జగన్ అరెస్ట్ అక్రమం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అరెస్ట్ అక్రమం

జగన్ అరెస్ట్ అక్రమం

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

* అరెస్టు వెనుక కుట్ర ఉంది.. ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకొనేందుకే అరెస్టు చేశారు
* సీబీఐ అడిగిన ప్రతి ప్రశ్నకు జగన్ సమాధానమిచ్చారు
* సీబీఐ దృష్టిలో విచారణకు సహకరించడమంటే నేరాన్ని అంగీకరించడమే
* జగన్ అరెస్టే అక్రమమైనప్పుడు.. కస్టడీకి అప్పగించాలని కోరడం చట్టవిరుద్ధం
* కోర్టు ఎదుట హాజరవడానికి ముందే అరెస్టు చేయడమంటే న్యాయ వ్యవస్థలో 
సీబీఐ జోక్యం చేసుకోవడమే
* చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించి సమన్లు జారీచేసిన తర్వాత నిందితులను వ్యక్తిగత పూచీకత్తుతో విడిచిపెట్టాలి.. తప్పనిసరైతే తప్ప అరెస్టు చేయడానికి వీల్లేదు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు అక్రమం. ఈ అరెస్టు వెనుక కుట్ర ఉంది. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకే ఆయన్ని సీబీఐ అక్రమంగా అరెస్టు చేసింది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అమన్ లేఖీలు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. జగన్‌ను ఆదివారం అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. సోమవారం ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎ.పుల్లయ్య ఎదుట హాజరుపరిచారు. అరెస్టు సమయంలో సీబీఐ అధికారులు ఏమైనా ఇబ్బందిపెట్టారా అని న్యాయమూర్తి జగన్‌ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ముకుల్ రోహత్గి, అమన్ లేఖీలు వాదనలు వినిపించారు. 

‘‘జగన్ మూడు రోజులపాటు సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలిచ్చారు. రోజుకు 10 గంటల చొప్పున మూడు రోజులపాటు సీబీఐ ఆయన్నుంచి వివరాలు తీసుకుంది. రోజుకు 20 గంటలు విచారించినా మాకు అభ్యంతరంలేదు. సీబీఐ దృష్టిలో విచారణకు సహకరించడమంటే నేరాన్ని అంగీకరించడమే. సీబీఐ అడిగిన ప్రతి ప్రశ్నకు జగన్ సమాధానమిచ్చారు. కానీ, వాళ్లు కోరుకున్న విధంగా సమాధానాలు ఇవ్వనందునే అరెస్టు చేశారు. ఇందుకు విచారణ సీడీ ఫైళ్లను పరిశీలించుకోవచ్చు’’ అని తెలిపారు. 

‘‘రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దేశం మొత్తం ఈ ఎన్నికల ఫలితాల వైపు చూస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొనకుండా చేసేందుకే సీబీఐ ఈ చర్యకు పాల్పడింది. రాజకీయ కక్షతో జగన్‌పై చేసిన ఫిర్యాదులో భాగంగానే ఆయనపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. జగన్ మోసం చేశాడంటూ ఇప్పటివరకు ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు’’ అని వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అసలు జగన్‌ను అరెస్టు చేయడమే అక్రమమైనప్పుడు.. కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

అరెస్టు చేయడానికే వీల్లేదు
సీఆర్‌పీసీ 41 (ఎ) కింద నోటీసులు అందుకొని వివరణ ఇచ్చేందుకు హాజరైతే అరెస్టు చేయడానికే వీల్లేదని న్యాయవాదులు స్పష్టం చేశారు. ‘‘జగన్ ఎక్కడికీ పారిపోయే వ్యక్తి కాదు. రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. చట్టాన్ని, సమాజాన్ని సీబీఐ అపహాస్యం చేస్తోంది. అసంబద్ధమైన కారణాలు చూపుతూ జగన్‌ను అక్రమంగా అరెస్టు చేసింది. ఆధారాలను మాయం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారేమోనని ఆరోపిస్తూ సీబీఐ జగన్‌ను అరెస్టు చేసింది. ఆయన ఆధారాలను ఎక్కడ మాయం చేశారు? ఏ సాక్షిని బెదిరించారు అనేందుకు ఒక్క ఆధారమైనా చూపించలేదు. దర్యాప్తు చేపట్టిన 9 నెలల కాలంలో ఒక్కసారైనా ఇటువంటి ఆరోపణలు చేయని సీబీఐ.. ఇప్పుడే హడావుడిగా ఎందుకు చేస్తోంది? అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోయినా, సీబీఐ అత్యవసర పరిస్థితిని సృష్టించింది. 

కోర్టు ఆదేశాలను అనుసరించి, జగన్ సోమవారంనాడు కోర్టు ఎదుట హాజరవ్వాల్సి ఉంది. అయితే, కోర్టుకు హాజరయ్యేందుకు కొన్ని గంటల ముందు ఆయన్ని అరెస్టు చేయడమంటే న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవడమే. చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించి సమన్లు జారీచేసిన తర్వాత సీఆర్‌పీసీ సెక్షన్ 88 కింద వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని నిందితులను విడుదల చేయాల్సి ఉంది. రాజ్యాంగం నిందితునికి మౌనంగా ఉండే హక్కును కూడా కల్పించింది. అరెస్టు అనేది చిట్టచివరి అవకాశమే. అరెస్టును సమర్థించేందుకు అవసరమైన కారణాలను చూపాలి. అలాంటివేమీ చేయకుండా సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడింది’’ అని ఆరోపించారు. 60 శాతం అరెస్టులు అనవసరంగా జరుగుతున్నాయని సీబీఐ మాజీ డెరైక్టర్ చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

దర్యాప్తు పూర్తయ్యిందని కోర్టే వెల్లడించింది
సీబీఐ సమర్పించిన మొదటి చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. విచారణ పూర్తయ్యిందని వెల్లడించిందని వారు గుర్తు చేశారు. జగన్ సహా ఇతర నిందితులు సోమవారం తన ఎదుట హాజరు కావాలని ఈనెల 9వ తేదీనే కోర్టు సమన్లు జారీ చేసిందని తెలిపారు. అయితే, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ఈ 9 నెలల కాలంలో ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదన్నారు. ‘‘కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత.. ఈనెల 25న తమ ఎదుట హాజరుకావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది. జగన్ కోర్టు ముందు హాజరుకాకుండా సీబీఐ అడ్డుకోవడమంటే న్యాయవ్యవస్థ అధికారాలను ఉల్లంఘించడమే అవుతుంది. న్యాయస్థానాలకంటే సీబీఐ సుపీరియర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఐపీసీ 120 (బి), 420, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 కింద మాత్రమే న్యాయస్థానం చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించింది. ఈ సెక్షన్లు రుజువైతే ఏడేళ్లలోపు మాత్రమే శిక్షలు విధించే అవకాశం ఉంది. ఏడేళ్లలోపు శిక్షలు విధించే కేసులో అరెస్టులకు మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పనిసరైతే తప్ప అరెస్టు చేయడానికి వీల్లేదు’’ అని నివేదించారు. ‘‘నిబంధనల ప్రకారం బెయిలివ్వాలని, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే రిమాండ్‌కు తరలించాల్సి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు.

జగన్ సహకరించలేదు: అదనపు సొలిసిటర్ జనరల్ 
మూడు రోజుల విచారణలో జగన్ అధికారులకు సహకరించలేదని సీబీఐ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్‌భాన్ తెలిపారు. ఆయన ఆధారాలను మాయం చేసి, సాక్షులను ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతోనే అరెస్టు చేశామని చెప్పారు. విచారణ సమయంలో తమ ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వలేదని, అందువల్ల 14 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రభావితం చేసి జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల కాలంలో వేలాది కోట్ల రూపాయలు ఆర్జించారని ఆరోపించారు. 

విదేశాలకు డబ్బు పంపి హవాలా ద్వారా తిరిగి భారత్‌కు రప్పించి తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించారని అన్నారు. విదేశీ కంపెనీలైన 2ఐ ప్లూరీ క్యాపిటల్, ఏషియన్ ఇన్‌ఫ్రా సంస్థలు సండూర్ పవర్ కంపెనీలో రూ.140 కోట్లు పెట్టుబడి పెట్టాయని తెలిపారు. వీటిపై విచారణలో భాగంగా లగ్జెంబర్గ్, మారిషస్‌లకు కోర్టు అనుమతితో లెటర్ ఆఫ్ రొగెటరీలు పంపామని చెప్పారు. తన సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన పూర్తి సమాచారం జగన్‌కు మాత్రమే తెలుసునని, ఆయన్ను కస్టడీలో విచారించడం అనివార్యమని వివరించారు.
Share this article :

0 comments: