జీతాలిచ్చేందుకే డబ్బుల్లేవ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జీతాలిచ్చేందుకే డబ్బుల్లేవ్

జీతాలిచ్చేందుకే డబ్బుల్లేవ్

Written By news on Sunday, September 22, 2013 | 9/22/2013

జీతాలిచ్చేందుకే డబ్బుల్లేవ్: డి.ఎ.సోమయాజులు
సాక్షి, హైదరాబాద్:  రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం లేదా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుందని భావిస్తే అది అవివేకమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు అన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి రె వెన్యూ ఆదాయం కన్నా రెవెన్యూ లోటు ఎక్కువైంది. జీతాలిచ్చేందుకే కేంద్రం దగ్గర డబ్బులు లేనప్పుడు కొత్త రాష్ట్ర ఏర్పాటుకు డబ్బులెక్కడి నుంచి తెచ్చిస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు. శనివారం ‘ది హిందూ సెంటర్’ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నిర్వహించిన సదస్సులో భాగంగా ‘వనరుల పంపిణీ’ అనే అంశంపై జరిగిన చర్చలో సోమయాజులు మాట్లాడారు. హైదరాబాద్‌ను ‘ఎకనామిక్ పవర్‌హౌజ్’గా తీర్చిదిద్దిన తరుణంలో కొత్త రాష్ట్రంలో విద్య, పారిశ్రామిక సౌకర్యాలను ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.
 
 ఐఐటీలు కట్టగలరు కానీ డీఆర్‌డీఎల్ లాంటి రక్షణ, పౌర అధ్యయన సంస్థలను ఏర్పాటు చేయగలరా? అని అన్నారు. ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించే విధానంతో కేంద్రం ముందుకెళ్తుంటే... ఆంధ్ర ప్రాంతంలో జాతీయ స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా ఏర్పాటు చేస్తారన్నారు. ఉమ్మడి రాజధాని అనే అంశంలో తెలంగాణలో అంతర్భాగంగా ఉండే హైదరాబాద్ ఆదాయాన్ని ఇరు ప్రాంతాలకు పంచే అవకాశం ఉందా? అని అడిగారు. ‘‘చెన్నై ఆదాయాన్ని ఆంధ్రాకు, భువనేశ్వర్ ఆదాయాన్ని మరో రాష్ట్రానికి ఇవ్వమంటే ఎలా కుదురుతుంది? అసలు అలాంటి వెసులుబాటు రాజ్యాంగం కల్పిస్తోందా? హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తరహాలో పారిశ్రామిక ప్యాకేజీలు ఇవ్వకపోతే సీమాంధ్రలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. సీమాంధ్రలోని టెయిలెండ్ జిల్లాలకు నీళ్లు ఎక్కడ్నుంచి వెళ్తాయి? వివిధ ట్రిబ్యునల్స్ కేటాయించిన దాంట్లో 50-60 శాతం నీరే ఆ ప్రాంతానికి వెళుతోందని, ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని ఏర్పరిస్తే ఆ ప్రాంతాలకు నీళ్లు వెళ్లే పరిస్థితే ఉండదు’’ అని చెప్పారు.
 
 ఆదాయాన్ని పంచుకోవచ్చు..
 హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచితే న్యాయబద్ధ వాటా (ఫెయిర్ షేర్) విధానం ద్వారా ఆదాయాన్ని పంచుకోవచ్చని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ రేవతి ఎల్లంకి అన్నారు. ఈ విషయంలో ఆంధ్ర ప్రాంతం వారు భయపడాల్సిన పనిలేదని, జీఎస్‌డీపీ ఆధారంగా మొత్తం ఆదాయంలో 55 శాతం సీమాంధ్రకు, 44 శాతం తెలంగాణకు పంచవచ్చని ఆమె వివరించారు. నీటిపారుదల నిపుణులు ఆర్.విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కృష్ణా నీటిని ప్రాజెక్టుల వారీగా ఇప్పటికే ట్రిబ్యునల్ పంపిణీ చేసినందున రాష్ట్రం విడిపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఈ అంశంపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి ఎస్.నారాయణ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. చర్చలో అంతర్రాష్ట్ర మండలి మాజీ కార్యదర్శి అమితాబ్‌పాండే కూడా పాల్గొన్నారు.
 
 హైదరాబాద్‌పై చర్చ..
 సదస్సులో భాగంగా ‘హైదరాబాద్ పరిస్థితి - కొత్త రాజధాని’ అనే అంశంపై చర్చ జరిగింది. దీనికి జేఎన్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆషా సారంగి సమన్వయకర్తగా వ్యవహరించగా.. ఛత్తీస్‌గఢ్ మాజీ ప్రధాన కార్యదర్శి పి.జాయ్‌ఒమెన్, ప్రొఫెసర్ రమామెల్కొటే, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, బూర్గుల నర్సింగరావు, జర్నలిస్టు ఎన్.వేణుగోపాల్, ఐటీ రంగ నిపుణులు జె.ఎ.చౌదరి, వైఎస్సార్‌సీపీ నేత అడుసుమిల్లి జయప్రకాశ్ పాల్గొన్నారు.
Share this article :

0 comments: