సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి

సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

 కుట్రలు, కుతంత్రాలతో మనుగడ సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు చెప్పారు. నర్సన్నపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిలకు లభించిన ప్రజాదరణే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 

‘‘విజయమ్మకు నర్సన్నపేటలో ప్రజల నుంచి లభించిన అపూర్వ ఆదరణ ఒక శాంపిల్ మాత్రమే. ఆమె పర్యటన పూర్తయ్యేనాటికి ప్రభంజనం వీస్తుంది. జగన్‌ను దోపిడీదారుడని చిత్రీకరించిన కొందరు రాజకీయ నాయకులకు నర్సన్నపేట బహిరంగ సభ ఓ కనువిప్పు కావాలి. మారుమూలన ఉన్న అంత చిన్న నియోజకవర్గంలోనే అసంఖ్యాకంగా జనం హాజరయ్యారంటే వైఎస్ కుటుంబీకులకు ఉన్న ప్రజాదరణ ఏమిటో గ్రహించాలి’’ అని చెప్పారు. 

‘‘జగన్ ఏ తప్పూ చేయలేదు కనుకనే వీరుడి మాదిరిగా ధైర్యంగా ఉన్నారు. సోనియాగాంధీకి లొంగిపోవడంగానీ, కాంగ్రెస్ అధిష్టానానికి వంగి దండాలు పెట్టడంగానీ చేయలేదు. వస్తే రానీ కష్టాల్...నష్టాల్... అనే రీతిలో పోరాటానికే సిద్ధమయ్యారు. ఆయన జైలులో ఉండి కూడా తల్లి, సోదరిని సమాయత్తం చేసి ఉప ఎన్నికల ప్రచారానికి పంపారు. జగన్‌ను సంధికి పిలిచినట్లు సీబీఐ విచారణకు పిలిచి, మూడు రోజుల పాటు ప్రశ్నలతో చిత్రవధ చేసి, అరెస్టు చేశారు. విచారణ జరిగినప్పుడు బొబ్బిలి రాజా, ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు అక్కడే ఉన్నారు. సీబీఐ వేధింపులను చూసి ఆయన ఆవేదన చెందారు. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు’’ అని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నలభై వేల మంది పార్టీ కార్యకర్తలను నిర్బంధంలోకి తీసుకొని, తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. తమ నాయకుడు జగన్ పిలుపు మేరకు ఎక్కడా కార్యకర్తలు ఆవేశానికి లోనుకాలేదని, ప్రభుత్వం తమ సహనాన్ని చేతగానితనంగా భావిస్తే మంచిది కాదని జూపూడి హెచ్చరించారు. 

జగన్ అరెస్టు అయిన రోజున రోడ్డుపై ధర్నా చేసిన వైఎస్సార్ కుటుంబం పట్ల ప్రవర్తించిన తీరుపై అభ్యంతరం తెలిపారు. ‘‘విజయమ్మ ఒక ఎమ్మెల్యే. 30 ఏళ్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య. అటువంటి మహోన్నత మహిళను నడిరోడ్డుపై రెక్కపట్టుకుని ఈడ్చిన తీరును చూసి ప్రజలంతా చలించిపోయారు. వైఎస్ కుటుంబ సభ్యులు కార్చిన కన్నీళ్లు ఈ రాష్ట్రాన్నే కరిగిస్తున్నాయి. కానీ కొంతమంది రాజకీయ నాయకుల గుండెలు మాత్రం కరగడంలేదు. రాష్ట్రంలోనే కాదు.. దేశ చరిత్రలోనే ఇలాంటి సంఘటన జరగలేదు’’ అని జూపూడి అన్నారు. 

‘‘రెండేళ్లు అధికారాన్ని కాపాడుకోవడానికి కిరణ్ సర్కారు పడరాని పాట్లు పడుతోంది. ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. జగన్ జైలుకు వెళితే కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అయితే, జైల్లో ఉండే వారందరూ దొంగలు కాదని, వారిపై నేరారోపణ మాత్రమే జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. జగన్ ఆస్తుల కేసులో కీలకమైన 26 జీవోల జారీ అక్రమమో, సక్రమమో హైకోర్టుకు చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వమే అసలైన దొంగ’’ అని జూపూడి వ్యాఖ్యానించారు. జగన్‌ను అరెస్టు చేసి ఉప ఎన్నికల్లో గెలవొచ్చని ఊహాలోకంలో విహరించే వారికి నిరాశే మిగులుతుందని చెప్పారు. విజయమ్మ నేతృత్వంలో 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం గెలవడం ఖాయమని చెప్పారు. విజయమ్మను ఆదరిస్తున్న ప్రజలకు జూపూడి కృతజ్ఞతలు తెలిపారు.
Share this article :

0 comments: