లో వాటాలు ఉన్నందున కేసును విచారించడం సబబుగా ఉండదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. అయితే సీఎం రమేష్ తదితరులు నాట్ బిఫోర్‌లను అడ్డం పెట్టుకుని ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో కేసు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, జస్టిస్ కె.ఎస్.అప్పారావులతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ బెంచ్ మాత్రమే కాకుండా జస్టిస్ గులాం మహ్మద్-జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి-జస్టిస్ ఆర్.కాంతారావు, జస్టిస్ వి.వి.ఎస్.రావు-జస్టిస్ బి.ఎన్.రావు నల్లా, జస్టిస్ గోడా రఘురాం-జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి, జస్టిస్ ఎన్.వి.రమణ-జస్టిస్ పి.దుర్గాప్రసాద్‌లతో కూడిన ధర్మాసనాలు కూడా కేసులను విచారిస్తున్నాయి’. 

‘జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉండటంతో ఆయన నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును వినకూడదని మేం అభ్యంతరం లేవనెత్తాం. దీంతో ఆ ధర్మాసనం ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంది. కానీ హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న తీరును చూస్తుంటే చంద్రబాబు తదితరులు కేసు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాక చంద్రబాబు భార్య, కుమారుడు, ఆయన ప్రధాన లబ్ధి దారు సుజనాచౌదరిలు ఇంతవరకు వెకేట్ పిటిషన్లు దాఖలు చేయలేదు. ఇది కూడా ఒక పథకం ప్రకారం జరుగుతున్నదే. పరిస్థితులను బట్టి, కోర్టులను బట్టి న్యాయవాదులను ఎంపిక చేసుకునేందుకు వీలుగా వారు పిటిషన్లు దాఖలు చేయలేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఆశ్రీత పక్షపాతంతో కుటుంబసభ్యులకు లబ్ధి చేకూర్చిన చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో విచారణను అడ్డుకునేందుకు ఈ విధంగా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు. తమ చర్యల ద్వారా న్యాయప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టులో నిష్పాక్షిక విచారణ జరిగే పరిస్థితులు లేవు. కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే.. కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాలి. నిష్పాక్షిక విచారణకు పరిస్థితులు అనుకూలంగా లేకుంటే మరో కోర్టుకు కేసును బదిలీ చేయవచ్చునని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులు ఇచ్చింది. నిష్పాక్షిక విచారణను, తీర్పును అడ్డుకునేందుకు చంద్రబాబు, ఆయన సహాయకులు సమస్యలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతున్నాం. ప్రజా ప్రయోజనాలు నిలబడి, న్యాయం బతకాలంటే ఈ కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని విజయమ్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Share this article :

0 comments: