ఏ ప్రశ్న వేసినా జగన్ తొణకకుండా, బెణకకుండా (andhrabhoomi) - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏ ప్రశ్న వేసినా జగన్ తొణకకుండా, బెణకకుండా (andhrabhoomi)

ఏ ప్రశ్న వేసినా జగన్ తొణకకుండా, బెణకకుండా (andhrabhoomi)

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012


హైదరాబాద్, మే 26: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని రెండోరోజు శనివారం కూడా సిబిఐ సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు ఏడున్నర గంటలపాటు దిల్‌కుషా అతిథి గృహంలో విచారణ జరిపింది. దీంతో రెండురోజుల్లో మొత్తం 15 గంటలపాటు జగన్‌ను, వాన్‌పిక్ కేసులో నిందితులు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలిసి కొద్దిసేపు సిబిఐ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ విచారించారు. జగన్‌ను విచారించే సమయంలో ఆయన తరఫు న్యాయవాదిని అనుమతించనట్టు సమాచారం. రెండోరోజు విచారణలో ప్రధానంగా జగన్ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులు, పన్ను చెల్లింపుల వ్యవహారాలపైనే గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్టు సమాచారం. మరికొన్ని వివరాల కోసం ఆదివారం ఉదయం 10.30 గంటలకు రావాలని సిబిఐ జగన్‌కు నోటీసులు అందించింది.
రెండోరోజూ మధ్యాహ్నం నుంచే జగన్‌ను ఏక్షణమైనా సిబిఐ అరెస్టు చేస్తారనే వదంతలు వ్యాపించాయి. ఉత్కంఠభరిత వాతావరణం మధ్య చివరకు సాయంత్రం 6.10గంటలకు సిబిఐ అధికారులు జగన్‌ను పంపించివేశారు. ‘మీరు ఇక వెళ్లవచ్చు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు తిరిగి రావాల్సి ఉంటుంది’ అని సిబిఐ కోరడంతో జగన్ అరెస్టుపై ఊహాగానాలకు తెరపడింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోటస్‌పాండ్‌లోని తన ఇంటికి వాహనంలో వెళ్తూ, ఉదయం నుంచి ఎండలో పడిగాపులు పడుతున్న జాతీయ, ప్రాంతీయ మీడియాతో నిమిషంపాటు జగన్ మాట్లాడారు. ‘విచారణ ప్రశాంతంగా జరిగింది. మరికొన్ని అంశాలపై వివరణ కావాలని అడిగారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రమ్మన్నారు. వస్తాను. బై బై’ అంటూ విలేఖర్లకు చెప్పి వాహనంలో జగన్ వెళ్లిపోయారు.
రెండోరోజూ ఏడున్నర గంటల సేపు ఏకబిగిన సాగిన విచారణలో సిబిఐ అధికారుల ప్రశ్నలకు జగన్ దూకుడుగా బదులిచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పన్ను చెల్లింపులు, పెట్టుబడుల సేకరణ, వాన్‌పిక్ ఒప్పందం వివరాలపై సిబిఐ జెడి లక్ష్మీనారాయణ తీక్షణంగా ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. మరోబృందంలో ఉన్న సిబిఐ అధికారులు కూడా వాన్‌పిక్‌పై ప్రశ్నలను సంధించనట్టు తెలిసింది. ఏ ప్రశ్న వేసినా జగన్ తొణకకుండా, బెణకకుండా కచ్చితమైన సమాధానాన్ని ఇచ్చినట్టు సమాచారం.
సిబిఐ అధికారులు దాదాపు 100కు పైగా ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. ఇందులో కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి. ‘మీ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సిఎం క్యాంపు కార్యాలయంలో నివాసమున్న సమయంలో మీరు ఎన్నిసార్లు వచ్చారు? వ్యాన్‌పిక్ ఎంఒయు, ప్రభుత్వం జీవో జారీ చేసిన తేదీల్లో మీరు ఎక్కడున్నారు? సచివాలయానికి ఎప్పుడైనా వెళ్లారా? 2009 ఎన్నికల సమయంలో మీరు ఏయే నియోజకవర్గాల్లో ప్రచారం నిమిత్తం పర్యటించారు? 2009లో 9 లక్షలలోపు ఆదాయం పన్ను చెల్లించిన మీరు 2009 తర్వాత 77కోట్ల రూపాయల మేర అడ్వాన్సు పన్ను చెల్లించే స్థాయికి ఎలా ఎదిగారు? జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్‌కు పెట్టుబడులను ఎలా సేకరించారు? దీనికి సంబంధించి ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు? నిమ్మగడ్డతో మీకు ఎప్పటినుంచి పరిచయం? ఈ పరిచయం ఎలా జరిగింది? సిఎం క్యాంపు కార్యాలయంలో నిమ్మగడ్డను కలిసిన సందర్భాలు ఉన్నాయా?’ అనే ప్రశ్నలను సిబిఐ అధికారులు సంధించినట్టు సమాచారం.
తాను సచివాలయానికి ఇంతవరకు వెళ్లలేదని, మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు, వాన్‌పిక్‌కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, జీవోల జారీకి, జీవోల్లో ఉన్న తేడాలకు తనకు సంబంధం లేదని జగన్ బదులిచ్చినట్టు సమాచారం. తమ కుటుంబం మొదటి నుంచి మైనింగ్ పరిశ్రమల్లో అనుభవం ఉందని, తనకు పరిశ్రమలు పెట్టి అభివృద్ధికి పాటుపడాలనే మక్కువ ఎక్కువని పేర్కొన్నట్టు సమాచారం. తాను ప్రారంభించిన పరిశ్రమల అభివృద్ధికి పెట్టుబడులను చట్టబద్ధంగా సేకరించానని, ఇందులో ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని జగన్ అనర్గళంగా బదులిచ్చినట్టు తెలిసింది. జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించి వచ్చిన పెట్టుబడులు క్విడ్ ప్రోకో అంటే ఫలాపేక్షతోనే వచ్చాయని చెప్పేందుకు తమవద్ద ఆధారాలున్నాయని సిబిఐ పేర్కొన్నట్టు సమాచారం. తనవద్ద ఉన్న సమాచారం మేరకు ఆ ఆధారాలు నిరాధారమైనవి, కల్పితమైనవని, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర పారిశ్రామికవేత్తలను కోరడం తప్పుకాదని జగన్ సహేతుకంగా వివరించినట్టు తెలిసింది. రంధ్రానే్వషణ పద్ధతిలో పరిశ్రమల స్థాపన గురించి పరిశోధిస్తే, దేశంలో ఏ పరిశ్రమను ఏ పారిశ్రామికవేత్తా పెట్టలేరని కూడా జగన్ బదులిచ్చినట్టు తెలిసింది. సిబిఐ అధికారుల బృందం మొదటి అభియోగపత్రంలో అవినీతి జరిగిందని నిరూపించేందుకు 203 డాక్యుమెంట్లు, 66 సాక్ష్యాలు సేకరించామని, రెండో అభియోగపత్రంలో 28 డాక్యుమెంట్లు, 30మంది సాక్షులు, మూడో అభియోగపత్రంలో 142 డాక్యుమెంట్లు, 72 సాక్షులు ఉన్నారని జగన్‌కు వివరించినట్టు తెలిసింది. కాగా వాన్‌పిక్‌కు సంబంధించి ఇంతవరకు సిబిఐ ప్రత్యేకంగా అనుబంధ చార్జిషీటును దాఖలు చేయలేదు. జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించి పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టేందుకు, అందుకు ప్రతిఫలంగా వాన్‌పిక్ సంస్థకు నిర్దేశించిన దానికంటే ఎక్కువగా 14వేల ఎకరాల భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారా? మీ తండ్రి ముఖ్యమంత్రి అయినందు వల్ల ఆయన పలుకుబడిని ఉపయోగించుకున్నారా? అని సిబిఐ ప్రశ్నించినట్టు తెలిసింది. మంత్రి మోపిదేవిని ఎప్పుడెప్పుడు కలిసేవారు? అని కూడా అడిగినట్టు సమాచారం. జగతి పబ్లికేషన్స్ విలువను 3050 కోట్ల రూపాయలని ఎక్కువ చేసి చూపించడానికి ఒక సంస్థ సహాయం తీసుకున్నారా, ఒత్తిడి తెచ్చారా? అని కూడా అడిగినట్టు తెలిసింది.
శనివారం మధ్యాహ్నం జగన్ తదితరులకు భోజనం ఇంటినుంచి వచ్చింది. భోజనం తర్వాత అరగంట విశ్రాంతి తీసుకోవచ్చని జెడి లక్ష్మీనారాయణ సూచించగా, జగన్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. తనకు రాత్రి పగలు అలుపు సొలుపు లేకుండా యాత్రలు చేయడం వల్ల అంత తొందరగా అలిసిపోనని, అవసరమైన ప్రశ్నలు, అలాగే అన్ని సందేహాలు తనను అడిగాలని జగన్ కోరినట్టు తెలిసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చినా, వారిని విచారణ గదిలోకి సిబిఐ అనుమతించలేదని సమాచారం. ఉదయం 10.30 గంటలకు జగన్ వెంట వచ్చిన వారిలో ఎంపి సబ్బం హరి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే ఆళ్లనాని ఉన్నారు. 10.30 గంటలకు జగన్ వచ్చిన వెంటనే ఆయన వెంట వచ్చిన వారిని లాంజ్‌లకే పరిమితం చేశారు.
జగన్ అరెస్టు వార్తను తోసిపుచ్చిన జూపూడి
ఎమ్మెల్యే జూపుడి ప్రభాకరరావు మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను అరెస్టు చేస్తున్నట్టు వచ్చిన వార్తలు వదంతులేన్నారు. రెండు బస్సుల దగ్ధం కేసులో వైఎస్సార్ సిపికి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం పథకం ప్రకారం ఈ దుశ్చర్యలను తమ పార్టీపైకి నెట్టి లబ్ధిపొందాలని చూస్తోందన్నారు. విచారణ గదిలోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. ఎంపి సబ్బం హరి మాట్లాడుతూ మరికొంత ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రానున్నారని చెప్పారు. ప్రభుత్వం కుట్రలను తిప్పిగొడతామని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రానున్నాయని చెప్పారు.
నేడు మోపిదేవితో కలిపి విచారణ
వరుసగా మూడోరోజు ఆదివారం కూడా కడప ఎంపి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు సిబిఐ రంగం సిద్ధం చేసింది. సోమవారం నాంపల్లి కోర్టుకు ఉదయం 10.30 గంటలకు జగన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కోర్టుకు వాన్‌పిక్ కేసులో జగన్ అక్రమమార్గాల ద్వారా పెట్టుబడులు సేకరించినట్టు క్విడ్ ప్రో కో ఉన్నట్టు నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసులో మరికొంత సమాచారాన్ని సేకరించేందుకు, ఇప్పటికే దాఖలు చేసిన మూడు చార్జిషీట్లలోని అభియోగాలపై విచారించేందుకు జగన్‌ను అరెస్టు చేసి తమ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా సిబిఐ కోరనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కోర్టు ఒకవేళ జగన్ అరెస్టుకు అనుమతిస్తే, వెంటనే పోలీసు కస్టడీని కోరి అక్కడినుంచి నేరుగా దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు జగన్‌ను తీసుకొచ్చేందుకు వీలుగా సిబిఐ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కానీ కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి సిబిఐ తదుపరి వ్యూహం ఉంటుందని తెలిసింది. కాగా నగరం నడిబొడ్డున ఉన్న దిల్‌కుషాలో జగన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం, ప్రజలు ఇబ్బందులకు గురికావడం వల్ల, నగరానికి సమీపంలో సురక్షితమైన, అన్ని వౌలిక సదుపాయాలున్న భవనం కోసం సిబిఐ ఆనే్వషిస్తున్నట్టు సమాచారం. కాగా శనివారం సాయంత్రం కస్టడీ అనంతరం నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిని చంచల్‌గూడ జైలుకు సిబిఐ పోలీసులు తరలించారు. మాజీ మంత్రి మోపిదేవి కస్టడీ సోమవారంతో ముగియనుంది. దీంతో ఆదివారం మోపిదేవి, జగన్‌ను కూర్చోబట్టి విలువైన సమాచారాన్ని రాబట్టేందుకు సిబిఐ అన్ని రకాల డాక్యుమెంట్లు సిద్ధం చేసింది. (చిత్రం) దిల్‌కుషా అతిథిగృహం వద్ద అభిమానులను పలకరిస్తున్న జగన్
Share this article :

0 comments: