ఎన్నికల ముంగిట పెట్రో నాటకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికల ముంగిట పెట్రో నాటకం

ఎన్నికల ముంగిట పెట్రో నాటకం

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012



ప్రజలపై సర్కారు కపట ప్రేమ
ఎన్నికల కోడ్ ఉందని తెలిసీ వ్యాట్ తగ్గింపు ప్రతిపాదన
మీడియాకు ముఖ్యమంత్రి కార్యాలయం లీకులు
కేంద్రం లేఖ రాసి ఏడాదైనా స్పందించని వైనం!
ఇప్పుడేమో ఓట్లు దండుకునేందుకు తగ్గింపు డ్రామా
పెట్రోలుపై 3% వ్యాట్ తగ్గిస్తామని ప్రకటనలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: సంక్షేమాన్ని గాలికొదిలి, ప్రజలను ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్న సర్కా రు తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంది. పెనుభారంగా మారిన పెట్రో ధరలను తగ్గించాలంటూ ప్రజలు ముక్త కంఠంతో కోరినా ఇంతకాలం స్పందించని రాష్ట్ర ప్రభుత్వం.. పెట్రోలుపై వ్యాట్‌ను 3 శాతం తగ్గిస్తామం టూ ఉప ఎన్నికలవేళ కొత్త నాటకానికి తెర తీసింది. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న సమయంలో హఠాత్తుగా వ్యాట్ తగ్గింపు ప్రతిపాదన తేవడం ఫక్తు ఓట్ల నాటకమేనన్న వ్యాఖ్యలు పీసీసీ వర్గాల నుంచే విన్పిస్తున్నాయి!
ఈసీ అనుమతించదని తెలిసీ..
లీటరు పెట్రోలు ధర 2010 డిసెంబర్ నుంచి కేవలం గత ఏడాదన్నర కాలంలో ఏకంగా రూ.26 పెరిగింది. తాజాగా పెరిగిన రూ.8.30ను పక్కన పెట్టి చూసినా అంతకుముందు ఏడాదిలో ఆరుసార్లు రూ.18 మేరకు పెంచారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారైనా వ్యాట్ తగ్గించేందుకు, ప్రజలపై భారాన్ని కాస్తయినా తొలగించేందుకు ప్రయత్నించలేదు. ‘పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలు అమ్మకం పన్ను తగ్గిస్తే ప్రజలకు కొంతవరకు భారం తగ్గుతుంది.

ఆ దిశగా చర్యలు తీసుకోండి’ అంటూ కేంద్రం ఏడాది క్రితం అన్ని రాష్ట్రాలకూ సూచించింది. దీనికి కొన్ని రాష్ట్రాలు స్పందించినా మన ప్రభుత్వం అసలే పట్టించుకోలేదు! అలాంటిది.. పెట్రోలుపై 3 శాతం వ్యాట్ తగ్గించేందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సిందిగా వాణిజ్య పన్నుల శాఖను ప్రభుత్వం ఆదేశించిందంటూ సీఎం కార్యాలయం బుధవారం మీడియాకు లీకులిచ్చింది. ఈసీ అనుమతిస్తే లీటరు పెట్రోలుపై రూ.1.5 నుంచి రూ.1.8 దాకా ధర తగ్గుతుందని గొప్పగా చెప్పుకొచ్చింది. జూన్ 12న ఉప ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లో ఉంది.

ఇలాంటి కీలక సమయంలో ఓటర్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే నిర్ణయాలేవీ ప్రభుత్వాలు తీసుకోకూడదు. పన్నుల తగ్గింపు వంటివి ఓటర్లను ప్రలోభపెట్టడమేనని కోడ్ స్పష్టం చేస్తోంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఈ సమయంలో వ్యాట్ తగ్గింపునకు ఈసీ అనుమతించదనీ తెలుసు. కానీ తెలిసి కూడా, పెట్రోలుపై 3 శాతం వ్యాట్ తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లీకులు ఇవ్వడంతోనే అధికార కాంగ్రెస్ కుయుక్తులు బయటపడుతున్నాయి. ఇదంతా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని స్పష్టమవుతోంది.
ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించినా ఎన్నికల సంఘమే ఒప్పుకోలేదనే ప్రచారంతో ఓట్లు గుంజే ఎత్తుగడే ఈ లీకుల వెనుక వ్యూహమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పెట్రో భారాన్ని తగ్గించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే పొరుగు రాష్ట్రాలతో సమానంగా తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 3 శాతం తగ్గించడమంటే మొక్కుబడి కోసం, ప్రచారం కోసమేనని విమర్శిస్తున్నారు. పెట్రో ధరల పెంపునునిరసిస్తూ వామపక్షాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఆందోళనలు నిర్వహించింది.

ఆ రాష్ట్రాల్లో ఇలా..!
పెట్రోలుపై హర్యానాలో 20.5 శాతం, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్‌ల్లో 24, తమిళనాడులో 27, మధ్యప్రదేశ్‌లో 30.04 శాతం వ్యాట్ ఉంది. మన రాష్ట్రం మాత్రం ఏకంగా 33 శాతాన్ని ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. పెట్రో ఉత్పత్తుల ద్వారా వ్యాట్ రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి 2010-11లో రూ.6,500 కోట్ల ఆదాయం సమకూరింది. 2011-12లో ఇది రూ.10,000 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్ల రాబడి వస్తుందని అంచనా. అంటే పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ రాబడి కేవలం రెండేళ్లలోనే రెట్టింపన్నమాట! ఇంతటి ఆదాయం వస్తున్నా, ప్రజా సంక్షేమార్థం దాన్ని కాస్తయినా తగ్గించేందుకు ఇంతకాలంగా సర్కారు ససేమిరా అంది. ఇప్పుడేమో తగ్గింపు ముసుగులో ఓట్ల వేటకు తెర తీసింది!
Share this article :

0 comments: