విద్యార్థుల నినాదాలతో ఆర్టీసీ క్రాస్‌రోడ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యార్థుల నినాదాలతో ఆర్టీసీ క్రాస్‌రోడ్

విద్యార్థుల నినాదాలతో ఆర్టీసీ క్రాస్‌రోడ్

Written By ysrcongress on Tuesday, December 13, 2011 | 12/13/2011

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థుల నినాదాలతో ఆర్టీసీ క్రాస్‌రోడ్ దద్దరిల్లింది. శివార్లలోని వృత్తివిద్య కళాశాలలకు తగినన్ని బస్సులు నడపాలనే డిమాండ్‌తో వారు బస్‌భవన్‌ను ముట్టడించారు.

సిటీబ్యూరో/రాంనగర్, న్యూస్‌లైన్: ‘‘ప్రాణాలు తీస్తారా..అదనపు బస్సులు నడుపుతారా..’’ అంటూ విద్యార్థులు, వారి తల్లితండ్రులు చేసిన నినాదాలతో ఆర్టీసీ బస్‌భవన్ దద్దరిల్లింది. శివారు ప్రాంతాల్లోని వృత్తి విద్యాకళాశాలల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ సర్వీసులు నడుపాలంటూ వైఎస్సార్ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బస్‌భవన్‌ను ముట్టడించారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినదించారు. కళాశాల సమయాల్లో తగినన్ని బస్సులు లేక.. పరిమితంగా ఉన్న వాటితో ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు గాల్లో కలుస్తున్న.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇటీవల ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ జారిపడి మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఝాన్సీ తండ్రి సత్యనారాయణతో కలిసి పుత్తా ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేసింది. దీనికి ఆయన స్పం దిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా బస్సులను పెంచుతామని హామీ ఇచ్చారు. నగరంలోని అన్ని డిపో మేనేజర్లకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల సమన్వయకర్త రాజ్‌ఠాకూర్, పార్టీ కన్వీనర్లు ఆదం విజయ్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డి, కార్పొరేటర్ సురేష్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష, యువజన విభాగం నగర కన్వీనర్ లింగాల హరిగౌడ్, విద్యార్థి విభాగం కన్వీనర్ అమిత్‌సింగ్ ఠాకూర్, నాయకులు రామ్మోహన్, సుమతీమోహన్, శ్రీలక్ష్మి, సునీత, ఖలీఫా, మోహన్‌కుమార్, శ్రీకాంత్, సరోజ్‌రెడ్డి, నవీన్, రవీందర్‌రెడ్డి, సిద్దేశ్వర్, సైద్‌ఖాన్, హనుమంతరావు, నవీన్‌నాయుడు, ప్రశాంత్ రెడ్డి, నీలం రాజు, అబ్దుల్, సంతోష్‌రెడ్డి, బి.రాజు తదితరులు పాల్గొన్నారు.

కుర్చీలాటలో సీఎం, బొత్స
సీఎం కుర్చీని దక్కించుకోవడానికి బొత్స సత్యనారాయణ, ఉన్న కుర్చీని కాపాడుకోవడానికి కిరణ్‌కుమార్‌రెడ్డిలు వ్యూహాలు రచించుకుంటూ ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో విఫలమయ్యారు. విద్యారంగాన్ని, విద్యార్థులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. శివారు ప్రాంతాల్లోని కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఎక్కువ మంది ఆర్టీసీ మీదే ఆధారపడుతున్నారు. అవసరమైనన్ని బస్సులు కేటాయించాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం మొండిగా ప్రవ ర్తిస్తోంది.
- పుత్తా ప్రతాప్‌రెడ్డి

సంఖ్య పెంచకుంటే ఆందోళన ఉధృతం
కాలేజీ వేళల్లో విద్యార్థులకు సరిపడా ఆర్టీసీ బస్సులు పెంచకుంటే అన్ని కళాశాలల విద్యార్థులను కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తాం. అరకొర బస్సుల వల్ల విద్యార్థులు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పటి వరకు శివారు ప్రాంతాల్లో బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
- ఆదం విజయ్‌కుమార్

ప్రాణాలతో చెలగాటమా
విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. అరకొర బస్సుల కారణంగా విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ ..ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇన్ని సమస్యలున్నాయని తెలిసినా సర్కారు మాత్రం స్పందించడం లేదు. ఆర్టీసీ అధికారులూ పట్టించుకోవడం లేదు. తక్షణం బస్సుల సంఖ్య పెంచకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాం.
- రాజ్‌ఠాకూర్

టైంకి వెళ్లలేకపోతున్నాం
అవసరమైనని బస్సులు లే ని కారణంగా సమయానికి కళాశాలకు వెళ్లలేకపోతున్నాం. విద్యార్థులు ఎక్కువమంది ఉండటంతో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెంచాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు నడపాలి. 
- బదర్‌హసన్

బస్సుల సంఖ్య పెంచాలి
గంటల తరబడి ఎదురుచూసినా.. ఒక్క బస్సు రాదు. సిటీ బస్సుల్లోనే బస్‌పాస్ చెల్లుతుంది. జిల్లా బస్సుల్లో ఎక్కితే కండక్టర్లు టికట్ తీసుకోవాలని అంటున్నారు. సిటీ బస్సులేమో సమయానికి రావు. దీంతో లేటుగా కళాశాలకు వెళ్తున్నాం. టీచర్స్ క్లాస్ రూంలోకి రానివ్వటం లేదు. మరిన్ని బస్సులను పెంచితే విద్యార్థులకు మేలు.
- అవినాష్‌రెడ్డి

తక్షణ స్పందన
ఆర్టీసీ దిగొచ్చింది. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం వివిధ రూట్లలో 25 బస్సులను ప్రవేశపెట్టింది. నేటి నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి. శివార్లలోని వృత్తి విద్యా కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, బస్సుల కొరత, ప్రమాదాలపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే.సోమవారం విద్యార్థులతో కలిసి వైఎస్సార్ యువజన విభాగం ధర్నా చేపట్టింది. అవసరమైన రూట్లలో మరిన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పురుషోత్తమ్ నాయక్ చెప్పారు.
Share this article :

0 comments: