బెయిల్ షరతులు సడలించండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బెయిల్ షరతులు సడలించండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

బెయిల్ షరతులు సడలించండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Written By news on Saturday, October 26, 2013 | 10/26/2013

బెయిల్ షరతులు సడలించండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా బలమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్ర ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర పర్యటనకు, సమైక్య రాష్ట్రం కోసం కృషిలో భాగంగా ఢిల్లీ వెళ్లేందుకు అనుమతిస్తూ బెయిల్ షరతులు సడలించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సీబీఐ రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేష్ శుక్రవారం విచారించారు. జగన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు.

గతంలో జగన్‌కు తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిం దని, అదే సమయంలో గుంటూరులో రైతు సదస్సులో పాల్గొనేందుకు మాత్రం చార్జిషీట్లు పరిశీలన దశలో ఉన్న దృష్ట్యా అనుమతి ఇవ్వలేదని ప్రస్తావించారు. ప్రస్తుతం అన్ని చార్జిషీట్ల పరిశీలన పూర్తయి విచారణకు స్వీకరించిన నేపథ్యంలో బెయిల్ షరతుల సడలింపునకు అభ్యంతరమేమీ ఉండబోదన్నారు. జగన్ కుటుంబం సుదీర్ఘ కాలంగా ప్రజలతో మమేకమై ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, ఎంపీగా జెడ్ కేటగిరీ భద్రత మధ్య ఉండే జగన్‌మోహన్‌రెడ్డి... కోర్టు షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించబోరని నివేదించారు. రాజకీయ కక్షలతో వచ్చిన ఈ కేసు తప్ప జగన్‌పై ఇప్పటివరకు ఎటువంటి మచ్చా లేదన్నారు.
 
 అయితే తుది విచారణ (ట్రయల్)ను దృష్టిలో ఉంచుకొనే జగన్ హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు షరతులు విధించిందని సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర వాదనలు వినిపించారు. బెయిల్ షరతులు సడలిస్తే తుది విచారణ జాప్యమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే ఈ వాదనను సుశీల్‌కుమార్ తోసిపుచ్చారు. సీసీ నంబర్ 9లో సాయిరెడ్డి మాత్రమే డిశ్చార్జ్ పిటిషన్ వేశారన్నారు. దీనిపై తాము వాదనలు వినిపించిన తర్వాత సాయిరెడ్డిని పబ్లిక్ సర్వెంట్‌గా పేర్కొంటూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. ఇప్పటివరకు తమకు ఐదు చార్జిషీట్లు మాత్రమే అందాయని, ఇంకా ఐదు అం దాల్సి ఉందని నివేదించారు. అన్నీ అందిన తర్వాత వాటిని పరిశీలించి డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులతో జగన్ కుమ్మక్కయ్యారని సీబీఐ చార్జిషీట్లలో ఆరోపించిందని, అయితే నిందితులుగా ఉన్న అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయమూర్తి... జగన్ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని ఈనెల 30కి వాయిదా వేశారు.
Share this article :

0 comments: