నా భర్త భద్రతకు ఆదేశాలివ్వండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » నా భర్త భద్రతకు ఆదేశాలివ్వండి

నా భర్త భద్రతకు ఆదేశాలివ్వండి

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

జగన్‌పై కేసులన్నీ రాజకీయ దురుద్దేశపూరితమే
అన్యాయంగా అరెస్టు చేయడంతో జైల్లో ఉన్నారు
గతంలో జైల్లో హింసాత్మక, హత్య ఘటనలు చోటుచేసుకున్న ఉదంతాలున్నాయి
ఈ నేపథ్యంలో ఎంపీ, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అయిన నా భర్త భద్రతపై మాకు భయంగా ఉంది
పోలీసులు, జైలు అధికారులు పట్టించుకోవడం లేదనే ఆందోళన మాలో ఉంది
కొన్ని రాజకీయ శక్తులు, కొందరు శత్రువులు తమకు అంది వచ్చే ప్రతి అవకాశాన్నీ పూర్తిగా వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు
అందుకే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నా
హైకోర్టుకు చెప్పిన భారతి.. నేడు విచారణ 


హైదరాబాద్, న్యూస్‌లైన్: జైల్లో ఉన్న తన భర్త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, జైళ్ల శాఖ డీఐజీలను అందులో ప్రతివాదులుగా చేర్చారు. ‘‘జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ న భర్తను అన్యాయంగా అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. సీబీఐ కస్టడీ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఆయన్ను రిమాండ్‌కు పంపింది. దాంతో ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. జగన్ కడప పార్లమెంట్ స్థానం నుంచి 5.43 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. 

అంతేగాక రాష్ట్రంలో ప్రబల రాజకీయ శక్తిగా ఎదుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడు. నా భర్తపై ఉన్న శత్రుభావంతో, కొందరు రాజకీయ నాయకుల మద్దతుతో కేసు నమోదు చేశారు. శత్రుత్వమున్న వ్యక్తులే హైకోర్టును ఆశ్రయించి, పిటిషన్లు వేశారు. అవన్నీ రాజకీయ దురుద్దేశపూరితమే. నా భర్తను, మా కుటుంబాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వేధింపులకు గురి చేసేందుకే కేసులు పెట్టారు. వాటిని మేం చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రస్తుతం జైల్లో ఉన్న నా భర్తకు తగిన భద్రత లేకుండా పోయింది. 

రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఆయన భద్రత గురించి జైలు అధికారులు పట్టించుకోవడం లేదనే భయాందోళన నాకుంది. జైలులో పలువురు విచారణ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న వారున్నారు. గతంలో జైలులో పలు హింసాత్మక, హత్య ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్లే జగన్ భద్రత గురించి మేం భయపడుతున్నాం. రాజకీయాల్లో నా భర్త ఎదుగుదలను చూడలేని కొన్ని రాజకీయ శక్తులు, నా భర్త పట్ల శత్రుభావం వ్యక్తం చేసే కొందరు వ్యక్తులు తమకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ఆయన్ను రాజకీయంగా నిరోధించేందుకు వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని మేం నమ్ముతున్నాం. నా భర్త ఎంపీ అయినా ఆయన భద్రత విషయంలో జైలు అధికారులు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. వారి చర్యలు నా భర్త భద్రతకు ప్రమాదం కలిగించేలా, రాజ్యాంగం ద్వారా ఆయనకు సంక్రమించిన హక్కులను కాలరాసేలా ఉన్నాయి. ఆయన భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాసినట్టే అవుతుంది. 

నా భర్తకేమైనా హాని జరిగితే నాతో పాటు, మా కుటుంబసభ్యుల జీవితాలపై తీవ్ర ప్రభావముంటుంది. జగన్ భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. అందుకు మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయిస్తున్నా’’ అని భారతి పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ భద్రతకు తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం విచారించనున్నది.
Share this article :

0 comments: