విజయమ్మ రిప్లైకి అవకాశం రాకుండానే అబయన్స్ ఉత్తర్వుల జారీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » విజయమ్మ రిప్లైకి అవకాశం రాకుండానే అబయన్స్ ఉత్తర్వుల జారీ

విజయమ్మ రిప్లైకి అవకాశం రాకుండానే అబయన్స్ ఉత్తర్వుల జారీ

Written By ysrcongress on Wednesday, December 14, 2011 | 12/14/2011


*ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ రోహిణి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం
*దర్యాప్తును నిలిపివేయాలని సీబీఐ, ఈడీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు ఆదేశం
*అంతకుముందు బాబు, రామోజీ, రిలయన్స్‌ల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తులు
*విజయమ్మ రిప్లైకి అవకాశం రాకుండానే అబయన్స్ ఉత్తర్వుల జారీ
*ఒక్కరోజు ఆగండి.. మా వాదనలు విన్పిస్తామన్న విజయమ్మ తరఫు న్యాయవాది
*ఒప్పుకోని ధర్మాసనం; సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమంటున్న నిపుణులు
*ఫలించిన ‘నాట్ బిఫోర్’ నాటకం

హైదరాబాద్, న్యూస్‌లైన్: అనుకున్నదే జరిగింది. న్యాయపరమైన పక్షపాతానికి ఆస్కారముందన్న వై.ఎస్.విజయమ్మ వాదన.. ఆందోళన నిజమైంది. ‘నాట్ బిఫోర్’ నాటకంతో చంద్రబాబు, ఆయన బినామీలు ఊరట పొందగలిగారు. అవసరం లేని ఇంప్లీడ్ పిటిషన్‌తో ఆపద్బంధులా తెరపైకి వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కష్టాల్లో ఉన్న తన ఆప్తుమిత్రులు చంద్రబాబు, రామోజీ తదితరులను గట్టెక్కించింది. ఊహించిన విధంగానే చంద్రబాబు, రామోజీ, సీఎం రమేష్, మురళీమోహన్ తదితరులకు హైకోర్టు ఊరటనిచ్చింది. చంద్రబాబు, ఆయన బినామీల అక్రమాస్తులపై సీబీఐ, ఈడీ తదితర విచారణలకు ఆదేశిస్తూ గత నెల 14న జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహనరావుల ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను.. మంగళవారం జస్టిస్ రోహిణి, జస్టిస్ అశుతోష్ మొహంతాలతో కూడిన ధర్మాసనం తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్) చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. 

చంద్రబాబు, రామోజీ, రిలయన్స్ తరఫు న్యాయవాదుల సుదీర్ఘ వాదనలను విన్న ధర్మాసనం.. విజయమ్మ తిరుగు సమాధానం (రిప్లై) వాదనలు వినకుండానే అబయన్స్ ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ బుధవారం రిప్లై ఇస్తారని విజయమ్మ తరఫు న్యాయవాది చెప్పినా ధర్మాసనం పట్టించుకోలేదు. సీబీఐ విచారణకు ఆదేశించి ఇప్పటికే దాదాపు నెల కావస్తోందని, దీనివల్ల ప్రతివాదులకు జరిగిన నష్టమేమీ లేదని.. అందువల్ల రేపటివరకు ఆగితే పోయేదేమీ లేదని నివేదించినా వినలేదు. కోర్టు సమయం మరో 20 నిమిషాల్లో ముగుస్తుందనగా అబయన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం.. విజయమ్మ రిప్లై కోసం ఈ కేసు విచారణను బుధవారం ఉదయానికి ధర్మాసనం వాయిదా వేసింది.

చంద్రబాబు, ఆయన బినామీలు రామోజీరావు, సీఎం రమేష్, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, మురళీమోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు తదితరుల అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన వ్యాజ్యం మేరకు హైకోర్టు.. సీబీఐ, ఈడీ తదితర విచారణలకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై రామోజీరావు, సీఎం రమేష్, నామా నాగేశ్వరరావులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టుకే వెళ్లి తేల్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు, రామోజీ, సీఎం రమేష్ తదితరులు సీబీఐ విచారణ ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 

అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంప్లీడ్ పిటిషన్ నేపథ్యంలో.. రిలయన్స్‌లో తనకు వాటాలున్నాయంటూ సీజే ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనానికి కేసును అప్పగించారు. దీనిపై విజయమ్మ తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈశ్వరయ్య కూడా ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు జస్టిస్ రోహిణి, జస్టిస్ అశుతోష్ మోహంతాల ముందుకు వచ్చింది. ఈ మేరకు ధర్మాసనం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. రామోజీ తరఫున అనిల్ దివాన్, చంద్రబాబు తరఫున ఎ.కె.గంగూలీ, రిలయన్స్ తరఫున హరీష్‌సాల్వే తదితరులు తమ తమ వాదనలను వినిపించారు. ఉదయం 10.30 గంటలకు వాదనలు ప్రారంభించిన వీరు వ్యూహాత్మకంగా దాదాపు 3.45 గంటల సమయంలో తమ వాదనలను ముగించారు. 

వచ్చింది రిలయన్స్ తరఫున.. వాదనలు బాబు తరఫున
మంగళవారం ఉదయం వాదనలు కొనసాగించిన అనిల్ దివాన్ తమకు వాదనలను వినిపించే అవకాశం ఇవ్వకుండానే.. సీబీఐ విచారణకు ఆదేశించడం జరిగిందని చెప్పారు. విజయమ్మ తమపై నిరాధార ఆరోపణలు చేశారని, వాటిలో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోకుండానే విచారణకు ఆదేశించారని అన్నారు. తమ పరోక్షంలో ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు కావని, వాటిని రద్దు చేయాలని కోరారు. గతనెల 14న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ‘పిటిషనర్ లాక్కున్నారంటూ పదే పదే తీవ్ర స్వరంతో నివేదించారు. బాబు తరఫున గంగూలీ వాదిస్తూ.. తమ వాదనలను వినకుండా అంత అత్యవసరంగా సీబీఐ విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఏమీ లేదని అన్నారు. 

తమపై చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే, విజయమ్మ భర్త రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చర్యలు తీసుకుని ఉండేవారని చెప్పారు. చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ, డి.ఎల్.రవీంద్రారెడ్డి తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలను ఇదే హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. ఇక రిలయన్స్ న్యాయవాది హరీష్‌సాల్వే ఆశ్చర్యకరంగా చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు మద్దతుగా వాదించారు. అధికరణ 226 రాజ్యాంగపరంగా శక్తివంతమైన ఆయుధమని, దానిని ఉపయోగించేటప్పుడు హైకోర్టులు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చంద్రబాబు కుమారుడు లోకేష్ విద్యాభ్యాసానికి సంబంధించి బురద చల్లే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత నెల 14న ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వుల వల్ల అంతర్జాతీయంగా రిలయన్స్ ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లుతోందన్నారు. 

ఆ తర్వాత నాగరాజనాయుడు, నామా నాగేశ్వరరావుల తరఫు న్యాయవాదులు కె.రామకృష్ణారెడ్డి, డి.ప్రకాశ్‌రెడ్డిలు కొద్దిసేపు వాదనలను వినిపించారు. దాదాపు 3.45 గంటలకు ఈ వాదనలన్నీ ముగిశాయి. వాదనలను విన్న ధర్మాసనం.. రిప్లై వాదనల గురించి ఆరాతీసింది. సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ ఢిల్లీలో ఉన్నారని, ఒక్కరోజు ఆగితే బుధవారం వచ్చి వాదనలను వినిపిస్తారని విజయమ్మ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. అప్పటివరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్థించారు. ఇందుకు జస్టిస్ రోహిణి ధర్మాసనం అంగీకరించలేదు. చంద్రబాబు న్యాయవాదులు కోరిన విధంగా.. గత నెల 14న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అబయన్స్‌లో ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసును తదుపరి విచారణ నిమిత్తం బుధవారానికి వాయిదా వేసింది. 

వాదనలపై జవాబుకు అవకాశమేదీ!
మా వాదనలు వినకుండానే సీబీఐ విచారణకు ఆదేశించారంటూ చంద్రబాబు, రామోజీ తదితరులు గగ్గోలు పెట్టడంతో..వారి సుదీర్ఘ వాదనలను జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం ఎంతో శ్రద్ధతో ఆలకించింది. వారు చెప్పిన ప్రతి పాయింట్‌ను నోట్ చేసుకుంది. వారి వాదనలు పూర్తై తర్వాత పిటిషనర్ విజయమ్మ వాదనలు కూడా హైకోర్టు వినాల్సి ఉంది. రిట్ నిబంధనల ప్రకారం మొదట పిటిషనర్ వాదనలు.. తరువాత ప్రతివాదుల వాదనలు.. ఆ తరువాత ప్రతివాదుల వాదనలకు పిటిషనర్ రిప్లై ఉంటుంది. ఆ తరువాతనే సాధారణంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. 

ఈ కేసులో మాత్రం హైకోర్టు, అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. రిప్లైకు అవకాశం ఇవ్వకుండానే, చంద్రబాబు తదితరులు కోరిన విధంగా సీబీఐ విచారణ ఉత్తర్వులను అబయన్స్‌లో పెట్టింది. దీనిపై న్యాయనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రిప్లైకి అవకాశం ఇవ్వకపోవడం ద్వారా హైకోర్టు సహజ న్యాయసూత్రాలను విస్మరించినట్లు అయిందంటున్నారు. తమకు వాదనలు విన్పించే అవకాశం ఇవ్వకుండా పిటిషనర్ ఉత్తర్వులను లాక్కున్నారంటూ పదేపదే వాదిం చిన రామోజీ తరఫు న్యాయవాది అనిల్ దివాన్.. ధర్మాస నం పిటిషనర్ రిప్లైని వినకుండా అబయన్స్ ఉత్తర్వులివ్వడాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Share this article :

0 comments: