విపక్ష ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్ల ఎర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విపక్ష ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్ల ఎర

విపక్ష ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్ల ఎర

Written By news on Monday, February 29, 2016 | 2/29/2016


♦ విపక్ష ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్ల ఎర
♦ స్వయంగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు
♦ ఆశ్చర్యపోతున్న అధికార పార్టీ నాయకులు
♦ హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రలోభాల పర్వం మరో మెట్టు దిగజారింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడం కోసం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగి డబ్బు వెదజల్లడం చూసి రాష్ర్టం నివ్వెరపోతోంది. ఆదివారం టీడీపీలో చేరిన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజుకు అధికార పార్టీ భారీ ప్యాకేజీ అందిందంటూ ప్రచారం జరగడం, సీఎం సమక్షంలోనే బేరసారాలన్నీ సాగడం చూస్తే విలువలు ఏ స్థాయికి దిగజారాయో తెలుస్తోందని విశ్లేషకులంటున్నారు.

ఒక ఎమ్మెల్యేకి రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు డబ్బు ఇవ్వడానికి కూడా అధికారపార్టీ సిద్ధమైందంటే రాష్ర్టంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో అర్ధమౌతోందని విమర్శకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ వెన్నులో వణుకు పెరుగుతోంది. హామీల అమలులో ఘోరంగా విఫలమవడం, పరిపాలన పూర్తిస్థాయిలో దిగజారడం, పైనుంచి కిందివరకు అవినీతి విశృంఖలం కావడం... వీటన్నిటిపైనా ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుండడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి అధికారపార్టీ అనేక ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఊహించని బేరాలతో నలుగురైదుగురిని ఆకర్షించి ఈ గండం నుంచి గట్టెక్కుదామని భావిస్తోంది.

పాలన గాలికొదిలి..
నిజానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి ఎలాగైనా సరే ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి, అధికారపార్టీ కేంద్రమంత్రి, రాష్ర్టమంత్రులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మినహా ఆ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలతో రకరకాల మార్గాలలో సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ స్థాయిలో డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఎరవేసి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా నలుగురైదుగురు మినహా వారి ప్రలోభాలకు లొంగకపోవడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి, మంత్రులంతా పరిపాలనను పూర్తిగా గాలికొదిలేశారు. బేరసారాలు, సంప్రదింపులలో మునిగిపోయారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై అన్ని రకాల అస్త్ర శస్త్రాలతో ప్రతిపక్ష పార్టీ సిద్ధమౌతుండడంతో గందరగోళ పరిచి బైటపడదామన్న దుగ్ధతోనే అధికార పార్టీ అవసరం లేకపోయినా ఫిరాయింపులను ఎగదోస్తోందని పరిశీలకులంటున్నారు. బేరసారాలు భారీ స్థాయికి చేరుకోవడం, రూ. 20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు పెరగడంతో అధికార పార్టీ నాయకులు కూడా విస్తుపోతున్నారు. ఆదివారంనాడు పార్టీలో చేరిన సందర్భంగా డేవిడ్ రాజు ముఖ్యమంత్రికి వంగివంగి సలాములు చేస్తుండడం చూస్తుంటే ఈ ప్యాకేజీ ఇంకా ఎక్కువగా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.

టీడీపీలోకి డేవిడ్‌రాజు
సాక్షి, విజయవాడ బ్యూరో: వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం ఆయనకు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి శిద్ధా రాఘవరావులు డేవిడ్‌రాజును చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వెళ్లగానే డేవిడ్‌రాజు సీఎంకు పాదాభివందనం చేశారు. పార్టీలో చేరిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత కారణాల వల్ల టీడీపీని వదిలి వైఎస్సార్‌సీపీలో చేరి,ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందానని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని విపక్షం సవాల్ విసరడంపై స్పందిస్తూ... ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. రాజీనామా అవసరం లేదని అనుకుంటున్నట్లు చెప్పారు.
Share this article :

0 comments: