బినామీ దందా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బినామీ దందా...

బినామీ దందా...

Written By news on Wednesday, March 2, 2016 | 3/02/2016


నారా  వారి  బినామీ దందా...వీడియోకి క్లిక్ చేయండి
రాజధాని  దురాక్రమణ

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని రాబందుల పాలైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు... అధికార పార్టీ నేతలందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో అడ్డగోలుగా భూదోపిడీకి తెగబడ్డారు. రాజధాని ప్రాంతంపై తొలి కేబినెట్ సమావేశంలోనే తీసుకున్న నిర్ణయాన్ని దాచిపెట్టి... పూటకోమాట, రోజుకో ప్రకటనతో ప్రజల్లో గందరగోళం సృష్టించారు. అసైన్డ్, లంక భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ ప్రచారం చేయించి ప్రజలను  భయాందోళనలకు గురిచేశారు. ఆపైన రైతులను మభ్యపెట్టి, మాయచేసి... మాట వినని వారిని బెదిరించి తాము రహస్యంగా నిర్ణయించిన రాజధాని ప్రాంతంలో 25 వేల ఎకరాలకు పైగా భూములు కొనుగోలుచేశారు. 29 గ్రామాల్లోని రైతులకు అతి తక్కువ ధరలు చెల్లించి భూములు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రాజధాని ప్రాంతాన్ని ప్రకటించడంతో ఆ భూములకు రెక్కలు వచ్చాయి. నాలుగైదు లక్షల రూపాయలకు కొన్న భూములు రూ. నాలుగైదు కోట్లు ధర పలుకుతున్నాయి. రాజధాని పేరుతో అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ. లక్షల కోట్లకుపైగా లూటీ చేసిన  చంద్రబాబు అండ్ కో భూదురాగతమిది... ఇప్పటికి బయల్పడింది గోరంతే... ఊహించని స్థాయిలో జరిగిన అసలు దోపిడీ ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది...

నారా లోకేశ్  బినామీ దందా...
బినామీలువేమూరు రవికుమార్, తదితరులుhttp://img.sakshi.net/images/cms/2016-03/71456867079_Unknown.jpg
► కొనుగోలు 500 ఎకరాలు
►  చెల్లించినది రూ. 50 కోట్లు
►  ప్రస్తుత విలువ  రూ. 650 కోట్లు

రాజధాని భూకుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్‌ది ప్రధాన పాత్ర. ఆయన తన బినామీల్లో అత్యంత ప్రధానమైన వేమూరు రవికుమార్ ప్రసాద్ పేరుతో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఎకరా, రెండెకరాలు వేర్వేరు పేర్లతో అగ్రిమెంట్లు రాయించుకుని,రాజధాని ప్రకటన వచ్చాక తాపీగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. చినబాబు రాజధాని ప్రాంత రైతుల నెత్తిన కుచ్చు టోపీ ఎలా పెట్టారో మీరూ చదవండి...

బినామీ పేర్లతో 500 ఎకరాల కొనుగోలు
రాజధానిపై శాసనసభలో సెప్టెంబర్ 4న ప్రకటన చేయకముందే.. ప్రధాన రాజధాని ప్రాంతం(కోర్ కేపిటల్)కు సమీపంలో ఉండే అమరావతి మండలంలో లోకేశ్ బినామీ వేమూరు రవికుమార్ భారీ ఎత్తున భూముల కొనుగోలుకు తెరతీశారు. అమరావతి మండలం ధరణికోటలో 59/ఎ2/1, 59/ఎ2/2ఎ, 59/ఎ2/2బి1, 59/ఎ2/3ఎ, 59/ఎ/2, 59/బి, 61/ఎ1, వైకుంఠపురంలో 25 సర్వే నంబర్లలో 502.31 ఎకరాలకుపైగా భూమిని డాక్టర్ వేమూరు రవికుమార్ ప్రసాద్, ఆయన భార్య అనురాధ, గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల పేర్లతో కొనుగోలు చేశారు. ఎకరానికి  కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.9 లక్షలు మాత్రమే చెల్లించారు. రైతులకు అరకొరగానే అడ్వాన్సులు ఇచ్చారు. ఆగస్టు 5, 2015న తక్కిన పైకం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంతటితో ఆగలేదు.
 
బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నారిలా..
అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న సొమ్మును వైట్ మనీగా మార్చుకోవడానికి లోకేశ్ తన బినామీలతో వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అమరావతి మండలం ధరణికోట, వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ రేటు ఎకరం భూమి రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంది. కానీ.. వేమూరు రవికుమార్, ఆయన భార్య అనురాధ, గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ ప్రైవేటు లిమిటెడ్ తదితర సంస్థల పేరుతో కొనుగోలు చేసిన భూముల విలువను ఎకరా రూ.71,20,108  మేర డాక్యుమెంట్‌లో చూపించడం గమనార్హం. అంటే పది రెట్లు మార్కెట్ రేటు పెంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తద్వారా బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఎవరీ రవికుమార్?

ఈవీఎంలు చోరీ చేసి, ట్యాంపరింగ్ చేసి భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు యత్నించిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ సోదరుడే వేమూరు రవికుమార్. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున సోషల్ మీడియాలో ప్రచార బాధ్యతలను వేమూరు హరికృష్ణ ప్రసాద్ నిర్వర్తించారు. టీడీపీ, హెరిటేజ్ ఫుడ్స్, ప్రభుత్వ ఐటీ వ్యవహారాలను పర్యవేక్షించే వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను.. చంద్రబాబు అధికారం చేపట్టగానే ఈ-గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఇన్నోవేషన్ సొసైటీల్లో సభ్యునిగా నియమించారు. రూ.333 కోట్లతో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశ టెండర్ల మదింపు, పర్యవేక్షణ కమిటీల్లో సభ్యునిగా నియమించారు. వేమూరు రవికుమార్ సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు అమెరికా పర్యటనకు ఏర్పాట్లు చేశారు. అందుకు క్విడ్ ప్రోకోగా చంద్రబాబు అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 9న రవికుమార్‌ను ప్రభుత్వ సలహాదారు (ప్రవాస తెలుగు ప్రజల వ్యవహారాలు, సేవలు, పెట్టుబడులు)గా నియమించారు. ఇప్పుడు ఆ రవికుమార్, ఆయన భార్య, సంస్థల పేర్ల తో 500 ఎకరాలకుపైగా భూములను కొనుగోలు చేశారు.
 
సుజనా భూదోపిడీ
బినామీలు: శ్రీ కళింగ గ్రీన్‌టెక్ కెమికల్స్, శివరామకృష్ణhttp://img.sakshi.net/images/cms/2016-03/71456867256_Unknown.jpg
కొనుగోలు 700 ఎకరాలు
చెల్లించినది రూ. 35 కోట్లు
ప్రస్తుత విలువ రూ. 700 కోట్లు

ఆయనో కార్పొ‘రేటు’ రాజకీయ నేత. సీఎం చంద్రబాబునాయుడు కోటరీలో ముఖ్యుడు. బ్యాంకుల నుంచి వందలాది కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని ఎగ్గొట్టడంలో ఆయనది అందెవేసిన చేయి. ఆ జగజ్జంత్రీ నేర్పరితనానికి మెచ్చి రాజ్యసభకు పంపిన చంద్రబాబు.. నరేంద్రమోదీ కేబినెట్‌లో చోటు దక్కేలా చేశారు. ఆయనే కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి. బ్యాంకులకు రూ.100 కోట్లకుపైగా టోపీ పెట్టి వెనకేసుకున్న సొమ్ముతో ఆయన రాజధాని ప్రాంతంలో ఏకంగా 700 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. మరో 130 ఎకరాలకుపైగా అటవీ భూమిని కబ్జా చేసే యత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు.

సోదరుడి పీఏ పేరుతో...
సుజనా చౌదరి సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్. తన సోదరుడి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసే హర్షానంద పేరుతో శ్రీ కళింగ గ్రీన్ టెక్ కెమికల్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరుతో రాజధాని ప్రకటనకు ముందే కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సర్వే నంబర్లు 399-7, 402-1ఏ, 403-4, 5, 6, 404-1, 5, 6, 9బీ, 11, 12, 410-2, 412, 413, 415, 416, 417-4, 427-2, 428-1, 2, 429, 431, 432-1, 433, 434, 437లలో 126.44 ఎకరాల భూమిని ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటన తర్వాత అక్కడ ఎకరం రూ.50 లక్షలకు పైగా పలుకుతుండటం గమనార్హం. అంటే.. రాజధాని ఎక్కడ వస్తుందన్న సమాచారం ముందే తెలుసుకున్న కేంద్ర మంత్రి గుడిమెట్ల రైతులను మోసం చేసి రూ.56.89 కోట్ల మేర లబ్ధి పొందినట్లు విశదమవుతోంది. ఇప్పుడు ఆ భూములకు సమీపంలోనే 130 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయి. వాటిని కబ్జా చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ అటవీ భూముల్లోకి మేతకు పశువులను కూడా వెళ్లనివ్వకుండా సుజనా చౌదరి నియమించిన రౌడీలు అడ్డుకుంటున్నారని గుడిమెట్ల వాసులు వాపోతున్నారు.
 
ఆగని దోపిడీ...
సుజనా చౌదరి భూదోపిడీ వీరులపాడు, కంచికచర్ల మండలాలకూ విస్తరించింది. వీరులపాడు మండలం పొన్నవరంను దత్తత తీసుకున్న సుజనా చౌదరి ఆ గ్రామంలో తన తండ్రి వై.జనార్దనరావు పేరు తో సర్వే నంబరు 38-1లో 5.39 ఎకరాలు, సోదరుడు వై.శివ రామకృష్ణ పేరుతో సర్వే నంబరు 41లో 3.5 ఎకరాలు కొనుగోలు చేశారు. కంచికచర్ల మండలం కీసర వద్ద సర్వే నంబరు 116/3లో 3.60 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇదే రీతిలో రాజధాని ప్రాంతంలో కృష్ణా జిల్లా చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలాల్లో 700 ఎకరాలకుపైగా భూమిని సుజనా చౌదరి కొనుగోలు చేసినట్లు తెలిసింది. తన వద్ద డబ్బులు ఉన్నాయని.. భూములు కొనుగోలు చేస్తే తప్పేమిటని రాజధాని ప్రకటన వెలువడ్డ తర్వాత విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ సుజనా అంగీకరించడం.. వారు రాజధాని రైతులను మోసం చేసి కుట్రపూరితంగా భూములు కొన్నారనడానికి నిదర్శనం.
 
మురళీమోహన్  రియల్ భేరి
 కొనుగోలు 53 ఎకరాలుhttp://img.sakshi.net/images/cms/2016-03/61456867318_Unknown.jpg
చెల్లించినది 16 కోట్లు
► ప్రస్తుత విలువ  212 కోట్లు

 హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, పరిసర ప్రాంతాల్లో సినీనటుడు మాగంటి మురళీమోహన్ సంస్థ జయభేరి పేరిట సాగిన భూదందా మీకు గుర్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తనకు అత్యంత సన్నిహితుడైన ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ను రంగంలోకి దింపారు.

కోర్ కేపిటల్‌కు సమీపంలోనే...
హైటెక్ సిటీ, పరిసర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టి భారీగా సొమ్ము చేసుకున్న మురళీ మోహన్ ఇప్పుడు కలకత్తా- చెన్నై జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లోని  భూములపై దృష్టి పెట్టారు. ప్రధాన రాజధాని ప్రాంతం(కోర్ కేపిటల్)కు అత్యంత సమీపంలో తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న81/3సీ, 80/4బీ, 81/2, తదితర ఎనిమిది సర్వే నంబర్లలోని 2.775 హెక్టార్ల (సుమారు 7 ఎకరాలు) విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మించేందుకు జయభేరీ సంస్థ సిద్ధమైంది. ఆ మేరకు భూముల యజమానులతో యార్లగడ్డ రవి కిరణ్, గీతాంజలి, నిఖిల్ ఆదిత్య, శ్రీధీర, బెస్ట్ ఫార్చూన్ కంపెనీ పేరిట ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జయభేరి సంస్థకు 14 అంతస్తులతో రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మించడానికి జూలై 21, 2015న సీఆర్‌డీఏ అధికారులు ఆగమేఘాలపై అనుమతి ఇచ్చేశారు. దీంతో జయభేరి సంస్థ బహుళ అంతస్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందే బ్రోచర్లతో హడావుడి చేసి.. ఇప్పటికే సగానికి పైగా ప్లాట్లను ఎన్‌ఆర్‌ఐలకు అమ్మేసి సొమ్ము చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు సమీపంలోని 53 ఎకరాల భూమిని ఎకరం రూ.30 లక్షల చొప్పున తన బినామీ పేర్లతో మురళీమోహన్ కొనుగోలు చేశారు. ఈ భూమిలో స్టార్ హోటళ్లు, షాపింగ్‌మాల్స్, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
 
