రెండో చార్జిషీట్‌లో జగన్‌కు సమన్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండో చార్జిషీట్‌లో జగన్‌కు సమన్లు

రెండో చార్జిషీట్‌లో జగన్‌కు సమన్లు

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012



* మరో కేసుగా పరిగణించిన సీబీఐ కోర్టు.. నంబరు కేటాయింపు
* సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌కు సమన్లు
* 11న హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ సమర్పించిన రెండో చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణకు స్వీకరించింది. నేరం వేరేదని, లావాదేవీలు వేరని... అందుకే మరో కేసుగా పరిగణించి రెండో చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తున్నామని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎ.పుల్లయ్య ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఐపీసీ 120(బి) రెడ్‌విట్ 420, 420, 468, 471 సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9 కింద చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండో చార్జిషీట్‌కు కోర్టు సీసీ నం.9ను కేటాయించింది. ఇందులో మొదటి నిందితునిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని ఇప్పటికే మొదటి చార్జిషీట్‌లో రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో కోర్టు ఆయనకు పీటీ వారెంట్ జారీచేసింది.

రెండవ, మూడో నిందితులుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌కు సమన్లు జారీచేసింది. వీరు జూన్ 11న హాజరు కావాలని ఆదేశించారు. ప్రతి చార్జిషీట్‌కూ కోర్టు ప్రత్యేక నంబర్ కేటాయిస్తే నిందితులుగా ఉన్న జగన్, సాయిరెడ్డిలకు ప్రతి కేసులోనూ కోర్టు సమన్లు జారీచేస్తుంది. ఇదిలా ఉండగా మొదటి చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు (సీసీ నం.8) ఇందులో నిందితులుగా ఉన్న జగన్ సహా 12 మందికి సమన్లు జారీచేసింది. ఇందులో భాగంగా కోర్టు ముందు హాజరైన వారిలో జగన్ సహా మిగిలిన అందరికీ పూచీకత్తు బాండ్లు తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అభ్యర్థన మేరకు జగన్‌ను మాత్రం కోర్టు ఈనెల 11 వరకు రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది.

మూడో చార్జిషీట్‌ను సమర్పించిన ఎస్పీ
తప్పులతడకగా ఉందంటూ కోర్టు తిరస్కరించిన మూడో చార్జిషీట్‌ను సీబీఐ ఎస్పీ హెచ్.వెంకటేష్ తిరిగి సమర్పించారు. మంగళవారం చాంబర్‌లో న్యాయమూర్తి ఎ.పుల్లయ్యను కలిసి చార్జిషీట్ ప్రతిని అందజేశారు. ఈ నెల 7న సీబీఐ సమర్పించిన మూడో చార్జిషీట్‌లో అనేక సాంకేతిక లోపాలు ఉన్నాయని, నిబంధనల మేరకు చార్జిషీట్, అనుబంధ పత్రాలు లేవంటూ గత 10 రోజుల క్రితం కోర్టు దాన్ని సీబీఐకి తిప్పిపంపిన విషయం తెలిసిందే.

వేధింపుల్లో భాగమే వేర్వేరు చార్జిషీట్లు
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఒకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ చార్జిషీట్లను ముక్కలు ముక్కలుగా దాఖలు చేయడం జగన్‌ను వేధించడంలో భాగమేనని న్యాయనిపుణులు భావిస్తున్నారు. దాదాపు 8 నెలలపాటు విచారణ జరిపిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్జిషీట్‌ను సమర్పించే అవకాశం ఉన్నా... వేర్వేరుగా చార్జిషీట్‌లు దాఖలు చేసి ప్రతి చార్జిషీట్‌లోనూ జగన్‌ను కస్టడీకి కోరాలనే ఉద్దేశంతోపాటు బెయిల్‌ను అడ్డుకునేందుకు ఆరు నుంచి ఎనిమిది చార్జిషీట్‌లు దాఖలు చేయాలని ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Share this article :

0 comments: