- విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన స్పీకర్
- నిరసన తెలిపిన 8 మంది వైఎస్సార్ సీపీ సభ్యుల సస్పెన్షన్
- మార్షల్స్ సాయంతో గెంటివేత
- అసెంబ్లీ ఆవరణ నుంచీ గేటు బయటకు ఈడ్చివేసిన దారుణం
- ఆ దృశ్యాలు ప్రజలకు చూపకుండా టీవీ ప్రసారాల నిలిపివేత
- విపక్ష నేత మాట్లాడరాదని స్పీకర్ ఆంక్షలు
- జగన్ ఉద్వేగం.. స్పీకర్‌కు, అధికారపక్షానికి మౌన నమస్కారం
- సభ నుంచి నిష్ర్కమణ.. గవర్నర్‌ను కలసి ఫిర్యాదు
- స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసుకు నిర్ణయం
- నోటీసును స్వీకరిస్తేనే సభకు హాజరవుతామని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికారపక్షం జులుం పతాక స్థాయికి చేరింది. ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ వేదికగా అపహాస్యం చేసింది. ప్రజల పక్షాన గళమిప్పుతున్న ప్రతిపక్షంపై నిరంకుశంగా ఉక్కుపాదం మోపింది. విపక్షం వాణి అనేదే వినపడకుండా చేసింది. చట్టసభల నిబంధనలకు తిలోదకాలిచ్చింది. ప్రజాస్వామిక సంప్రదాయాలకు పాతరేసింది. విపక్ష నేత మాట్లాడీ మాట్లాడకముందే గొంతు నొక్కేసింది. అదేమని ప్రశ్నించిన విపక్ష సభ్యులు 8 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. వారు నిరసన తెలిపితే మార్షల్స్‌తో బయటకు ఈడ్చి పారేయించింది. అసెంబ్లీ ఆవరణలోనే ఉండటానికి వీల్లేదంటూ గేటు బయటకు గెంటేయిం చింది. ఈ దుష్కృత్యం బయటి ప్రపంచానికి తెలియకుండా సభా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను సైతం నిలిపివేసింది. ఈ క్రమంలో స్పీకర్ వైఖరి వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష నేత మాట్లాడటానికి అవకాశమిచ్చినట్లే ఇచ్చి మైక్ కట్ చేసేయటం.. ఎంతగా విజ్ఞప్తి చేసినా.. ఎటువంటి వివాదాలూ నిరసనలూ లేకున్నా.. మళ్లీ మైక్ ఇవ్వటానికి నిరాకరించటం.. అదేమని ప్రశ్నించిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి బయటకు గెంటించేయటం.. ఈ బాధాకర పరిణామాలపైన మాట్లాడేందుకూ విపక్ష నేతకు అవకాశం ఇవ్వకపోవటం.. యావత్ ప్రజలనూ దిగ్భ్రాంతికి గురిచేశాయి. అటు స్పీకర్ వైఖరితో.. ఇటు అధికారపక్షం తీరుతో తీవ్రంగా కలత చెందిన విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి.. లేచి నిల్చుని స్పీకర్‌కు ఒక నమస్కారం.. అధికారపక్షానికి ఒక నమస్కారం చేసి.. మౌనంగా సభ నుంచి నిష్ర్కమించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షమూ అంతే కీలకం. నిజానికి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ.. ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను నిరంతరం శల్యపరీక్ష చేస్తూ.. ప్రజాప్రయోజనాల రక్షణ పాత్ర పోషించేది ప్రతిపక్షమే. ప్రతిపక్షమనేది లేకపోతే.. అది ప్రజాస్వామ్యమే కాదు. ప్రతిపక్షం లేకపోతే ఉండేది అధికారపక్షం ఒక్కటే. అడిగేవారు ఎవరూ లేని.. అధికారపక్షం ఒక్కటే ఉండే వ్యవస్థ నిరంకుశ వ్యవస్థ అవుతుంది. రాష్ట్రంలో అధికారపక్షానికి తన చర్యలను, చేతలను, నిర్ణయాలను విపక్షం ప్రశ్నిస్తుండటం.. వాటిలోని లోపాలను, అవినీతి బాగోతాలను ఎండగడుతుండటం.. మింగుడు పడని చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. మూడు రోజు లుగా శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కేయటమే పనిగా పెట్టుకుంది. వ్యక్తిగత దూషణలు, ఎదురు దాడులు, హెచ్చరికలు, హుంకరింపులు, బెదిరింపులతో చర్చ జరగాల్సిన విషయాలను పక్కదారి పట్టించటమే పెట్టుకుంది. బుధవారం నాడు నిండు సభలో.. ‘‘మీ కథేంటో తెలుస్తాన’ని సాక్షాత్తు ముఖ్యమంత్రే బెదిరిస్తే.. అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.. ‘‘పాతేస్తా.. నా కొ....’’ అని హెచ్చరించగా.. గురువారం నాడే ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావే.. ‘‘నిన్ను మాట్లాడనివ్వ’’నని ప్రతిపక్ష నేతను నియంత్రించారు. సీఎం కనుసన్నల్లో అధికార పక్షం ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. శాసనసభను పూర్తిగా ఏకపక్షంగా మార్చి విపక్షం గొంతు నులిమేసింది.
రైతుల ప్రస్తావన రాగానే.. మైక్ కట్
గురువారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడటం ప్రారంభించారు. ఐదారు నిమిషాలు మాట్లాడారో లేదో.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు యథావిధిగా జగన్ మైక్‌ను కట్ చేశారు. ఆయన మాట్లాడుతున్నపుడు ఎలాంటి నిరసనలూ లేవు.. ఎటువంటి నినాదాలూ లేవు. కానీ.. జగన్ తన ప్రసంగంలో రైతుల ప్రస్తావన తీసుకొచ్చారు. అంతే! మైక్ కట్ అయిపోయింది!! బడ్జెట్‌పై చర్చలో ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నపుడు.. ఆయన మైక్‌ను కట్ చేసే ఆనవాయితీ లేకున్నా.. స్పీకర్ బెల్ మోగించి, మైక్ కత్తిరించారు. ఈ చర్య విపక్ష నేతకు, ప్రతిపక్ష సభ్యులకే కాదు.. ప్రజ లందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మరికొద్ది సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాలని జగన్ కోరినా స్పీకర్ ససేమిరా అన్నారు. తాను మాట్లాడతానని జగన్ మళ్లీ కోరారు. మాట్లాడలేవని స్పీకర్ స్పష్టంచేశారు. ఆ వెం టనే అధికారపక్ష సభ్యుణ్ణి మాట్లాడాల్సిందిగా ఆదేశించారు. దీంతో విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి నిరసనకు దిగారు. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. స్పీకర్ సభను వాయిదా వేశారు.
నిరసన తెలిపినందుకు సస్పెన్షన్..
అనంతరం శాసనసభ తిరిగి సమావేశమైనపుడు.. శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టడంతో.. ప్రతిపక్ష సభ్యులు 8 మందిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. వారిని మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభలో మళ్లీ గందరగోళం తలెత్తింది. విపక్ష సభ్యులు నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. అధికార పక్ష సభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. స్పీకర్ ఆదేశాలతో పెద్ద సంఖ్యలో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి.. నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులను ఒక్కొక్కరిని బలవంతంగా ఈడ్చుకుపోయారు. ఈ దృశ్యాలను ప్రజలకు చూపకుండా పది నిమిషాల పాటు టీవీ చానళ్లలో సభాకార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను సైతం నిలిపివేశారు. బయటకు ఈడ్చుకెళ్లిన వారిని సభ నుంచే కాకుండా ఏకంగా అసెంబ్లీ ఆవరణ నుంచే గెంటివేశారు. బలవంతంగా ఈడ్చుకుపోయి సభ ఆవరణ బయటున్న బారికేడ్ల మధ్య పడేశారు. సభ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో అడిగేందుకు వీలులేకుండా చేశారు. చివరకు సభ బయట ఉండే మీడియా పాయింట్‌లో సైతం మాట్లాడకుండా నిలువరించి.. అప్రకటిత కర్ఫ్యూను తలపించారు.
పదే పదే అడిగినా..: ఈ పరిణామాలను విస్తుపోయి చూస్తున్న జగన్.. విపక్ష సభ్యులను మార్షల్స్ బయటకు ఈడ్చుకెళ్లిన తర్వాత.. ఈ దశలోనైనా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ మాట్లాడబోతుండగా.. స్పీకర్ మళ్లీ ఆయన మైక్‌ను కట్ చేశారు. జగన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తన స్థానం నుంచి లేచి కొద్దిగా ముందుకొచ్చి.. రెండు చేతులు జోడించి స్పీకర్‌కు నమస్కారం చేశారు. ఆ తర్వాత అధికారపక్షానికీ నమస్కారం చేశారు. మాట్లాడే అవకాశమివ్వనందుకు నిరసనగా మౌనంగా సభ నుంచి నిష్ర్కమించారు. అక్కడి నుంచి సహచర ఎమ్మెల్యే లతో కలిసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి అసెంబ్లీ లో జరిగిన ఘటనలపై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య విలువలను, నిబంధనలను కాలరాస్తూ శాసనసభ జరుగుతున్న తీరును వివరించారు. తగిన న్యాయం చేయాలని కోరారు. ఆ తర్వాత స్పీకర్ వైఖరిని నిరసిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రతి పాదించాలని.. దాన్ని అంగీకరిస్తే తప్ప ఇక అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకూడదని సహచర శాసనసభ్యులతో కలిసి నిర్ణయించారు.
యథేచ్ఛగా దూషణల పర్వం...
విపక్ష సభ్యుల్లో కొందరిపై సస్పెన్షన్ వేటు వేసి బయటకు ఈడ్చిపారేసి.. ప్రతిపక్ష నేత ఎంతగా విజ్ఞప్తి చేసినా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కేసి.. మిగిలిన వారూ నిష్ర్కమించేలా చేసి.. సభలో అసలు విపక్షమే లేకుండా చేసిన అధికారపక్షం.. సభను ఏకపక్షంగా కొనసాగించింది. సభలో లేని విపక్షంపై ఎప్పటిలానే యధేచ్చగా దూషణల పర్వం కొనసాగించింది. సభా నాయకుడు చంద్రబాబునాయుడు చూపిన మార్గంలోనే శాసనసభ వేదికగా అన్‌పార్లమెంటరీ (సభలో వాడకూడని) పదజాలం ఉపయోగిస్తూ టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. ఇష్టారీతిన అసభ్యకర పదజాలం వాడుతున్నా అడ్డుకట్ట వేసే వారే లేకపోయారు. మహిళాలోకాన్ని కించపరిచే పదాలతో పాటు కులాల ప్రస్తావన తెస్తూ యధేచ్చగా మాటలు సాగిపోయాయి. దొంగలు, 420లు, దోపిడీదారులు అనే పదాలు లేకుండా శాసనసభ సాగడం లేదు.
0 comments:
Post a Comment