దళితులకు రావెల ద్రోహం
భార్య రావెలశాంతి జ్యోతి
కొనుగోలు 55  ఎకరాలుhttp://img.sakshi.net/images/cms/2016-03/41456867376_Unknown.jpg
చెల్లించినది 5.5 కోట్లు
ప్రస్తుత విలువ  82.5 కోట్లు

రాజధాని పరిసర ప్రాంతాల్లో అసైన్డు భూములను కొనుగోలు చేయడంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తన సహచర మంత్రులతో పోటీ పడ్డారు. ఇతర మంత్రులు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేస్తే.. రావెల కిశోర్‌బాబు ఏకంగా తన భార్య రావెల శాంతిజ్యోతి పేరుపై భారీ ఎత్తున భూములు కొన్నారు. ఈ క్రమంలో అసైన్డు భూముల చట్టాన్ని అపహాస్యం చేశారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో అధిక శాతం అసైన్డు భూములు దళిత రైతుల చేతుల్లో ఉన్నాయి. ఆ రైతుల హక్కులను పరిరక్షించాల్సిన మంత్రి రావెల.. వారికి తీరని ద్రోహం చేశారు. అసైన్డు భూములను ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందని తన సహచరులతో ప్రచారం చేయించి.. దళిత రైతులను భయాందోళనకు గురిచేశారు. ఎకరం భూమిని గరిష్ఠంగా రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. మంగళగిరి మండలం కురగల్లులో తెనాలి రూబేనుకు సర్వే నెంబరు 563/3లో 0.83 ఎకరాల అసైన్డు భూమి ఉంది. ఈ భూమి ఆ కుటుంబానికి జీవనాధారం. ఆ భూమిని తన భార్య రావెల శాంతి జ్యోతి పేరుతో కొనుగోలు చేసిన మంత్రి రావెల.. మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆగస్టు 5, 2015న పెండింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సుమారు 25 ఎకరాల అసైన్డు భూమిని జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేయించుకున్నారు. తన సన్నిహితుడు తేళ్ల శ్రీనివాసరావుకు చెందిన మైత్రీ ఇన్‌ఫ్రా పేరుతో మంగళగిరి మండలం నవులూరులో సర్వే నంబరు 613/2లో 0.75 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్టోబరు 16న రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తమ్మీద బినామీలు, తన భార్య పేరుపై సుమారు 55 ఎకరాల అసైన్డు, పట్టా భూములను రావెల కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
 
వియ్యంకుడి అల్లుడికి రూ.295 కోట్ల ‘భూ’కట్నం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దు ర్వినియోగానికి ఇదో పరాకాష్ట. తన వియ్యం కుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్‌పీ రామారావుకు చెందిన వీబీసీ(విశాఖ బాట్లింగ్ కంపెనీ) ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ సంస్థకు ప్రధాన రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలోని జగ్గయ్య పేట మండలం జయంతిపురంలో రూ.300 కోట్ల విలువైన 498.93 ఎకరాల భూమిని రూ.4.98 కోట్లకే ధారాదత్తం చేశారు. అంటే.. రూ.295 కోట్ల మేర వియ్యంకుడి అల్లుడికి భూకట్నంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత ఈ భూమికి మరింత విలువ జోడిం చాలన్న లక్ష్యంతో జగ్గయ్యపేటను సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అధికారవర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి కుమారుడు ఎంఎస్‌పీ రామారావు కుమారుడికి బాలకృష్ణ రెండో కూతురును ఇచ్చి ఇటీవల వివాహం చేసిన విషయం తెలిసిందే. బినామీతో బంధుత్వం కలుపుకున్న సీఎం చంద్రబాబునాయుడు.. వీబీసీఎల్‌కు కేటాయించిన భూములను సీఆర్‌డీఏ పరిధిలోకి తెస్తూ సెప్టెంబర్ 22న ఉత్తర్వులు జారీ చేయించారు.
 
ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు’
కొనుగోలు 196 ఎకరాలు
చెల్లించినది రూ. 39 కోట్లుhttp://img.sakshi.net/images/cms/2016-03/61456867467_Unknown.jpg
ప్రస్తుత విలువ 784 కోట్లు

 రాజధాని ప్రాంతంలో బినామీలను అడ్డుపెట్టుకుని నిరుపేద దళిత రైతులకు చెందిన అసైన్డు భూములను కొల్లగొట్టడంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దూకుడు చూపారు. అసైన్డు భూములను ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందని.. భూ సమీకరణ కింద ప్యాకేజీ ఇవ్వదని దళిత రైతులను బెదిరించారు. ఆందోళనలో మునిగిపోయిన దళిత రైతుల నుంచి ఎకరం రూ.కనిష్ఠంగా రూ.10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షల చొప్పున 196.4 ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు. చట్టంలో లోపాలను ఆధారంగా చేసుకుని కొన్ని భూములు బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్, కొన్నింటికి పవర్ ఆఫ్  అటార్నీ చేయించుకున్నారు.
 
ప్రతి అడుగులోనూ ముందుచూపు..
రాజధాని భూసమీకరణ కార్యక్రమం ప్రారంభం నుంచి మంత్రి ప్రత్తిపాటి భూముల కొనుగోలుపై దృష్టిని పెట్టారు. భూ సమీకరణను పర్యవేక్షిస్తూ రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో గ్రామాల్లోని సర్పంచ్‌లు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారి ద్వారా గ్రామాల్లోని అసైన్ఢ్ భూములు కలిగిన కుటుంబాల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. నిరుపేద ఎస్సీలను మోసం చేసి ఎకరా భూమి కేవలం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ధరకే... తనతో సన్నిహిత సంబంధాలు కలిగిన సర్పంచులు, ముఖ్యనేతల పేరు మీద   అసైన్డ్, అటవీ భూములను కొనుగోలు చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 293, 294, 295, 296, 379, మందడం గ్రామంలోని 454, ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన 115, 94 సర్వే నంబర్లు, రాయపూడి గ్రామానికి చెందిన 377, 386 తదితర సర్వే నంబర్లలోని 96.4 ఎకరాల అసైన్డు భూములను గూడూరు సురేశ్ పేరుతో రిజిస్ట్రేషన్, జీపీ చేయించుకున్నారు. మరో బినామీ వెనిగళ్ల రాజారెడ్డి, తన భార్య వెంకాయమ్మ పేర్లపై మరో వంద ఎకరాలకుపైగా అసైన్డు భూమిని జీపీ చేయించుకున్నారు.

ఎవరీ గుమ్మడి సురేశ్?

విజయవాడ బందరు రోడ్డులో ఓ ప్రముఖ వస్త్ర దుకాణం యజమాని గుమ్మడి సురేశ్‌తో మంత్రి ప్రత్తిపాటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంత్రితో కలిసి ఆయన పత్తి వ్యాపారం కూడా  చేస్తూ నాలుగు కాసులు వెనకేసుకున్నారు. అయితే  నాలుగేళ్ల క్రితం వరకూ ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న సురేశ్‌కు 96.4 ఎకరాల భూమిని కొనుగోలు చేసే తాహతు లేదు. పైగా కొనుగోలు చేసిన అసైన్డు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సురేశ్‌కు సాధ్యం కాదు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒత్తిడి వల్లే ఆ భూములను గుమ్మడి సురేశ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని సమాచారం.
 
లింగమనేనితో క్విడ్ ప్రో కో!
 రాజధాని కోసం భూ సమీకరణ పేరుతో మూడు పంటలు పండే అత్యంత విలువైన భూములను రైతుల నుంచి బలవంతంగాhttp://img.sakshi.net/images/cms/2016-03/71456867737_Unknown.jpgలాక్కున్న ముఖ్యమంత్రి సన్నిహితుల భూములను మాత్రం అంగుళం కూడా తీసుకోలేదు. రాజధాని సరిహద్దులు బినామీల భూముల సమీపంలోకి వచ్చి ఆగిపోయాయి. లింగమనేని ఎస్టేట్స్  ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోవడమే అందుకు ప్రబల నిదర్శనం. ఇందుకు ప్రతిగా ముఖ్యమంత్రికి లింగమనేని గెస్ట్ హౌస్‌తో పాటు లింగమనేని ఎస్టేట్స్‌లో బాబు కుటుంబానికి వాటాలు కూడా దక్కాయన్నది బహిరంగ రహస్యం. ల్యాండ్ పూలింగ్ నుంచి భూములను కాపాడడం.. ప్రతిగా గెస్ట్‌హౌస్, వాటాలు అందుకోవడం.. క్విడ్ ప్రో కోకు ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది?
 
లింగమనేనితో బాబు స్నేహ బంధం
లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ లింగమనేని రమేష్ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనే ప్రత్యేక విమానం సమకూర్చారని టీడీపీ వర్గాల సమాచారం. గుంటూరుజిల్లా మంగళగిరి మండలం కాజా, తాడికొండ మండలం కంతేరు గ్రామాల్లో లింగమనేని గ్రూప్స్‌లోని వివిధ కంపెనీలు, కుటుంబ సభ్యుల  పేర్లతో 2014 జూన్ వరకూ 632 ఎకరాల భూములను కొనుగోలు చేశారు. రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్యన ఏర్పాటు చేస్తామని ఓ వైపు సీఎం చంద్రబాబు, మరో వైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటనలు చేస్తూ వచ్చారు. దాంతో ఆందోళన చెందిన లింగమనేని రమేష్ తన భూములను కాపాడుకోవడానికి సీఎంపై ఒత్తిడి తెచ్చారు.

లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది
లింగమనేనితో ఒప్పందం కుదరడంతో.. రాజధాని ఏర్పాటుపై సీఎం స్పష్టత ఇచ్చారు. తాను అప్పటికే కొనుగోలు చేసిన భూమి పరిసర ప్రాంతాల్లో జూన్ 8, 2014 నుంచి సెప్టెంబరు 4, 2014లోపు మరో 168 ఎకరాలకుపైగా భూమిని ఎకరం కనిష్టంగా రూ.పది లక్షల నుంచి గరిష్టంగా రూ.40 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కాజా, కంతేరు గ్రామాలకు ఆనుకుని 804.32 ఎకరాలకుపైగా భూమిలో ఎస్టేట్‌ను ఏర్పాటు చేసి.. ఎవ్వరూ అందులోకి ప్రవేశించకుండా చుట్టూ కంచెలు, సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ముందస్తు ఒప్పందం మేరకు చంద్రబాబు కుటుంబ సభ్యులకు అందులో రహస్యంగా వాటా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రతిఫలంగా రాజధాని ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి లింగమనేని ఎస్టేట్స్ భూములు రాకుండా ముఖ్యమంత్రి సహకరించారు. భూసేకరణ పరిధిలో ఉన్న నిడమర్రు గ్రామాన్ని రాజధాని సరిహద్దుగా నిర్ణయించేశారు. అంటే లింగమనేని భూముల్లో ఒక్క ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్‌లోకి వెళ్లకుండా పక్కా ప్లాన్ ప్రకారం రాజధాని ఏరియాను నిర్ణయించారు. లింగమనేని భూములకు కేవలం పది మీటర్ల లోపే రాజధాని సరిహద్దు రాళ్లు ఏర్పాటయ్యాయి. దీంతో ప్రధాన రాజధాని ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న లింగమనేని ఎస్టేట్స్ భూమి ధర అమాంతం పెరిగిపోయింది. ఇపుడు ఎకరం రూ.ఐదు కోట్ల వరకూ పలుకుతోంది. అంటే.. రాజధాని సరిహద్దులు నిర్ణయించడంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు వల్ల ఒక్క లింగమనేని గ్రూప్‌కే రూ.నాలుగు వేల కోట్లకుపైగా లబ్ది చేకూరిందన్నది అధికారవర్గాల అంచనా. రాజధాని మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా లింగమనేని ఎస్టేట్‌కు చెందిన ఒక్క అంగుళం భూమి కూడా పోకుండా ప్రణాళికలు రూపొందించడం గమనార్హం.

క్విడ్ ప్రోకో అంటే ఇదీ!
మంగళగిరి మండలం కాజా గ్రామం వద్ద లింగమనేని గ్రూప్స్ నిర్మించిన ఐజేఎమ్ అపార్ట్‌మెంట్స్‌లో 700కు పైగా ప్లాట్‌లు, విల్లాలు భారీ ధరలకు అమ్ముడయ్యేలా ప్రభుత్వ పెద్దలు సహకరించారు.  ఫ్లాట్‌లన్నీ అమ్ముడయ్యాక ప్రభుత్వం తాపీగా రాజధాని తుళ్ళూరులో ఏర్పాటు  చేస్తున్నట్టు మరో ప్రకటన ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు రహస్యంగా లింగమనేని గ్రూప్ వాటాలను బదలాయించారు. అంతే కాదు కరకట్ట పక్కన కృష్ణా నది ఒడ్డున అనుమతి లేకుండా.. అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్‌ను సైతం సీఎంకు అప్పగించేశారు. ఆ అతిథి గృహానికి నగిషీలు దిద్దడానికి.. భద్రత ఏర్పాట్లు చేయడానికి.. రహదారుల నిర్మాణానికి చంద్రబాబు రూ.వంద కోట్లకుపైగా ప్రభుత్వ ధనాన్ని మంచి నీళ్లలా ఖర్చు చేశారు. కానీ.. డిసెంబర్ 25 వరకూ ఆ గృహాన్ని సీఎం ‘అనధికార’ అతిథిగృహంగా పిలుస్తూ వచ్చారు. ఈ అతిథి గృహంలో రూ.2.27 కోట్లతో ఎలక్ట్రిక్ పరికరాలను అమర్చడానికి పంపిన ప్రతిపాదనలపై రహదారుల, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ అభ్యంతరం చేశారు. దీంతో చేసేది లేక ఆ అతిథిగృహాన్ని సీఎం తాత్కాలిక అధికార అతిథిగృహంగా మార్చుతూ డిసెంబర్ 25న ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే.. లింగమనేని గెస్ట్‌హౌస్‌ను చంద్రబాబుకు నజరానాగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అసలైన క్విడ్ ప్రోకో అంటే ఇదీ అని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
 
సమీకరణ నుంచి మినహాయించిన భూమి 800 ఎకరాలు
తొలుత లింగమనేని ఆగ్రో డెవలపర్స్, లింగమనేని ఇన్‌ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్ పేర్లతో ఉన్న కంపెనీలను ఆ తర్వాత లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్‌గా మార్చారు. కంతేరు, కాజా, నిడమర్రు గ్రామాల పరిధిలో లింగమనేని ఇన్‌ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్, లింగమనేని ఆగ్రో డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్, లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్, లౌక్యా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ లింగమనేని రమేశ్ తండ్రి పూర్ణభాస్కరరావు, లింగమనేని స్వర్ణకుమారి, లింగమనేని రమేశ్, లింగమనేని సుమన, లింగమనేని ప్రశాంతిల పేర్లతో ఈ భూములను కొనుగోలు చేశారు.
 
లింగమనేని గ్రూప్ కొనుగోలు చేసిన భూముల సర్వే నెంబర్ల వివరాలు..
లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్: ఖాతానెం 100039లో సర్వేనెంబర్లు 221-1బి, 219-2, 297, 286-2, 298, 356-బి, 360, 365, 366, 368-బి, 375-సి; లింగమనేని ఆగ్రో డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్: ఖాతానెంబరు 100126ల సర్వేనెంబర్లు 163-3, 187/బి, 226-2, 257-ఏ3, 260-ఏ, 260-బి, 260-సి, 262-ఏ, 262-బి, 358-1బి; లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్: ఖాతానెంబరు 100157లో సర్వేనెంబరు 206-1; లింగమనేని ప్రశాంతి: సర్వేనెంబర్లు 228-సి2, 229-ఏ, 229-బి, 276, 277; లింగమనేని స్వర్ణకుమారి: ఖాతానెంబరు 1488లో సర్వేనెంబర్లు 238, 239, 240-1, 240-2; లింగమనేని సుమన: ఖాతానెంబరు 1488లో సర్వేనెంబర్లు 278, 279-ఏ, 279-బి, 280, 283-1, 287-5 లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ లింగమనేని రమేష్ తండ్రి పూర్ణభాస్కరరావు: ఖాతానెంబరు 2372లో సర్వేనెంబర్లు 372-2ఏ, 373-ఏ... ఇవి కాకుండా వైట్‌సిటీ ప్రాజెక్ట్సు ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్‌గా లింగమనేని రమేష్ పేరుతో అనేక ఎకరాల భూములు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్లు 3350, 3009, 3900, 4893, 4526, 4117, 64/79/2014, 2801, 2237, 2057,
 ఖాజా గ్రామంలో సర్వే నెంబర్లు 219/2, 365, 221/18.
 
నారాయణ..  నారాయణ!
కొనుగోలు 3,600 ఎకరాలు
చెల్లించినది 432 కోట్లుhttp://img.sakshi.net/images/cms/2016-03/61456867660_Unknown.jpg
ప్రస్తుత విలువ 14,400 కోట్లు

రాజధాని భూసమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. భూదందాలోనూ ముందున్నారు. రాజధాని చుట్టూ వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేసిన ఆయన.. రాజధాని గ్రామాల్లో బినామీ పేర్లతో అత్తెసరు ధరలకే 3,600 ఎకరాల భూములు కొనుగోలు చేశారని అధికారవర్గాలే చెబుతున్నాయి. భూసమీకరణ కింద ఆ భూములు ఇచ్చిన మంత్రి పి.నారాయణకు ఒకే ప్రాంతంలో ఇంటి, వాణిజ్య ప్లాట్ల రూపంలో 400 ఎకరాల భూమి దక్కనుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు.

3,600 ఎకరాలు కొనుగోలు
భూసమీకరణలో భాగంగా మంత్రి నారాయణ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ మకాం వేసి.. విస్తృతంగా పర్యటించారు, గ్రామ సభలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ద్వారా అసైన్డు, లంక భూముల రైతులను గుర్తించి, వారి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అసైన్డు, లంక భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ తన అనుచరులతో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఆందోళన చెందుతోన్న దళిత రైతుల వద్దకు తన ప్రతినిధులతో బేరసారాలు సాగించారు. ఎకరం కనిష్ఠంగా రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. తనకు భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్సు కింద రూ.రెండు లక్షలు ముట్టజెప్పిన నారాయణ.. తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అసైన్డు, లంక భూముల సమీకరణకు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆ భూములపై కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించడానికి కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో తక్కిన మొత్తాన్ని కూడా తనకు భూమిని అమ్మిన వారికి ముట్టజెప్పేశారు. ఆ రైతుల నుంచి జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తన బినామీల పేర్లపై చేయించుకున్నారు. మొత్తమ్మీద రాజధాని గ్రామాల్లో 3,600 ఎకరాల భూములను మంత్రి నారాయణ కొనుగోలు చేసినట్లు రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు.
 
400 ఎకరాలు ఖాయం...
తుళ్లూరు మండలం బోరుపాలెం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాదు. కాబట్టి నారాయణ ఆ గ్రామంలో అసైన్డు భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్క బోరుపాలెంలోనే 50 ఎకరాల అసైన్డు భూమిని కొనుగోలు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి లంకల్లోని సర్వే నంబరు 250 నుంచి 400 వరకూ వివిధ సర్వే నంబర్ల పరిధిలోని మరో 50 ఎకరాలపైగా భూమిని కొనుగోలు చేశారు. బోరుపాలెం, రాయపూడి గ్రామాలకు చెందిన తోకల పేతురు, తోకల అంకులు, మెండెం నాగేశ్వరరావు, మెండెం కోటేశ్వరరావు, బుల్లెద్దుల చిన్నప్ప, వలపర్ల రామయ్య, లాలాది ఆదేయ్య, లాలాది సుందరరావు అనే రైతులు తమ భూములను మంత్రి నారాయణకు విక్రయించామని.. ఆ భూములకు సంబంధించిన పత్రాలన్నీ  వారికే అప్పగించామని ‘సాక్షి’తో చెప్పారు. భూసమీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. రాజధాని గ్రామాల్లో ఎక్కడ భూములు ఉన్నా.. ఒకే ప్రాంతంలో ఇంటి ప్లాట్లు, వాణిజ్య స్థలం కేటాయించేలా దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మంత్రి నారాయణ హస్తం ఉంది. అంటే.. రాజధాని నగరంలో మంత్రి నారాయణ కోరుకున్న ప్రాంతంలో ఇంటి ప్లాట్లు, వాణిజ్య ప్లాట్ల రూపంలో 400 ఎకరాల భూమి లభించడం ఖాయమన్న మాట.
Share this article :

0 comments: