అవినీతి బయటపడుతుందనే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవినీతి బయటపడుతుందనే..

అవినీతి బయటపడుతుందనే..

Written By news on Wednesday, March 18, 2015 | 3/18/2015


పట్టిసీమ’పై చర్చకు అడ్డుపడుతున్నారు
⇒ అసెంబ్లీలో సర్కారు తీరుపై వై.ఎస్.జగన్ ఆగ్రహం
⇒ పట్టిసీమ జీవోలో రాయలసీమకు నీరిస్తామని ఒక్క మాటా లేదు
⇒ పోలవరం వద్దని కేసీఆర్ చెప్పినట్టుగానే చంద్రబాబు నడుస్తున్నారు
⇒ చర్చ జరిగితే తన అవినీతి బయటపడుతుందని భయపడుతున్నారు

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అవినీతి బయట పడుతుందనే భయంతోనే శాసనసభలో పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో చర్చ జరక్కుండా అడ్డుపడుతున్నారని ప్రతిపక్ష నాయుకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టిసీమ పేరుతో రాయలసీమకు నీరు రాకుండా తాము అడ్డుకుంటున్నామని చెప్పడంలో అర్థంలేదని కొట్టిపారేశారు.

పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు ఇస్తామని.. అందుకోసం జారీ చేసిన జీవోలో ఒక్క ముక్క కూడా లేదని ఎత్తిచూపారు. పోలవరం వద్దని, దానిస్థానంలో చిన్నచిన్న లిఫ్ట్‌లు ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చెబుతున్న తీరులోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పట్టిసీమ పేరుతో అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే శాసనసభలో తమకు మాట్లాడే అవకాశమివ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

ఈ అన్ని విషయాలపై చర్చ జరిగితే దేశంలోనే చంద్రబాబు అంతటి అవినీతి ముఖ్యమంత్రి ఎవరూ ఉండరన్న ముద్ర పడుతుందని భయపడుతున్నారని ఎద్దేవాచేశారు. ఈ ప్రాజెక్టు పేరుతో అవినీతి జరుగుతున్నందునే తాము ప్రతిఘటిస్తున్నామని జగన్ ఉద్ఘాటించారు. మంగళవారం శాసనసభలో 344 నిబంధన కింద పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి మాట్లాడే అవకాశమివ్వలేదు. సభ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించి దాని పూర్వాపరాలు మొత్తం వివరించారు.

చంద్రబాబు ప్రయత్నాల వల్ల అసలు పోలవరం ప్రాజెక్టుకే ముప్పు వస్తుందేమోనని ఈ సందర్భంగా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమపై తమ అభ్యంతరాలేంటో అసెంబ్లీలో వినడానికి కూడా అధికారపక్షం సిద్ధంగా లేదనీ, ప్రతిపక్షం గొంతు వినకపోతే అసలు ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు శాసనసభలో ఉండటం దారుణమని వ్యాఖ్యానించారు.
 
పట్టిసీమ వల్ల పోలవరం ప్రశ్నార్థకం..
‘‘పట్టిసీమ రావడం వల్ల పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందన్నపుడు నిజంగా ఎంత భయమేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఈ అసెంబ్లీలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి మా భయాలు చెప్పడానికి (జలాలు, ప్రాజెక్టుల తాలూకు పత్రాలను చూపిస్తూ) ఈ పేపర్లు చూపిస్తే.. మీరు చూపించే ఈ పేపర్లు, మీరు మాట్లాడే ఈ మాటలు వేరే రాష్ట్రాలకు ఊతమిస్తుంది. వాళ్లు వాదనలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి అంటూ మమ్మల్ని బుల్‌డోజ్ చేస్తారు. అవతలి వాళ్లు చెప్పే భయాలు వినాలనే ఆలోచనే అధికారపక్షానికి లేదు. మేమిలా ప్రశ్నిస్తే మేమేదో వ్యతిరేకిస్తున్నామని మా మీదనే బురద జల్లుతారు’’ అని జగన్ పేర్కొన్నారు.
 
కేసీఆర్‌తో కుమ్మక్కు అయ్యిందెవరు?
‘‘కేసీఆర్‌తో మేం కుమ్మక్కు అయ్యామని చంద్రబాబు ఆరోపించడం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. కేసీఆర్‌తో కుమ్మక్కు అయింది మేమా లేక చంద్రబాబా? పదేళ్ల నుంచీ కేసీఆర్ గాని, టీఆర్‌ఎస్ గాని, తెలంగాణవాదులు గానీ చెబుతున్నదేమిటి? పోలవరం కట్టొద్దండి.. దానికి బదులుగా చిన్న చిన్న లిఫ్టులు పెట్టుకోండి, నీటిని డైవర్ట్ చేసుకోండి.. అని చెబుతున్నారు. కేసీఆర్ గత పదేళ్ల నుంచి ఏ మడుగుతున్నారో చంద్రబాబుగారూ చేస్తున్నదదే కదా? కేవలం కాంట్రాక్టర్ల కోసం, టెండర్ల కోసం డబ్బుల కోసం రాష్ట్రాన్ని అమ్మేసి, ఇంకొకరి మీద బురద జల్లుతున్నదీ మీరు కాదా? కృష్ణా మిగులు జలాలు వాడుకునే అధికారం మనకే ఉంది.

కానీ గోదావరికి వచ్చేటప్పటికి ఆ అధికారం మనకున్నట్లుగా ఎలాంటి అవార్డులు లేవు. ఈ కారణాలన్నీ చెబుతున్నా వినే నాథుడు లేడు. చంద్రబాబు, ఆయన మంత్రులు కలిసి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన లేఖను వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. ఆ లేఖలో ఉన్నదేమిటంటే.. వైఎస్ 5 సిని పొందు పరుస్తూ ఇచ్చిన లేఖకు ఒక నేపథ్యం ఉంది. 1997లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కేంద్రంలో ఆయన చక్రం తిప్పే సమయం అది. ప్రధాని దేవేగౌడ మంత్రివర్గంలో నలుగురు కేంద్రమంత్రులు కూడా టీడీపీకి చెందిన వారున్నారు. అదే సమయంలో కర్ణాటక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీద సుప్రీంకోర్టు ఓఎస్-1 అనే కేసును వేసింది. అందులో ఏపీ, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. (ఆ కేసులో చంద్రబాబు ఇచ్చిన జవాబు తాలూకు వివరాలను జగన్ వెల్లడిస్తూ) అదే సమయంలో ఆల్మట్టికి సంబంధించి ఏపీ ఓఎస్-2 అనే మరో కేసును వేసింది.

ఈ రెండు కేసులకూ కలిపి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 28వ పేరాను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇవాళ మా ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఇవే మాటలు చెప్పారు. కృష్ణా నదిలో మిగులు నీటిని వాడుకునేందుకు అధికారాలున్నాయి గానీ, ప్రాజెక్టులు మాత్రం కట్టుకోరాదని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఈ తీర్పును కర్ణాటక బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందుంచి ప్రాజెక్టులు అపండి అని విజ్ఞప్తి చేసింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి 5సిని కోట్ చేస్తూ ‘మిగులు జలాలు మావి, మాకు అధికారం ఉంది’ అని చెప్పారు. వైఎస్ ఏదైతే పొందుపర్చారో అదే అంశాన్ని చంద్రబాబుగారు ఓఎస్-1 కేసులో కూడా సమాధానం ఇచ్చారు. ఇవన్నీ ఎవరికి తెలియదనుకుంటారు? మేము మాట్లాడితే తప్పుదోవ పట్టిస్తున్నామంటారు. వాళ్లు తప్పులు చేసి మా పై నిందలేస్తారు’’ అని జగన్ మండిపడ్డారు.
 
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు...
‘‘ఏడాదిలో గోదావరి నది 130 రోజులు పొంగుతుందని చెప్పడం పచ్చి అబద్ధం. పట్టిసీమ ప్రాజెక్టు కట్టడం అవసరం అని వాదించడానికే ప్రభుత్వం ఇలా చేస్తోంది. 130 రోజులంటే నిజంగా గోదావరి నాలుగున్నర నెలలు పొంగుతుందా? తెలిసీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి అబ ద్ధాలు ఆడతారా? గోదావరి నది 60 రోజులు అటూ ఇటూగా పొంగుతుంది. కృష్ణా నది 40 రోజులకు కాస్త అటూ ఇటూగా పొంగుతుంది.

రెండూ కూడా జీవనదులు కావు. వరదలొచ్చినపుడే పొంగుతాయి. వర్షాకాలంలోనే వరదలొస్తాయి. అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే వర్షాలు కురుస్తాయి. జూన్ 15 తరువాతనే వర్షాలు ప్రారంభమై జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకూ కురుస్తాయి. మొత్తం వరద వచ్చే రోజులు 90 రోజులే అయినందు వల్ల గోదావరి 60 రోజులు కృష్ణా 40 రోజులు పొంగుతుంది. అలాంటపుడు ఎక్కడి నుంచీ నీళ్లను లిఫ్టు చేసి కుడి ప్రధాన కాలువ ద్వారా ఇస్తామన్నారని ప్రశ్నిస్తున్నాను.

అంటే .. అక్కడ గోదావరి నుంచి సముద్రంలోకి పోయే నీళ్లు,  ఇక్కడ కృష్ణా నదిలోకి తీసుకొచ్చి సముద్రంలో కలపడమే కదా.. ఎక్కడ స్టోర్ చేస్తారని అడుగుతున్నా..? ఆ నీటిని నిలువ చేయడం కోసమే కదా పోలవరం కడుతున్నది. దాని సామర్థ్యం 194 టీఎంసీలు.. దారిలో ఎక్కడా స్టోరేజి కెపాసిటీ లేదు కాబట్టి. ప్రకాశం బ్యారేజి సామర్థ్యం చూద్దామా అంటే 3 టీఎంసీల లోపే ఉంది. పైగా పట్టిసీమ టెండర్ల ప్రకారం ప్రతి రోజూ 8,500 క్యూసెక్కుల నీటిని పంపే కార్యక్రమం అని పేర్కొన్నారు.

80 టీఎంసీల నీళ్లు 8,500 క్యూసెక్కుల చొప్పున ప్రతి రోజూ పంప్ చేస్తే 80 టీఎంసీలు రావడానికి 109 రోజులు పడుతుంది. కృష్ణా నదికి కూడా నాగార్జునసాగర్ నుంచి వచ్చే నీరే కాకుండా బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు ఈ నదులు తోడవుతాయి. దిగువన ఉన్నది పులిచింతల, ప్రకాశం బ్యారేజి మాత్రమే. ఇక 30 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతాయి. ఏ నిపుణుడిని అడిగినా పట్టిసీమ తొందరపాటు చర్య.. చేయొద్దండి అంటున్నారు. చంద్రబాబుకు మాత్రం అవేవీ కనపడ్డం లేదు’’ అని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబుకు రాయలసీమపై ప్రేమా?!
‘‘రాయలసీమకు నీళ్లివ్వడానికే పట్టిసీమ ప్రాజెక్టు అంటున్నారు. చంద్రబాబుకు రాయలసీమపై ప్రేమ ఉందా..? రాయలసీమ మీద ప్రేమ ఎవరికైనా ఉందంటే అది మాకే. నిజంగా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాల్సింది ప్రధానంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచే. దాని కింద కాలువలు ఇంకా పూర్తి కాలేదు. రిజర్వాయర్లు ఇంకా పూర్తి కాలేదు.గాలేరు-నగరి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు చంద్రబాబు తన తొమ్మిదేళ్ల హయాంలో కేటాయించిన నిధులను.. తరువాత వైఎస్ హయాంలో కేటా యించిన నిధులతో పోల్చితే రాయలసీమకు ఆయన చేసిందేమిటి? ఎవరు అన్యాయం చేశారు అన్నది బయట పడుతుంది’’ అంటూ జగన్ ఆయా ప్రాజెక్టులకు ఎవరెవరు ఎంత కేటాయించింది గణాంకాలతో సహా వివరించారు.
 
‘‘శ్రీశైలం రిజర్వాయరులో 854 అడుగుల మేరకు ఉన్నపుడే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకెళ్లొచ్చు. ఆ 854 నిలబడాలంటే శ్రీశైలంలో బాగా నీళ్లున్నపుడే నిలబడతాయి. జూలై, సెప్టెంబర్‌లలో ఇది సాధ్యం కాదు. వరద వచ్చేది జూలై నుంచి సెప్టెంబర్ వరకే. ఆల్మట్టి నుంచి నీళ్లు వచ్చేది కూడా ఈ నెలల్లోనే. 854 అడుగుల నీరుంటేనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు వస్తాయి. ఈ రోజు శ్రీశైలంలో 830 అడుగుల కిందకు నీరుంది. రేపు 854 అడుగులకు నీరు రావాలి అనంటే దానర్థం అంటే 830 నుంచి 854కు స్టోరేజి చేసుకోవాలి.

ఈ స్టోర్ చేసుకునే లోపు తెలంగాణ ఆన్ చేసుకుని వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే దేవినేని ఉమామహేశ్వరరావు చూస్తూ ఊరుకుంటారు. ఇక్కడి నుంచి నీళ్లు పోతే నాగార్జునసాగర్‌కే పోతాయిలే అనుకుం టాడు. అది ఈ ఏడాదీ జరిగింది. వాస్తవాలిలా ఉంటే రాయలసీమ మీద నాకు ప్రేమ ఉందని చంద్రబాబు అంటారు. పట్టిసీమకు సంబంధించి విడుదలైన జీవో నెంబర్‌లో ఎక్కడైనా ఒక్క పదమైనా రాయలసీమకు నీళ్లిస్తున్నామని పేర్కొన్నారా?
 
16.9 శాతం బోనస్ అంటే.. అవినీతి కాదా?
ఇక పట్టిసీమ టెండర్ల విషయానికి వస్తే (టెండరు పత్రాలను చూపిస్తూ) వీటిని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేయాలి.. అని పేర్కొన్నారు. టెండర్లు పిలిచారు. తరువాత ఏం జరిగింది? ప్రీ రిక్వయిర్‌మెంట్స్ అన్నీ కూడా కేవలం మెగాకి, ఇంకొకటి ఎల్ అండ్ టీ వీళ్లు మాత్రమే పాల్గొనేలా చేశారు. 21.9 శాతం ఎక్సెస్ టెండర్లు వేసిన తరువాత అది చంద్రబాబు వద్దకు వచ్చింది. వైఎస్ జీవించి ఉన్నపుడే ఓ జీవో ఉంది.

ఇంతకు ముందు టెండర్లలో పది శాతం కన్నా ఎక్సెస్ దాటితో వారికి పనులు ఇచ్చేదానికి లేదు. అలాంటి జీవోను వైఎస్ సవరించి 5 శాతం కన్నా ఎక్కువ ఉంటే ఇచ్చేది లేకుండా మార్పు చేశారు. 133 నెంబరు జీవో అది. ఇక్కడ టెండర్లో 21.9 ఎక్సెస్ కోట్ చేస్తే చంద్రబాబు ఏం చేశారో తెలుసా..? దానిలో ఆయన 5 శాతం ఎక్సెస్ అని సవరించి 16.9 శాతం బోనస్ అన్నారు. టెండరు పిలిచిందే ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేయాలని.. అలాంటిదిసంవత్సరంలో పూర్తి చేస్తే 16.9 శాతం బోనస్ ఏంటి? ఇది అవినీతిగా కనిపించడం లేదా’’ అని ఆయన ప్రశ్నించారు.
 
ప్రభుత్వం వల్ల జాప్యమైతే ఫర్వాలేదట...
‘‘ఈ ప్రాజెక్టు నిజంగా సంవత్సరం లోపు పూర్తవుతుందా అంటే అదీ లేదు. టీడీపీ గెజెట్ పత్రిక ఈనాడులోనే ఈ పథకం పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు పడుతుందని రాశారు. గుత్తేదారుల ఒప్పందానికే నాలుగు నెలలు. భూసేకరణ వివాదాలు సమస్యాత్మకమే అని రాశారు. ఎంత దారుణంగా ఉన్నాయనంటే.. ఒక పక్క 16.9 శాతం బోనస్ మరో వైపు ప్రభుత్వం తప్పిదం వల్ల ఆలస్యం అయితే ఫర్వాలేదని పెట్టారు. ఏ కాంట్రాక్టరయినా కూడా నా వల్ల జాప్యం అయిందంటాడా? ప్రభుత్వం వల్లనే జాప్యం అయిందనరా? ఎవరిని మోసం చేయడానికండీ ఇది..? ఇవన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తే మా నోట్లో నుంచి ఈ మాటలొస్తే చంద్రబాబు అంతటి అవినీతి సీఎం దేశంలోనే ఎవరూ ఉండరని ముద్ర పడుతుందని చర్చకు రాకుండా గొంతు నొక్కేందుకు యత్నం చేస్తున్నారు’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.  
 
మేం మాట్లాడతామంటే.. నలుగురితో తిట్టించటమే పని...
‘‘వాళ్లు మాట్లాడతారు. ఆ తరువాత మేం ఏదైనా మాట్లాడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ వెంటనే కట్ అవుతుంది. దాని తరువాత కనీసం నలుగురితో తిట్టిస్తారు. జగన్ అట్లా, జగన్ ఇట్లా.. వైఎస్ ఇట్లా వైఎస్ అట్లా.. అని ఆ నలుగురూ తిట్టాక మళ్లీ పది నిమిషాలు మాకు మైక్ ఇస్తారు. మళ్లీ కొద్ది సేపు కూడా కాదు. చంద్రబాబును కాస్త అంటున్నామంటే చాలు వెంటనే చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ స్పీకర్ వద్దకు వచ్చి బాబు చెబుతున్నారు మైక్ కట్ చేయండని ఆయన చెవిలో చెబుతారు. చెప్పిన వెంటనే మైక్ కట్. మళ్లీ అటు వైపు నుంచి ధూళిపాళ్ల నరేంద్రను లేపుతారు.

ఆయనకు లేచే అధికారం లేకపోయినా లేస్తారు. మళ్లీ అదే రికార్డు.. జగన్ అట్లా, జగన్ ఇట్లా, వైఎస్ అట్లా, ఇట్లా.. అని తిట్టడం. ఏమిటండీ అసెంబ్లీ జరుగుతున్న తీరు? బడ్జెట్ పెట్టి 2 రోజులైంది.. మేం ఏదైనా మాట్లాడితే సుదీర్ఘంగా నలుగురితో మాట్లాడిస్తారు. మా తరఫు నుంచి ఒకరికి. బాబుకు కాస్త తగులుతుందనుకోగానే వెంటనే మైక్ కట్.. నలుగురిని లేపండి.. జగన్‌ను తిట్టండి.. రాజశేఖర్‌రెడ్డిని తిట్టండి.. ఇదే తంతు! ఇదంతా ప్రజలు చూస్తున్నారు, పై నుంచి దేవుడు చూస్తున్నాడు. వీళ్లు చేసే పనులకు దేవుడే బుద్ధి చెబుతాడు’’ అంటూ జగన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

‘‘ఇంతకంటే దారుణమైంది. జీవో నెంబర్ 22 ఉంది. పట్టిసీమ అంశం నీరు గారుతుంది కనుక ఇవాళ నేను చెప్పను. ఇంకోరోజు చెబుతా. అదింకా మాస్టర్ కరప్షన్’’ అని ఆయన ముగించారు. సమావేశంలో వైఎస్సార్ సీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, ముఖ్య నేత ఎం.వి.మైసూరారెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డేవిడ్‌రాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రైతువిభాగం నేత నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
 
పట్టిసీమ వల్ల నష్టపోతాం...
 
‘‘గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే పట్టిసీమ వల్ల ఎలా నష్టపోతామో అర్థమవుతుంది. నివేదికలోని 7 ఈ లోని చాప్టర్ 2లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివరించారు. ఇందులోనే 7 ఎఫ్ కూడా ఉంది. ఇవాళ బీజేపీ సభ్యుని చేత అధికారపక్షం 7ఈ ని చదివించారు తప్పితే 7 ఎఫ్‌లో ఏముందో చెప్పరు. ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిన నాటి నుంచే పైన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు రెండు 35 టీఎంసీల నీళ్లు తీసుకుపోతాయి. పనులు మొదలవగానే వాళ్లు ఈ నీటిని తీసుకుంటారు.

ఓ వైపు పోలవరం ప్రాజెక్టును చేపడతామంటున్నాం కనుక ప్రారంభం కాగానే వాళ్లు (రెండు రాష్ట్రాలు) 35 టీఎంసీల నీటిని తీసుకెళతారు. 7 ఎఫ్ ప్రకారం మన రాష్ట్రం కనుక అదనంగా నీటిని మళ్లించుకుంటే ఆ మేరకు మహారాష్ట్ర, కర్ణాటకలు కూడా గోదావరిలో నీటికి గండి పెడతాయి. ఆ అధికారం వారికుంది. ఓ పక్క పోలవరం ప్రారంభం కాగానే 35 టీఎంసీలు, పట్టిసీమకు టెంకాయ కొట్టి పనులు ప్రారంభం కాగానే ఆ ప్రాజెక్టుకు మరో 80 టీఎంసీలు అంటున్నాం కనుక మరో 35 టీఎంసీల నీటిని పై రాష్ట్రాలు కట్ చేసుకుంటాయి. ఇలాంటి వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు?
Share this article :

0 comments: