అవ్వా, తాతలపింఛన్లు ఎలా ఊడగొడదామా అని చూస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవ్వా, తాతలపింఛన్లు ఎలా ఊడగొడదామా అని చూస్తున్నారు

అవ్వా, తాతలపింఛన్లు ఎలా ఊడగొడదామా అని చూస్తున్నారు

Written By ysrcongress on Friday, December 16, 2011 | 12/16/2011


*పేదల పథకాలను ఎలా కత్తిరిద్దామా అని ఆలోచిస్తున్నారు
*అవ్వా, తాతలపింఛన్లు ఎలా ఊడగొడదామా అని చూస్తున్నారు

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మానవత్వం లేని పాలకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిరుపేదల సంక్షేమ పథకాలను ఎలా కత్తిరిద్దామా అని ఆలోచిస్తున్నారు. పదిశాతం బతికే అవకాశం ఉన్నా సరే.. డబ్బులవైపు చూడకుండా లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను సైతం ఉచితంగా చేసి పేదవాళ్లకు ప్రాణం పోయాలని వైఎస్సార్ కోరుకుంటే... ఆరోగ్యశ్రీ పథకంలోని వ్యాధులను పది శాతానికి ఎలా కత్తిరిద్దామా? అని ఈ ప్రభుత్వం కత్తెర పట్టుకొని తిరుగుతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 43వ రోజు గురువారం ఆయన తాడికొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఒక్క పొన్నూరు గ్రామంలోనే ఐదు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

వైఎస్ స్వప్నం ఆరోగ్యశ్రీ
దివంగత నేత ఒక స్వప్నాన్ని చూశారు. తనకు ఆరోగ్యం బాగా లేకపోతే తాను వెళ్లి ఎంత పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుంటారో..! అదే ఆసుపత్రికి ప్రతి పేదవాడు కూడా ధైర్యంగా వచ్చి తన బెడ్డు పక్కనే వైద్యం చేయించుకోవాలని వైఎస్సార్ కలలుగన్నారు. అందుకోసం ఆరోగ్య శ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. పేదవాడు బతికేందుకు పది శాతం అవకాశం ఉన్నా.. లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ అయినా సరే.. డబ్బు కోసం వెనుకాడకుండా వెంటనే ఆపరేషన్ చేయాలని వైఎస్సార్ కోరుకున్నారు. అయితే ఈ చేతగాని ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోని వ్యాధులను ఎలాంటి కారణాలు చూపించి 10 శాతానికి కుదించాలా అని ఆలోచిస్తోంది. 

మొబైల్ ఆసుపత్రులు గ్రామాలకు వెళ్లి నడువలేని వయసున్న అవ్వా తాతలకు బీపీ వచ్చినా.. షుగర్ వచ్చినా అక్కడే పరీక్ష చేసి మందులు వాళ్ల చేతిలో పెట్టే గొప్ప ఆశయంతో 104 పథకాన్ని వైఎస్సార్ అందుబాటులోకి తెచ్చారు. ఆ దివంగత నేత చనిపోయిన తరువాత ఇదే 104 వాహనానికి ఫోన్ కొడితే.. ‘మా అంబులెన్స్‌లో మందులు లేవు’... ‘మా ఉద్యోగులు అందరూ సమ్మెలో ఉన్నారు’ అనే సమాధానాలు వినపడుతున్నాయి. నా రాష్ట్రాన్ని ఇటువంటి పరిస్థితిలో చూస్తున్నపుడు బాధనిపిస్తోంది. ఈ ప్రభుత్వం 104 పథకాన్ని ఒక పక్కా పథకం ప్రకారం ఖూనీ చేస్తోంది. వృద్ధాప్యంలో అవ్వాతాతలకు అండగా నిలబడాల్సింది పోయి వారికి ఉన్న పెన్షన్ ఎలా ఊడగొడదమా? అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

పోయినేడాది ఫీజులే ఇవ్వలేదు..
విద్యార్థుల భవిష్యత్తు కోసం.. వారి చదువుల కోసం ఎందాకైనా పోవాల్సిన ప్రభుత్వం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో విద్యార్థుల సంఖ్యను ఎలా తగ్గిద్దామా? అని ఆలోచిస్తోంది. నేను దారి వెంట వస్తున్నప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు కలిశారు. వాళ్లు చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అనుకుంటా... వాళ్లను అడిగా.. ‘అమ్మా..! ఈ ఏడాదికి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు వచ్చాయా?’ అని. ‘అన్నా మీరు ఈ ఏడాది గురించి అడుగుతున్నారు.. మాకు పోయిన ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బే రాలేదు. స్కాలర్‌షిప్పులైతే గత సంవత్సరం నుంచీ ఇవ్వడం లేదన్నా’ అని వాళ్లు చెప్పారు. వాళ్లు ఇంకో మాట కూడా నాతో చెప్పారు. అన్నా..! ‘కాలేజీయాజమాన్యం మమ్మల్ని ఒక రకంగా, ఫీజలు కట్టిన వాళ్లను ఒక రకంగా చూస్తోందన్నా..’ అని చెప్పినప్పుడు చాలా బాధనిపించింది. విద్యార్థుల మధ్య తారతమ్యాలు తెస్తున్న ఈ చేతగాని ప్రభుత్వాన్ని చూస్తే.. ఇలాంటి వాళ్లా రాష్ట్రాన్ని పాలిస్తుందని బాధనిపిస్తోంది.

సీసీఐ పత్తి కొనుగోలు చేయాలి..
వైఎస్సార్ సువర్ణ పాలనలో రూ.6 వేలున్న పత్తి నేడు రూ.3500 కూడా పలకని అధ్వాన పరిస్థితి. ఇవాళ ఒక్క పత్తి రైతులే కాదు రాష్ట్రంలో ప్రతి రైతన్న పరిస్థితి అధ్వానంగా తయారైంది. రాష్ట్రాన్ని పాలిస్తున్న వారికేమో వ్యవసాయంపై, రైతు సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. నష్టాల నుంచి రైతులను గట్టెక్కించి, పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ను క్రియాశీలం చేసి ప్రభుత్వం కొనుగోలు చేస్తే పత్తికి డిమాండ్ పెరిగి గిట్టుబాటు ధర వచ్చేది.

రాబోయే ఉప ఎన్నికలు.. రైతు కూలీలకు, కుతంత్రాలకు మధ్యే!
‘‘దేశ చరిత్రలోనే ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. రైతన్న, రైతు కూలీలు, విశ్వసనీయత, విలువలు ఒక వైపు.. రాజకీయాల్లోని కుళ్లు, కుతంత్రాలు మరోవైపు పోటీపడబోతున్నాయి. ఇవాళ రైతన్నలు పడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. తన గోడు వినమని చెప్పి రైతన్న క్రాప్ హాలిడే ప్రకటించి లక్ష ఎకరాలు బీడుగా పెట్టినా కూడా ఇవాళ్టి వరకూ ఆ రైతన్న పరిస్థితి మారిందా అంటే.. మారలేదు. ఇవాళ్టికీ వరి మీద రైతన్నకు గిట్టేది రూ.700 మాత్రమే. పత్తి రైతుకు గిట్టేది రూ.3,500, పొగాకు రైతుకు గిట్టేది రూ.6,700 మాత్రమే.. ఇలాంటి సంక్షోభంలో రైతన్న ఉన్నాడు. రైతు కూలీలకైతే కనీసం రూ. 100 కూడా గిట్టని అధ్వాన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నను, రైతు కూలీలను మర్చిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా, ఢిల్లీ పెద్దలకు కూడా వినపడేలా ప్రజా తీర్పు ఉంటుంది.’’
Share this article :

0 comments: